Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వేధిస్తోన్న నాలుగు చిక్కు సమస్యలు
- రేపటి నుంచి భారత్, ఇంగ్లాండ్ ఐదో టెస్టు
భారత్, ఇంగ్లాండ్ ఏడాది నిరీక్షణ అనంతరం పటౌడీ ట్రోఫీలో చివరి టెస్టు ఆడేందుకు సిద్ధమయ్యాయి. భారత శిబిరంలో కోవిడ్ కేసులతో నిరుడు మాంచెస్టర్ టెస్టు అర్థాంతరంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. నాలుగు టెస్టులు ముగిసిన సిరీస్‌లో భారత్ 2-1తో ముందంజలో కొనసాగుతోంది. జులై 1 నుంచి ఎడ్జ్‌బాస్టన్‌లో చివరి టెస్టు ఆరంభం కానుంది. ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్ న్యూజిలాండ్‌పై క్లీన్‌స్వీప్ విజయంతో ఆతిథ్య ఇంగ్లాండ్ జోరుమీదుంది. ఐపీఎల్ తర్వాత నేరుగా రెడ్‌బాల్ ఫార్మాట్లో ఆడనున్న టీమ్ ఇండియా తుది జట్టు కూర్పుపై పలు చిక్కు ప్రశ్నలు ఎదుర్కొంటుంది. ఇంగ్లాండ్‌కు సవాల్ విసిరేందుకు భారత్ ముందుగా తుది జట్టు కూర్పు సవాళ్లను అధిగమించాల్సి ఉంది!.
నవతెలంగాణ క్రీడావిభాగం
రెండో ఓపెనర్ ఎవరు?!
భారత కెప్టెన్ రోహిత్ శర్మ కరోనా వైరస్ బారిన పడ్డాడు. వైద్యుల పర్యవేక్షణలో లిసెస్టర్‌లోని జట్టు హోటల్ గదిలోనే రోహిత్ శర్మ కోలుకుంటున్నాడు. చివరి టెస్టుకు ఇంకా ఒక్క రోజు సమయం మాత్రమే మిగిలి ఉంది. రోహిత్ శర్మ కోవిడ్ నుంచి కోలుకుని ఫిట్నెస్ సాధిస్తే ఓపెనింగ్ సమస్య అక్కడితో ముగిసిపోతుంది. కానీ, రోహిత్ శర్మ కోవిడ్‌ను జయించకపోతే చివరి టెస్టులో శుభ్‌మన్ గిల్‌కు తోడుగా ఇన్నింగ్స్‌ను ఆరంభించేది ఎవరనేది ప్రశ్నార్థకం. మయాంక్ అగర్వాల్‌ను పిలిపించారు, అతడు ఇప్పటికే జట్టుతో చేరాడు. కానీ మయాంక్ రెండు సెషన్లు మాత్రమే బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. జట్టులో ఉన్న ఇతర ప్రత్యామ్నాయాలు చతేశ్వర్ పుజారా, కెఎస్ భరత్. గతంలో పుజారా ఓపెనర్ పాత్ర పోషించాడు. మయాంక్ అగర్వాల్ టెస్టు స్పెషలిస్ట్ ఓపెనర్. కానీ నేరుగా కీలక టెస్టు బరిలో నిలుపటం సాహాసమే అవుతుంది. కొత్త బంతితో జేమ్స్ అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్, మాథ్యూ పాట్స్‌ను ఎదుర్కొవటం అంత సులువు కాదు. కెఎస్ భరత్ రెండో వికెట్ కీపర్‌గా జట్టులోకి వచ్చాడు. వార్మప్ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో అజేయంగా 70 పరుగులు చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో ఓపెనర్‌గా 43 పరుగులు సాధించాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో భరత్‌కు ఓపెనింగ్ చేసిన అనుభవం ఉంది. వార్మప్ మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ మూడుసార్లు బ్యాటింగ్ చేశాడు. శుభ్‌మన్ గిల్‌కు తోడు పుజారా, మయాంక్, భరత్‌లలో ఒకరిని ఎంచుకోవాల్సి ఉంటుంది.
నం.3 బ్యాటర్ ఎవరు?!
