Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శ్రీలంకపై 4 వికెట్ల తేడాతో గెలుపు
- రాణించిన దీప్తి శర్మ, హర్మన్‌ప్రీత్ కౌర్
పల్లెకల్ : దీప్తి శర్మ (22 నాటౌట్, 3/25) ఆల్‌రౌండ్ ప్రదర్శనతో తొలి వన్డేలో శ్రీలంకపై భారత్ ఘన విజయం సాధించింది. 172 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత మహిళల జట్టు ఆరు వికెట్లు కోల్పోయి 38 ఓవర్లలోనే ఛేదించింది. యువ ఓపెనర్ షెఫాలీ వర్మ (35, 40 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్‌తో చెలరేగింది. మిడిల్ ఆర్డర్లో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (44, 63 బంతుల్లో 3 ఫోర్లు), హర్లీన్ డియోల్ (34, 40 బంతుల్లో 2 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్‌లు నమోదు చేశారు. దీప్తి శర్మ (22 నాటౌట్, 41 బంతుల్లో) సమయోచితంగా రాణించింది. టెయిలెండర్ పూజ వస్ట్రాకర్ (21 నాటౌట్, 19 బంతుల్లో 2 సిక్స్‌లు) ధనాధన్ షోతో కదం తొక్కింది. యస్టికా భాటియా (1), స్మృతీ మంధాన (4), రిచా ఘోష్ (6) నిరాశపరిచారు. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక మహిళల జట్టు 48.2 ఓవర్లలో 171 పరుగులకు కుప్పకూలింది. నీలాక్షి డిసిల్వ (43, 63 బంతుల్లో 4 ఫోర్లు), హాసిని పెరీరా (37, 54 బంతుల్లో 5 ఫోర్లు), హర్షిత సమరవిక్రమ (28, 54 బంతుల్లో 3 ఫోర్లు) రాణించారు. చివరి టీ20లో విశ్వరూపం చూపిన కెప్టెన్ చమరి ఆటపట్టు (2), హన్షిమ కరుణరత్నె (0), కవిశ దిల్హరి (0) విఫలమయ్యారు. భారత ఆఫ్ స్పిన్నర్ దీప్తి శర్మ, పేసర్ రేణుక సింగ్ మూడేసి వికెట్లతో శ్రీలంకను దెబ్బకొట్టారు. పూజ రెండు వికెట్లు పడగొట్టగా.. రాజేశ్వరి, హర్మన్‌ప్రీత్ చెరో వికెట్ ఖాతాలో వేసుకున్నారు. దీప్తి శర్మ 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు సొంతం చేసుకుంది. మూడు మ్యాచుల వన్డే సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యం సాధించింది.
స్కోరు వివరాలు :
శ్రీలంక మహిళల ఇన్నింగ్స్ : 171/10 (నీలాక్షి డిసిల్వ 43, హాసిని పెరీరా 37, దీప్తి శర్మ 3/25, రేణుక సింగ్ 3/29)
భారత మహిళల ఇన్నింగ్స్ : 176/6 (హర్మన్‌ప్రీత్ కౌర్ 44, షెఫాలీ వర్మ 35, హర్లీన్ డియోల్ 34, ఇనోక రణవీర 4/39)