Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఒత్తిడికి గురవకుండా, నిర్ణయాలు తీసుకోవటంలో ఎం.ఎస్ ధోని ప్రపంచ క్రికెట్లో మేటీ. నిర్ణయాలు తీసుకునే క్రమంలో, ఒత్తిడి నెలకొన్న పరిస్థితుల్లో అసలు భావోద్వేగాలే లేని వ్యక్తి ఇయాన్ మోర్గాన్!!. క్రికెట్ పుట్టినిల్లు ఇంగ్లాండ్‌కు చారిత్రక ఐసీసీ వన్డే వరల్డ్‌కప్ అందించిన ఐర్లాండ్ స్టార్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నాడు. ఏడున్నర ఏండ్లుగా ఇంగ్లాండ్ వైట్‌బాల్ సారథ్య బాధ్యతలు చూస్తున్న ఇయాన్ మోర్గాన్ సారథ్యానికి, అంతర్జాతీయ క్రికెట్ నుంచి సెలవు తీసుకున్నాడు.
- అంతర్జాతీయ క్రికెట్‌కు ఇయాన్ మోర్గాన్ వీడ్కోలు
- ఇంగ్లాండ్ (మాజీ) సారథి నిర్ణయం
నవతెలంగాణ-లండన్
ఇంగ్లాండ్ క్రికెట్లో ఇయాన్ మోర్గాన్ శకం ముగిసింది. 2019 ఐసీసీ వన్డే వరల్డ్‌కప్ విజయంతో యావత్ ఇంగ్లాండ్‌ను పులకింపచేసిన ఇయాన్ మోర్గాన్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నాడు. టెస్టు క్రికెట్‌కు ఇప్పటికే దూరమైన ఇయాన్ మోర్గాన్ తాజాగా వన్డే, టీ20 ఫార్మాట్ల నుంచి సెలవు తీసుకున్నాడు. ఈ మేరకు మంగళవారం ఏర్పాటు వేసిన విలేకరుల సమావేశంలో ఇయాన్ మోర్గాన్ తన నిర్ణయాన్ని ప్రకటించాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నప్పటికీ.. దేశవాళీ సర్క్యూట్లో కొనసాగుతానని అభిమానులకు ఊరట కలిగించాడు. ది హండ్రెడ్ లీగ్‌లో లండన్ స్పిరిట్ జట్టుకు నాయకుడిగా మోర్గాన్ కొనసాగనున్నాడు. ఐపీఎల్లో సైతం కొనసాగేందుకు మోర్గాన్ సుముఖంగా ఉన్నాడు.
నవ ఇంగ్లాండ్ నిర్మాత : 2015 ఐసీసీ వన్డే వరల్డ్‌కప్‌కు సరిగ్గా రెండు నెలల ముందు ఇంగ్లాండ్ వైట్‌బాల్ కెప్టెన్సీ అందుకున్నాడు ఇయాన్ మోర్గాన్. 2015 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్ గ్రూప్ దశ దాటలేదు. ఆ ఓటమితో ఇయాన్ మోర్గాన్ కుంగలేదు. స్వదేశంలో జరుగనున్న 2019 ప్రపంచకప్ కోసం తనదైన జట్టును తయారు చేసుకున్నాడు. న్యూజిలాండ్ మాజీ కెప్టెన్, ప్రస్తుత ఇంగ్లాండ్ టెస్టు చీఫ్ కోచ్ బ్రెండన్ మెక్‌కలమ్ సారథ్య శైలి నుంచి స్ఫూర్తి పొందిన ఇయాన్ మోర్గాన్.. 'భయమెరుగని, ప్రతీకారేచ్ఛ రహిత ఆట వ్యూహం' డ్రెస్సింగ్‌రూమ్‌కు పరిచయం చేశాడు. భయమెరుగని ఆట తీరుతో ఇంగ్లాండ్ తొలి బంతి నుంచే ప్రత్యర్థులపై విరుచుకుపడితే.. ప్రతీకార భావన లేని ఆట శైలితో ఆటగాళ్లపై ఒత్తిడి లేకుండా పోయింది. ఈ ఫార్ములా ఇంగ్లాండ్ క్రికెట్‌కు గొప్పగా పని చేసింది. ఇప్పటికీ ఇంగ్లాండ్ వైట్‌బాల్‌లో మేటీ జట్టుగా కొనసాగడానికి కారణం ఇయాన్ మోర్గాన్ సారథ్యమే.