ఈ ఏడాది స్వదేశంలో శ్రీలంకతో సిరీస్‌కు చతేశ్వర్ పుజారా, అజింక్య రహానెలను సెలక్టర్లు తప్పించారు. రహానె వైఫల్య గాథ కొనసాగుతుండగా.. ఇంగ్లీష్ కౌంటీల్లో పుజారా చెలరేగాడు. పది మ్యాచుల్లో పరుగుల వరద పారించాడు. ఇంగ్లాండ్‌తో చివరి టెస్టుకు ఎంపికయ్యాడు. 2020 ఆరంభం నుంచి పుజారా 20 టెస్టులు ఆడగా, అతడి బ్యాటింగ్ సగటు 26.29. మిడిల్ ఆర్డర్లో విరాట్ కోహ్లికి తోడుగా జాతీయ సెలక్టర్లు కొత్త బ్యాటర్లను అన్వేషిస్తున్నారు. లిసెస్టర్ వార్మప్ మ్యాచ్‌లో పుజారా నిరాశపరిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో లిసెస్టర్‌షైర్ తరఫున ఆడిన పుజారా.. మహ్మద్ షమి బంతికి సున్నా పరుగులకే క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. రెండో ఇన్నింగ్స్‌లో ఇండియన్ ఎలెవన్ తరఫున 22 పరుగులు చేశాడు. వార్మప్ ప్రదర్శన ఆధారంగా పుజారా నిరాశపరిచాడు. మరి, అతడిని నం.3 బ్యాటర్‌గా కొనసాగించాలా? వద్దా? అనేది తేల్చుకోవాలి. పుజారా లేని వేళ హనుమ విహారి నం.3 స్థానంలో మెప్పించాడు. ఈ స్థానానికి అతడు గట్టి పోటీదారు. వార్మప్‌లో విహారి మూడు సార్లు బ్యాటింగ్ చేశాడు. 3, 20, 23 పరుగులు సాధించాడు. ఈ స్థానంలో పుజారా విలువైన అనుభవం గడించాడు. నిరుడు, నాలుగు టెస్టుల్లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన జాబితాలో పుజారాది మూడో స్థానం. లార్డ్స్, ఓవల్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. మిడిల్ ఆర్డర్లో పుజారా, విహారి ఇద్దరూ చోటు సాధించేందుకు అవకాశం ఉంది. అందుకు, శ్రేయస్ అయ్యర్‌ను తుది జట్టు నుంచి తప్పించాలి. కెరీర్ తొలి నాలుగు టెస్టుల్లో మెప్పించిన అయ్యర్.. విదేశీ గడ్డపై తొలి టెస్టు ఆడాల్సి ఉంది. విదేశీ టెస్టుల్లో విశేష అనుభవం కలిగిన హనుమ విహారిని తప్పించే సాహాసం చేయడానికి జట్టు మేనేజ్మెంట్ పూనుకోదు.
అశ్విన్‌కు చోటు దక్కేనా?!
పటౌడీ ట్రోఫీ తొలి నాలుగు టెస్టుల్లో రవిచంద్రన్ అశ్విన్ బెంచ్‌కు పరిమితం అయ్యాడు. ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్‌లను తుది జట్టులోకి తీసుకున్న భారత్.. ఆ తర్వాత ఇంగ్లాండ్‌పై వరుస టెస్టుల్లో స్పిన్ ఆల్‌రౌండర్‌గా రవీంద్ర జడేజాకు ఓటేసింది. మెరుగైన బ్యాటింగ్ నైపుణ్యాలతో జడేజా తుది జట్టులో నిలిచాడు. కోవిడ్ కారణంగా ఆలస్యంగా ఇంగ్లాండ్‌కు చేరుకున్న అశ్విన్.. వార్మప్ మ్యాచ్‌లో బౌలింగ్ చేయగలిగాడు. శుభ్‌మన్ గిల్ వికెట్ పడగొట్టి మ్యాచ్ ఫిట్నెస్ నిరూపించుకున్నాడు. గత ఏడాదితో పోల్చితే ఇంగ్లాండ్ పిచ్‌లు మార్పు చెందాయి. డ్యూక్ బంతులు వికెట్‌కు ఇరువైపులా స్వింగ్‌కు అంత సహకరించటం లేదు. పిచ్ పచ్చికతో పేసర్ల స్వర్గధామంగా ఉన్నప్పటికీ కొత్త డ్యూక్ బంతులు స్పిన్నర్లను తెరపైకి తీసుకొస్తున్నాయి. ఇటీవల న్యూజిలాండ్, ఇంగ్లాండ్ టెస్టులో ఇంగ్లీష్ స్పిన్నర్ జాక్ లీచ్ పది వికెట్లు పడగొట్టాడు. ఎడ్జ్‌బాస్టన్ పిచ్ స్వభావం, పరిస్థితులు అశ్విన్ అవకాశాలను తేల్చనున్నాయి. కివీస్‌తో సిరీస్‌కు తయారు చేసిన పిచ్‌లనే ఇక్కడా వాడితే కచ్చితంగా అశ్విన్ తుది జట్టులో నిలుస్తాడు. లేదంటే, భారత్ నలుగురు పేసర్లు, ఓ స్పిన్నర్‌తో బరిలోకి దిగనుంది.
