Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చివరి టీ20లో 7 వికెట్లతో గెలుపు
- 2-1తో సిరీస్ టీమ్ ఇండియా వశం
దంబుల్లా : శ్రీలంక అమ్మాయిలు పుంజుకున్నారు. సొంతగడ్డపై తొలిసారి భారత్‌పై ఓ టీ20 మ్యాచ్‌లో విజయం నమోదు చేశారు. కెప్టెన్ చమరి ఆటపట్టు (80 నాటౌట్, 48 బంతుల్లో 14 ఫోర్లు, 1 సిక్స్) అజేయ అర్థ సెంచరీతో శ్రీలంక మహిళలు భారత్‌పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించారు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత మహిళలు 20 ఓవర్లలో 5 వికెట్లకు 138 పరుగులు చేసింది. ఓపెనర్ స్మృతీ మంధాన (22, 21 బంతుల్లో 3 ఫోర్లు), సబ్బినేనే మేఘన (22, 26 బంతుల్లో 3 ఫోర్లు), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (39 నాటౌట్, 33 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్), జెమీమా రొడ్రిగస్ (33, 30 బంతుల్లో 3 ఫోర్లు) సమిష్టిగా రాణించారు. కీలక బ్యాటర్లు మెరిసినా.. టీ20 వేగంతో పరుగులు సాధించటంలో విఫలమయ్యారు. షెఫాలీ వర్మ (5) నిరాశపరిచింది. ఛేదనలో విష్మి గుణరత్నె (5), హర్షిత సమరవిక్రమ (13) త్వరగా నిష్క్రమించినా చమరి ఆటపట్టు (80 నాటౌట్) కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో కదం తొక్కింది. నీలాక్షి డిసిల్వ (30, 28 బంతుల్లో 4 ఫోర్లు)తో కలిసి మూడో వికెట్‌కు భారీ భాగస్వామ్యం నెలకొల్పింది. మరో 18 బంతులు మిగిలి ఉండగానే శ్రీలంకకు విజయాన్ని కట్టబెట్టింది. 29 బంతుల్లోనే అర్థ సెంచరీ బాదిన చమరి ఆటపట్టు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలువగా, భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్' అవార్డు అందుకుంది. 2-1తో టీ20 సిరీస్ టీమ్ ఇండియా సొంతం చేసుకుంది. భారత్, శ్రీలంక వన్డే సిరీస్ జులై 1న పల్లెకల్ పోరుతో ఆరంభం కానుంది.