చెరగని ముద్ర : ఇయాన్ మోర్గాన్ స్వదేశం ఐర్లాండ్. 2006లో ఐర్లాండ్ తరఫున అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రం చేశాడు. 2009లో ఇంగ్లాండ్ తరఫున అరంగేట్రం చేసిన ఇయాన్ మోర్గాన్.. ఆరేండ్ల కాలంలోనే ఆ జట్టు సారథ్య పగ్గాలు దక్కించుకున్నాడు. 47 ఏండ్ల ఐసీసీ ప్రపంచకప్ చరిత్రలో ఇంగ్లాండ్‌కు చారిత్రక వన్డే వరల్డ్‌కప్ విజయాన్ని అందించాడు. సొంత అభిమానుల నడుమ లార్డ్స్ ఫైనల్లో ఇంగ్లాండ్ ఐసీసీ ప్రపంచకప్ అందుకోవటం చిరస్మరణీయ సన్నివేశం. ఈ విజయంతో ఇయాన్ మోర్గాన్ ఇంగ్లాండ్ క్రికెట్లో దిగ్గజ హోదాగా ఎగబకాడు. 2016 ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌ను ఫైనల్స్‌కు నడిపించిన ఇయాన్ మోర్గాన్.. 2010 ఐసీసీ టీ20 ప్రపంచకప్ నెగ్గిన జట్టులో సభ్యుడు. మ్యాచ్‌ను అర్థం చేసుకోవటంలోనే నిమగమయ్యే ఇయాన్ మోర్గాన్.. భావోద్వేగాలకు అతీతుడు. 2019 ఐసీసీ ప్రపంచకప్ ఫైనల్ ఎంతటి ఉత్కంఠకు దారితీసిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ సమయంలో ఇంగ్లాండ్ డ్రెస్సింగ్‌రూమ్‌లో ఇయాన్ మోర్గాన్ ప్రశాంతంగా ఉన్న దృశ్యాలు టెలివిజన్‌లో ప్రముఖంగా చూపించారు. ' ఎటువంటి భావోద్వేగాలు లేకుండా మ్యాచ్ పరిస్థితులను అర్థం చేసుకునే పనిలో నిమగం అయ్యాడు. ఇయాన్ మోర్గాన్ మానవాతీతుడు' అంటూ వ్యాఖ్యాతలు పేర్కొటం విశేషం.
తనకు తానే సాటి : అలిస్టర్ కుక్ స్థానంలో ఇంగ్లాండ్ నాయకుడిగా 2015లో పగ్గాలు అందుకున్న ఇయాన్ మోర్గాన్.. ఇంగ్లాండ్‌ను వన్డేల్లో 126 మ్యాచుల్లో, టీ20ల్లో 72 మ్యాచుల్లో ముందుండి నడిపించాడు. 2010-12 సమయంలో ఇయాన్ మోర్గాన్ 16 టెస్టులు ఆడాడు. ఐదు రోజుల ఆటలో మోర్గాన్ రెండు శతకాలు సాధించాడు. వైట్‌బాల్ ఫార్మాట్లో ఇంగ్లాండ్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా ఇయాన్ మోర్గాన్ రికార్డు నెలకొల్పాడు. 248 వన్డేల్లో 7701 పరుగులు చేసిన మోర్గాన్ బ్యాటింగ్ సగటు 39.29. స్ట్రయిక్‌రేట్ 91.16. 47 అర్థ సెంచరీలు, 14 శతకాలు ఉన్నాయి. 148 అత్యధిక స్కోరు. పొట్టి ఫార్మాట్లో 115 మ్యాచుల్లో 28.58 సగటుతో 2458 పరుగులు సాధించాడు. స్ట్రయిక్‌రేట్ 136.17. ఈ ఫార్మాట్లో 14 అర్థ సెంచరీలు మోర్గాన్ పేరిట నమోదయ్యాయి. బ్యాటర్‌గా అసమాన ఇన్నింగ్స్‌లు ఆడిన ఇయాన్ మోర్గాన్.. నాయకుడిగా సహచర ఆటగాళ్ల నుంచీ అదే తరహా ప్రదర్శనలు రాబట్టాడు. ఇంగ్లాండ్ డ్రెస్సింగ్‌రూమ్ గౌరవ మన్ననలు పొందిన కెప్టెన్‌గా ఇయాన్ మోర్గాన్ నిలిచిపోతాడు.
