Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇంగ్లాండ్‌తో భారత్ ఐదో టెస్టు
ముంబయి : భారత ఓపెనర్, కర్ణాటక స్టార్ బ్యాటర్ మయాంక్ అగర్వాల్ భారత టెస్టు జట్టుకు ఎంపికయ్యాడు. ఇంగ్లాండ్‌తో భారత్ చివరి టెస్టుకు మయాంక్ అగర్వాల్‌ను జట్టులోకి తీసుకుంటున్నట్టు బీసీసీఐ ఆల్ ఇండియా సీనియర్ సెలక్షన్ కమిటీ సోమవారం వెల్లడించింది. ఇంగ్లాండ్ పర్యటనకు ప్రత్యామ్నాయ ఆటగాడిగా ఎంపికైన మయాంక్.. ఎన్సీఏలో ప్రాక్టీస్ చేస్తున్నాడు. భారత కెప్టెన్ రోహిత్ శర్మకు కరోనా సోకటంతో హుటాహుటిన మయాంక్ అగర్వాల్‌ను లండన్‌కు పంపించారు. జట్టులోని ఓపెనర్లు రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్‌లు దూరం కావటంతో.. బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. మయాంక్ అగర్వాల్ బర్మింగ్‌హామ్‌లో భారత జట్టుతో మంగళవారం చేరనున్నాడు. తుది జట్టు ప్రణాళికల్లో భాగంగా అవసరమైతే జులై 1న చివరి టెస్టులో నేరుగా బరిలోకి దిగే అవకాశం కనిపిస్తోంది. శ్రీలంకతో స్వదేశీ సిరీస్‌లో మయాంక్ చివరి టెస్టు ఆడాడు. ఆ సిరీస్‌లో రెండు మ్యాచుల్లో 19.66 సగటుతో 59 పరుగులే చేశాడు.
ఓపెనర్‌గా రోహిత్ శర్మ స్థానాన్ని మయాంక్ అగర్వాల్‌తో భర్తీ చేయనున్న బోర్డు.. కెప్టెన్‌గా అతడి స్థానంలో ఎవరిని నియమిస్తుందనే ఉత్కంఠ కొనసాగుతోంది. ఐదో టెస్టులో గిల్, మయాంక్ ఓపెనర్లుగా రానుండగా.. నాయకత్వ పగ్గాల విషయంలో స్పష్టత లేదు. వార్మప్ మ్యాచ్‌లో అన్ని రంగాల్లోనూ సంతృప్తికర ప్రదర్శన చేసినట్టు చీఫ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పేర్కొన్నారు. ఏకైక వార్మప్ మ్యాచ్‌ను సద్వినియోగం చేసుకునేందుకు లిసెస్టర్‌షైర్ నుంచి సైతం భారత క్రికెటర్లను ఆడించారు. ఈ ప్రయోగం భారత్‌కు మేలు చేసింది. రిషబ్ పంత్, జశ్‌ప్రీత్ బుమ్రాలలో ఒకరికి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది.