Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సిరీస్ నిర్ణయాత్మక సమరం. పర్యాటక జట్టు చారిత్రక విజయం ముంగిట నిలిచింది. అసమాన ప్రదర్శనలు, అద్వితీయ విన్యాసాలు, ఉత్కంఠ భరిత సెషన్లతో కూడిన టెస్టు సవాల్‌కు ముగింపు పోరు వేరే లెవెల్లో ఉండేది. కానీ ఏడాది తర్వాత జరుగుతున్న సిరీస్ చివరి టెస్టు కావటంతో నిజానికి పటౌడీ ట్రోఫీకి ఆ స్థాయి క్రేజ్ లేదు!. నిరుడు భారత శిబిరంలో కోవిడ్ కేసుతో మాంచెస్టర్ టెస్టు వాయిదా పడగా.. తాజాగా అదే టెస్టుకు ముందు భారత కెప్టెనే కరోనా బారిన పడినా తుది పోరు యథాతథంగా సాగేందుకు రంగం సిద్ధమైంది. భారత్, ఇంగ్లాండ్ పటౌడీ ట్రోఫీ చివరి టెస్టు నేటి నుంచి ఆరంభం.
- మధ్యాహ్నాం 3 నుంచి సోనీ నెట్‌వర్క్‌లో
- ఇంగ్లాండ్‌తో చివరి టెస్టు నేటి నుంచి
- విజయంపై కన్నేసిన టీమ్ ఇండియా
- సిరీస్ సమంపై స్టోక్స్గ్యాంగ్ గురి
నవతెలంగాణ-బర్మింగ్‌హామ్
పాత సమరం, కొత్తగా ముగిసేందుకు రంగం సిద్దమైంది. పటౌడీ ట్రోఫీ భారత్ గూటికి చేరే సమయంలో.. చివరి టెస్టు వాయిదా పడింది. నాలుగు టెస్టుల అనంతరం భారత్ 2-1తో ముందంజలో కొనసాగుతోంది. చివరి టెస్టు కోసం ఏడాది తర్వాత మళ్లీ ఇంగ్లాండ్ పర్యటనకు వచ్చిన టీమ్ ఇండియా.. అసంపూర్తిగా మిగిలిపోయిన పటౌడీ ట్రోఫీని ముగించేందుకు ఎదురుచూస్తుంది. అయితే, భారత్‌కు ఈ సారి భిన్నమైన ఇంగ్లాండ్ ఎదురు కానుంది. గత ఏడాది వరుస వైఫల్యాలతో చతికిల పడిన ఇంగ్లాండ్ ఎదురవగా.. తాజాగా వరల్డ్ చాంపియన్‌కు వైట్‌వాష్ ఓటమి రుచి చూపించిన ఉత్సాహంలో ఉన్న ఇంగ్లాండ్ సవాల్ విసురుతోంది. ఏకైక మ్యాచ్‌లో పొరపాట్లకు చోటిచ్చే పరిస్థితులు లేని వేళ ఇంగ్లాండ్ గడ్డపై మూడో టెస్టు సిరీస్ విజయంపై టీమ్ ఇండియా కన్నేసింది.
విరాట్‌పైనే భారం : విదేశీ గడ్డపై టెస్టు సిరీస్ విజయాలు సాధించాలనే తపన విరాట్ కోహ్లిలో బలంగా ఉంది. ఐదుగురు బౌలర్ల ఫార్ములాకు మద్దతుగా నిలిచి విదేశాల్లో గొప్ప ప్రదర్శనలకు పునాది వేశాడు. ఆస్ట్రేలియా గడ్డపై బోర్డర్ గవాస్కర్ చారిత్రక విజయంలో కోహ్లి భాగం కాలేకపోయాడు. తాజాగా ఇంగ్లాండ్‌పై సిరీస్ విజయానికి గట్టి పునాది వేసినా.. చివరి టెస్టు సమయానికి సారథ్యం వదులుకున్నాడు. రెండేండ్లుగా బ్యాటర్‌గా నిరాశపరుస్తున్న విరాట్ కోహ్లి.. చివరి టెస్టులో భారత్‌ను నడిపించాల్సిన బాధ్యత తీసుకోవాలి. వార్మప్ మ్యాచ్‌లో రాణించిన విరాట్ కోహ్లి నేడు బర్మింగ్‌హామ్‌లో భారత్‌కు తొలి టెస్టు విజయాన్ని అందిస్తాడేమో చూడాలి.
కెప్టెన్ రోహిత్ శర్మ దూరం కావటం భారత్‌కు గట్టి ఎదురుదెబ్బ. తొలి నాలుగు టెస్టుల్లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ రోహిత్. 364 పరుగులతో విజయాల్లో కీలకంగా నిలిచాడు. మరో ఓపెనర్ కెఎల్ రాహుల్ 315 పరుగులతో విలువైన భాగస్వామ్యాలు నెలకొల్పాడు. ఈ ఇద్దరూ నేటి టెస్టుకు అందుబాటులో లేరు. యువ శుభ్‌మన గిల్‌కు తోడుగా పుజారా, మయాంక్ అగర్వాల్‌లలో ఒకరు ఓపెనింగ్ చేసే అవకాశం కనిపిస్తోంది. హనుమ విహారి, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్లు మిడిల్ ఆర్డర్ బాధ్యత తీసుకోనున్నారు. రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, అశ్విన్‌లు లోయర్ ఆర్డర్లో కీలకం కానున్నారు. పేస్ దళపతి జశ్‌ప్రీత్ బుమ్రా కీలక టెస్టులో జట్టును నడిపించనున్నాడు. సిరాజ్, షమిలతో కలిసి పేస్ బాధ్యతలు పంచుకోనున్నాడు.
