Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇంగ్లాండ్‌తో చివరి టెస్టుకు ముంగిట టీమ్ ఇండియాకు గట్టి ఎదురుదెబ్బ. గాయం రూపంలో ఇప్పటికే వైస్ కెప్టెన్, ఓపెనర్ కెఎల్ రాహుల్ సేవలను కోల్పోయిన భారత్ తాజాగా నాయకుడిని సైతం దూరం చేసుకునే ప్రమాదంలో పడింది. భారత కెప్టెన్ రోహిత్ శర్మ కోవిడ్-19 పాజిటివ్‌గా తేలాడు. మహమ్మారి బారిన పడిన రోహిత్ శర్మ ప్రస్తుతానికి జట్టు హౌటల్ గదికే పరిమితం అయ్యాడు. జులై 1 నుంచి ఇంగ్లాండ్‌తో ఎడ్జ్‌బాస్టన్ టెస్టుకు రోహిత్ శర్మ అందుబాటులో ఉండేది అనుమానంగా మారింది.
- హౌటల్ గదికే పరిమితమైన భారత కెప్టెన్
- ఇంగ్లాండ్‌తో చివరి టెస్టుకు అనుమానమే?
నవతెలంగాణ-లిసెస్టర్ :
ఇంగ్లాండ్ గడ్డపై చరిత్ర సృష్టించేందుకు ఏడాది కాలంగా ఎదురుచూస్తున్న టీమ్ ఇండియాకు కోవిడ్ బెంగ పట్టుకుంది. నిరుడు పటౌడీ ట్రోఫీలో 2-1తో సిరీస్ విజయం లాంఛనం చేసుకున్న తరుణంలో.. మాంచెస్టర్ టెస్టు తొలి రోజు భారత శిబిరంలో కోవిడ్-19 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. సహాయక సిబ్బంది కరోనా బారిన పడటంతో మాంచెస్టర్ టెస్టును నిరవధిక వాయిదా వేశారు. తాజాగా ఆ టెస్టును జులై 1న రీ షెడ్యూల్ చేయగా.. టీమ్ ఇండియా శిబిరం నుంచి కోవిడ్ కలకలం వెళ్లిపోనేలేదు. భారత కెప్టెన్ రోహిత్ శర్మ కోవిడ్-19 పాజిటివ్‌గా తేలినట్టు శనివారం రాత్రి (3 గంటల సమయంలో) బీసీసీఐ ట్వీట్టర్ వేదికగా తెలిపింది. లిసెస్టర్షైర్తో వార్మప్ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసిన రోహిత్ శర్మ.. రెండో ఇన్నింగ్స్‌లో బరిలోకి దిగలేదు. రెగ్యులర్ కోవిడ్-19 ఆర్టీ పీసీఆర్ పరీక్షల్లో భాగంగా నిర్వహించిన టెస్టులో హిట్‌మ్యాన్ వైరస్ బారిన పడినట్టు తేలింది.
ఓపెనర్‌గా ఎవరు? :
రోహిత్ శర్మ శనివారం కోవిడ్-19 పాజిటివ్‌గా నిర్దారణ అయ్యాడు. మరో నాలుగు రోజుల్లో బర్మింగ్‌హామ్ టెస్టు ఆరంభం కానుంది. బ్రిటన్ నిబంధనల ప్రకారం వరుసగా రెండు ఆర్టీ పీసీఆర్ పరీక్షల్లో నెగెటివ్‌గా తేలితేనే.. ఐసోలేషన్ నుంచి బయటకు రావాల్సి ఉంటుంది. రోహిత్ శర్మకు రెగ్యులర్‌గా కోవిడ్-19 ఆర్టీ పీసీఆర్ పరీక్షలు చేయనున్నారు. బీసీసీఐ వైద్య బృందం రోహిత్ శర్మను ప్రత్యేకంగా పర్యవేక్షిస్తోంది. అయినా, నాలుగు రోజుల వ్యవధిలో రెండుసార్లు వరుసగా కోవిడ్-19 పరీక్షలో నెగెటివ్‌గా రావటం కష్టమే అని చెప్పాలి. రోహిత్ శర్మ కోవిడ్ కారణంగా ఐదో టెస్టుకు దూరమైతే అతడి స్థానంలో ఓపెనింగ్ ఎవరు చేస్తారనే ప్రశ్న ఉదయిస్తోంది. సెలక్టర్లు ఎంపిక చేసిన