Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐర్లాండ్‌తో రెండో టీ20 నేడు
- సిరీస్ విజయంపై భారత్ గురి
- రాత్రి 9 నుంచి సోనీనెట్వర్క్లో..
నవతెలంగాణ-డబ్లిన్
రెండు మ్యాచుల పొట్టి సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయటంపై భారత్ గురి పెట్టింది. వర్షం ఆటంకం కలిగించిన తొలి టీ20లో గెలుపొందిన హార్దిక్‌సేన.. నేడు రెండో టీ20లోనూ ఐర్లాండ్‌ను చిత్తు చేసేందుకు సిద్ధమవుతోంది. వర్షం ప్రభావిత 12 ఓవర్ల మ్యాచ్‌లో భారత్‌కు కొన్నిసార్లు సవాల్ విసరగలిగిన ఐర్లాండ్.. నేడు రెట్టించిన ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది. భారత్‌తో ఆడిన నాలుగు టీ20ల్లోనూ దారుణ పరాజయాలు మూటగట్టుకున్న ఐర్లాండ్.. విజయంపై కాకపోయినా గట్టి పోటీ ఇచ్చేందుకు ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు ఐసీసీ టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకునేందుకు భారత కుర్రాళ్లు నేటి మ్యాచ్‌ను సద్వినియోగం చేసుకోనున్నారు. భారత్, ఐర్లాండ్ చివరి టీ20 పోరు నేడు. భారత కాలమానం ప్రకారం రాత్రి 9 గంటలకు సోనీ నెట్‌వర్క్‌లో ప్రసారం.
మళ్లీ కొత్త ముఖాలు?: తొలి టీ20లో భారత్ స్పీడ్‌గన్ ఉమ్రాన్ మాలిక్‌కు అరంగేట్రం అందించింది. ఒకే ఒక్క ఓవర్ వేసిన ఉమ్రాన్ మాలిక్ ఏకంగా 18 పరుగులు సమర్పించుకున్నాడు. నేడూ తుది జట్టులో మాలిక్ చోటు నిలుపుకోనున్నాడు. అయితే, అర్షదీప్ సింగ్‌కు అవకాశం ఇవ్వటం కోసం అవేశ్ ఖాన్‌ను పక్కనపెడ్తారేమో చూడాలి. ఐపీఎల్లో నిలకడగా రాణించిన మిడిల్ ఆర్డర్ బ్యాటర్ దీపక్ హుడా. ఐర్లాండ్‌పై ఓపెనర్‌గా 29 బంతుల్లో అజేయంగా 49 పరుగులు చేశాడు. భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. టాప్ ఆర్డర్లోనూ పరుగుల వరద పారించగలనని నిరూపించుకున్నాడు. రుతురాజ్ గైక్వాడ్ ఫిట్నెస్ సాధించలేదు. అతడి స్థానంలో నేడు రాహుల్ త్రిపాఠి లేదా సంజు శాంసన్‌కు అవకాశం దక్కనుంది. భువనేశ్వర్ కుమార్ మ్యాజికల్ షో కొనసాగుతోంది. సఫారీలను వణికించిన భువీ ఐర్లాండ్‌లోనూ స్వింగ్‌తో బ్యాటర్లను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు. నేడు పవర్‌ప్లేలో భువనేశ్వర్‌ను కాచుకోవటం ఐర్లాండ్‌కు కత్తి మీద సామే.
ఇది సరిపోదు! : అగ్రజట్టు భారత్‌కు గట్టి పోటీ ఇచ్చేందుకు ఐర్లాండ్‌లో ఒకరిద్దరు ఆడితే సరిపోదు. సమిష్టి ప్రదర్శన చేయగలిగితేనే అగ్ర జట్లపై విజయాలను ఆశించగలం. తొలి టీ20లో టెక్టర్ సూపర్ ఇన్నింగ్స్ నమోదు చేశాడు. అయితే, ఆ జట్టు రెండు అంశాల్లో పురోగతి సాధించాలి. పవర్‌ప్లేలో మెరుగైన ప్రదర్శన అవసరం. ఇది బ్యాటింగ్, బౌలింగ్ విభాగాలు రెండింటికి వర్తిస్తుంది. భారత బ్యాటర్లను పవర్‌ప్లేలో నిలువరించటంతో పాటు భారత బౌలర్లను పవర్‌ప్లేలో సమర్థవంతంగా ఎదుర్కొవాలి. అప్పుడు టీమ్ ఇండియాకు ఐర్లాండ్ సవాల్ విసిరే స్థితిలో నిలువగలదు. స్పిన్‌కు సహకరించని డబ్లిన్‌లో యుజ్వెంద్ర చాహల్ మాయజాలం సృష్టించాడు. చాహల్ స్పిన్‌ను కాచుకోవటం ఐర్లాండ్‌కు మరో సవాల్ కానుంది.
పిచ్, వాతావరణం : తొలి టీ20కు వరుణుడు ఆటంకం కలిగించాడు. విరామం ఇస్తూ కురిసిన వర్షం కారణంగా పరుగుల వేట బ్యాటర్లకు గగనమైంది. బ్యాట్‌పైకి బంతి రావటం లేదు. నేడు చిరుజల్లులు కురిస్తే అదే పరిస్థితి పునరావృతం కానుంది. వర్షం లేకుంటే.. భారీ స్కోర్లు నమోదు కావడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. టాస్ నెగ్గిన జట్టు తొలుత ఫీల్డింగ్ ఎంచుకోనుంది.
తుది జట్లు (అంచనా) :
భారత్ : ఇషాన్ కిషన్, సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, హార్దిక్ పాండ్య (కెప్టెన్), దినేశ్ కార్తీక్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, అవేశ్ ఖాన్, ఉమ్రాన్ మాలిక్, యుజ్వెంద్ర చాహల్.
ఐర్లాండ్ : పాల్ స్టిర్లింగ్, ఆండీ బల్బిర్నె (కెప్టెన్), గారెత్ డెలానె, హారీ టెక్టర్, లొర్కాన్ టక్కర్ (వికెట్ కీపర్), జార్జ్ డాక్రెల్, మార్ ఎడెర్, ఆండీ మెక్బ్రినె, క్రెయిగ్ యంగ్, జోశ్ లిటిల్, కానర్ ఒల్ఫోర్ట్.
రాణించిన హుడా
ఐర్లాండ్‌తో తొలి టీ20లో భారత్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. వర్షం అంతరాయంతో అంపైర్లు మ్యాచ్‌ను 12 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 108/4 పరుగులు చేసింది. ఆ జట్టులో హారీ టెక్టర్ (64 నాటౌట్, 33 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) 29 బంతుల్లోనే అర్థ సెంచరీ సాధించిన భారీ స్కోరు అందించాడు. భువి, పాండ్య, అవేశ్, చాహల్ తలా ఓ వికెట్ పడగొట్టారు. ఛేదనలో దీపక్ హుడా (49 నాటౌట్, 29 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్), ఇషాన్ కిషన్ (26, 11 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), హార్దిక్ పాండ్య (24, 12 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్‌లు) ధనాధన్ షోతో 9.2 ఓవర్లలోనే భారత్ లక్ష్యాన్ని ఛేదించింది. 111/3తో ఏడు వికెట్ల తేడాతో గెలుపొంది సిరీస్‌లో 1-0 ఆధిక్యం సాధించింది.