తస్మాత్ జాగ్రత్త! : ఇది కొత్త ఇంగ్లాండ్. కివీస్‌తో సిరీస్‌కు ముందు చివరి 17 టెస్టుల్లో ఒక్క విజయమే సాధించిన ఇంగ్లాండ్.. చివరి సిరీస్‌లోనే ఏకంగా మూడు విజయాలు నమోదు చేసింది. మూడు టెస్టుల్లో ఇంగ్లాండ్ నాల్గో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసి లక్ష్యాలను ఛేదించటం విశేషం. తొలి నాలుగు టెస్టుల్లో 48.93 స్ట్రయిక్‌రేట్‌తో 184 పరుగులు చేసిన జానీ బెయిర్‌స్టో.. తాజాగా కివీస్‌పై 120.12 స్ట్రయిక్‌రేట్‌తో 394 పరుగులు పిండుకున్నాడు. స్టార్ బ్యాటర్ జో రూట్ శతకాల మోత మోగించాడు. కెప్టెన్ బెన్ స్టోక్స్ తనదైన మెరుపు ఇన్నింగ్స్‌లు నమోదు చేశాడు. దీంతో ఇంగ్లాండ్ బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా మారింది. దిగ్గజ పేస్ ద్వయం జేమ్స్ అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్లు భారత బ్యాటర్లకు సవాల్ విసరనున్నారు. మాథ్యూ పాట్స్‌ను ఎదుర్కొవటం భారత్‌కు కొత్త పరీక్ష కావచ్చు!. కెప్టెన్ బెన్ స్టోక్స్, చీఫ్ కోచ్ బ్రెండన్ మెక్‌కలమ్ కాంబినేషన్ ఇంగ్లాండ్‌కు గొప్ప ఫలితాన్ని ఇస్తోంది. గత ఏడాది భారత్ చేతిలో దెబ్బతిన్న ఇంగ్లాండ్.. ఈ ఏడాది గట్టి దెబ్బతో పటౌడీ ట్రోఫీని సమం చేసేందుకు చూస్తోంది.
పిచ్, వాతావరణం : ఎడ్జ్‌బాస్టన్ పిచ్ లేత గోధుమ రంగులో కనిపిస్తోంది. బహుశా, ఇది వాస్తవికతకు అద్దం పట్టకపోవచ్చు!. టెస్టు మ్యాచ్ తొలి రోజు మధ్యాహ్నాం ఇక్కడ వర్షం కురిసే సూచనలు ఉన్నాయి. రెండో రోజు ఆటలో ఉదయం సెషన్ సైతం వర్షం ప్రభావానికి గురయ్యే పరిస్థితులు ఉన్నాయి. టాస్ నెగ్గిన జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకునేందుకు మొగ్గుచూపవచ్చు!.
తుది జట్లు :
ఇంగ్లాండ్ : అలెక్స్ హేల్స్, జాక్ క్రావ్లీ, ఒలీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్ (కెప్టెన్), శామ్ బిల్లింగ్స్ (వికెట్ కీపర్), మాథ్యూ పాట్స్, స్టువర్ట్ బ్రాడ్, జాక్ లీచ్, జేమ్స్ అండర్సన్.
భారత్ (అంచనా) : శుభమన్ గిల్, చతేశ్వర్ పుజారా/మయాంక్ అగర్వాల్, హనుమ విహారి, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, శార్దుల్ ఠాకూర్/అశ్విన్, మహ్మద్ షమి, మహ్మద్ సిరాజ్, జశ్‌ప్రీత్ బుమ్రా (కెప్టెన్).
0
ఎడ్జ్‌బాస్టన్‌లో భారత్ నెగ్గిన టెస్టులు 0. ఆరు టెస్టుల్లో పరాజయం చవిచూడగా, 1986లో డ్రా చేసుకున్నారు.
1
భారత్‌కు కెప్టెన్సీ వహిస్తున్న తొలి స్పెషలిస్ట్ పేసర్ జశ్‌ప్రీత్ బుమ్రా. అనిల్ కుంబ్లే అనంతరం సారథ్యం అందుకున్న తొలి బౌలర్‌గా, కపిల్ దేవ్ తర్వాత నాయకత్వ పగ్గాలు దక్కించుకున్న తొలి పేసర్‌గా బుమ్రా నిలిచాడు.
2
ఇంగ్లాండ్ గడ్డపై ఓ సిరీస్‌లో భారత్ గెలిచిన అత్యధిక టెస్టులు 2. ఇప్పటివరకు మూడు టెస్టుల్లో విజయం సాధించలేదు.
కెప్టెన్ బుమ్రా
ఇంగ్లాండ్‌తో చివరి టెస్టుకు జశ్‌ప్రీత్ బుమ్రా భారత కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. రోహిత్ శర్మ గురువారం సైతం కోవిడ్ పాజిటివ్‌గా రావటంతో సెలక్టర్లు బుమ్రాకు సారథ్య పగ్గాలు అందించారు. రిషబ్ పంత్‌కు వైస్ కెప్టెన్సీ అప్పగించారు. కపిల్ దేవ్ తర్వాత భారత జట్టుకు కెప్టెన్సీ వహిస్తున్న తొలి పేసర్‌గా బుమ్రా రికార్డు సృష్టించాడు. క్రికెట్లో ఏ స్థాయిలోనైనా కెప్టెన్సీ వహించటం బుమ్రాకు ఇదే ప్రథమం కావటం గమనార్హం.