జట్టులో కెఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మలు ఓపెనర్లు. కెఎల్ రాహుల్ ఇప్పటికే గాయంతో టెస్టుకు అందుబాటులో లేడు. రోహిత్ సైతం దూరమైతే శుభ్‌మన్ గిల్ ఒక్కడే అందుబాటులో ఉంటాడు. దీంతో గిల్‌కు జోడీ ఎవరనేది ప్రశ్న. హనుమ విహారిని గతంలో ఓపెనర్ పాత్ర కోసం ప్రయోగించారు. కెఎస్ భరత్, శ్రేయస్ అయ్యర్లలో ఒకరిని సైతం ఓపెనర్‌గా పంపిస్తారేమో చూడాలి. ఇక ఇంగ్లాండ్‌తో ఐదో టెస్టుకు ప్రత్యామ్నాయ ఓపెనర్‌గా ఎంపికైన మయాంక్ అగర్వాల్ జట్టుతో పాటు లండన్‌కు వెళ్లలేదు. రోహిత్‌కు కోవిడ్‌తో మయాంక్ అగర్వాల్‌ను తక్షణమే ఇంగ్లాండ్‌కు పంపిస్తారేమో చూడాలి. మయాంక్ అగర్వాల్ జట్టుతో చేరినా.. కనీస ప్రాక్టీస్ లేకుండా నేరుగా కీలక టెస్టులో ఆడిస్తారా? అనేది అనుమానమే. ఐర్లాండ్‌తో రెండు టీ20లు ముగిసిన అనంతరం.. ఇషాన్ కిషన్‌ను టెస్టు జట్టులోకి తీసుకొస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది.
నాయకుడు కావాలి! :
రోహిత్ శర్మ కరోనా బారిన పడటంతో ఐదో టెస్టుకు టీమ్ ఇండియా ప్రణాళికలే మారనున్నాయి. తుది జట్టు కూర్పు పూర్తిగా సమతూకం కోల్పోనుంది. ఇక జట్టులో నాయకత్వ శూన్యతకు సైతం ఇది దారితీసింది. రోహిత్ శర్మ డిప్యూటీ కెఎల్ రాహుల్ గాయంతో టెస్టుకు తప్పుకున్న సంగతి తెలిసిందే. విరాట్ కోహ్లి టెస్టు కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పిన అనంతరం.. ఓ టెస్టులో రాహుల్ నాయకత్వం వహించగా.. బుమ్రాకు వైస్ కెప్టెన్సీ అప్పగించారు. ప్రస్తుతం జశ్‌ప్రీత్ బుమ్రా జట్టులో ఉన్నాడు. వైట్‌బాల్ ఫార్మాట్లో ఇటీవల దక్షిణాఫ్రికాపై భారత్‌కు నాయకత్వం వహించిన రిషబ్ పంత్ సైతం అందుబాటులో ఉన్నాడు. రిషబ్ పంత్, జశ్‌ప్రీత్ బుమ్రాలలో ఒకరికి టెస్టు జట్టు సారథ్య బాధ్యతలు అప్పగించే అవకాశం కనిపిస్తోంది. పటౌడీ ట్రోఫీలో తొలి నాలుగు టెస్టులకు విరాట్ కోహ్లి నాయకత్వం వహించాడు. అనంతరం చోటుచేసుకున్న పరిస్థితుల కారణంగా టెస్టు కెప్టెన్సీని త్యజించాడు. తొలి నాలుగు టెస్టులో భారత్‌ను గెలుపు పథాన నడిపించిన విరాట్ కోహ్లికే చివరి టెస్టు సారథ్య పగ్గాలు అప్పగించాలని.. అదే విరాట్ కోహ్లికి బీసీసీఐ ఇచ్చే గౌరవమని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. బోర్డు కెప్టెన్సీ ఆఫర్ చేసినా.. అందుకు విరాట్ సుముఖంగా ఉన్నారా? లేరా? అనేది మరో సమస్య. అటు ఓపెనింగ్, ఇటు కెప్టెన్సీ సమస్యలను భారత జట్టు మేనేజ్మెంట్ ఏ విధంగా అధిగమిస్తుందోనని అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.