రెండో ఇన్నింగ్స్‌లో..! : ఇయాన్ మోర్గాన్ ఈ సెప్టెంబర్‌తో 36 వసంతాలు పూర్తి చేసుకోనున్నాడు. కొద్ది కాలంగా నిలకడగా విఫలం అవుతున్న మోర్గాన్‌ను గాయాలు సైతం వేధిస్తున్నాయి. తాజాగా నెదర్లాండ్స్‌తో వన్డే సిరీస్‌లో తొలి రెండు మ్యాచుల్లో ఇయాన్ మోర్గాన్ సున్నా పరుగులకే వికెట్ చేజార్చుకున్నాడు. ఫిట్నెస్ సమస్యలతో మూడో వన్డేకు బెంచ్‌కు పరిమితం అయ్యాడు. దీంతో మోర్గాన్ రిటైర్మ్ంట్పై ఊహాగానాలు మొదలయ్యాయి. అద్వితీయ కెరీర్‌కు ముగింపు పలుకుతూ మంగళవారం మోర్గాన్ వీడ్కోలు ప్రకటన చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో ఇయాన్ మోర్గాన్ నుంచి క్రికెట్ విన్యాసాలకు తోడు మరిన్ని ఆశించవచ్చు. ది హండ్రెడ్ లీగ్‌లో కొనసాగనున్న ఇయాన్ మోర్గాన్.. రానున్న ఇంగ్లాండ్, భారత్ వైట్‌బాల్ సిరీస్‌లో వ్యాఖ్యాతగాను అలరించనున్నాడు.
ఇయాన్ మోర్గాన్‌ను 2019 ప్రపంచకప్‌ను ఇంగ్లాండ్‌కు సాధించిన సారథిగానే చూడలేం. అతడి గొప్పతనం ఆ విజయానికి మాత్రమే పరిమితం కాదు. ఆధునిక క్రికెట్ వ్యూహ పద్దతులను సమూలంగా మార్చివేసిన ఘనత మోర్గాన్‌కు దక్కుతుంది. ప్రపంచ క్రికెట్ చూసిన అతి గొప్ప నాయకులలో ఇయాన్ మోర్గాన్ ఒకరు. ఆటపై మోర్గాన్ ప్రభావం రానున్న తరాల్లోనూ ఉంటుంది!.
ఐర్లాండ్ తరఫున ఆరంభించి.. ఇంగ్లాండ్ తరఫున రెండు ప్రపంచకప్ విజయాలు అందుకోవటం నా అదృష్టం. ఇంతటి విజయవంతమైన కెరీర్‌ను నేను ఊహించలేదు. అంతర్జాతీయ క్రికెట్లో కుటుంబం సహకారం కీలకం. అన్ని సమయాల్లో నా కుటుంబం నాకు అండగా నిలిచింది. నా జట్టు సహచరులు, కోచ్‌లు, సహాయక సిబ్బంది అందరికీ ధన్యవాదాలు. ఆటగాడిగా, నాయకుడిగా సాధించిన విజయాల పట్ల ఎంతో గర్వపడతాను. ఇంగ్లాండ్ క్రికెట్ రానున్న రోజుల్లో మరింత గొప్ప స్థాయికి చేరుకుంటుంది. ఈ నిర్ణయం తీసుకోవడానికి ముందు సన్నిహితులు, జట్టు మేనేజ్మెంట్తో చర్చించాను. అందరూ నన్ను అర్థం చేసుకున్నారు. దేశవాళీ క్రికెట్లో నా ఆటను ఆస్వాదించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను'
- ఇయాన్ మోర్గాన్