మూడో ప్రధాన పేసర్ ఎవరు?!
బౌలింగ్ విభాగానికి జశ్‌ప్రీత్ బుమ్రా నాయకుడు. సీనియర్ పేసర్ మహ్మద్ షమితో కలిసి కొత్త బంతితో బుమ్రా నిప్పులు చెరుగుతున్నాడు. లిసెస్టర్ వార్మప్ మ్యాచ్‌లోనూ ఈ జోడీ కనువిందు చేసే స్పెల్స్ వేసింది. పేస్ ఆల్‌రౌండర్‌గా శార్దుల్ ఠాకూర్ జట్టులో చోటు సాధించనుండగా.. మూడో ప్రధాన పేసర్ రేసులో మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్ పోటీపడుతున్నారు. నిరుడు మహ్మద్ సిరాజ్ గొప్పగా రాణించాడు. లార్డ్స్‌లో ఎనిమిది వికెట్ల ప్రదర్శనతో చెలరేగాడు. నాలుగు టెస్టుల్లో 14 వికెట్లు పడగొట్టాడు. ఓవల్ టెస్టు అనంతరం ఉమేశ్ యాదవ్ తుది జట్టులోకి వచ్చాడు. నాల్గో టెస్టులో కీలక జో రూట్ వికెట్ సహా ఆరు వికెట్లు తీసుకున్నాడు. మాంచెస్టర్ టెస్టుకు రంగం సిద్ధం చేసుకున్నాడు. ఓవల్ టెస్టు అనంతరం సిరాజ్, ఉమేశ్ మూడేసి టెస్టుల్లో ఆడారు. ఇద్దరిలో ఎవరికీ అవకాశం దక్కినా వికెట్ల వేటలో కసి చూపించటం ఖాయం.
డబ్ల్యూటీసీ
పాయింట్లు కీలకం!
ఇంగ్లాండ్‌తో చివరి టెస్టు భారత్‌కు అత్యంత కీలకం. ఇది కేవలం పటౌడీ ట్రోఫీ అందుకోవడానికి పరిమితం కాదు. ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో భారత్ స్థానాన్ని ప్రభావితం చేయగలదు. భారత్ ప్రస్తుతం డబ్ల్యూటీసీ పాయింట్ట పట్టికలో 58.33 గెలుపు శాతంతో మూడో స్థానంలో కొనసాగుతోంది. భారత్ స్వదేశంలో ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టులు, విదేశీ గడ్డపై బంగ్లాదేశ్‌తో రెండు టెస్టులు ఆడాల్సి ఉంది. చివరి ఏడు టెస్టుల్లో నెగ్గితే భారత్ గెలుపు శాతం 74.53కి చేరుతుంది. డబ్ల్యూటీసీ ఫైనల్లో చోటుకు అది సరిపోతుంది. ఒకవేళ ఏడు టెస్టుల్లో ఒక్క ఓటమి చవిచూస్తే గెలుపు శాతం 68.98కు, రెండింట ఓడితే 63.47కు పడిపోతుంది. ఎడ్జ్‌బాస్టన్‌లో చివరి టెస్టు టీమ్ ఇండియా అత్యంత కీలకం కానుంది. డబ్ల్యూటీసీ ఫైనల్స్ రేసు నుంచి ఇప్పటికే నిష్క్రమించిన ఇంగ్లాండ్‌కు బర్మింగ్‌హామ్ ఫలితం ప్రభావం ఉండబోదు.