Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైదరాబాద్‌లో అకాడమీ ఏర్పాటు
- హెచ్ఎఫ్ఐ అధ్యక్షుడు జగన్ మోహన్‌రావు
క్రికెట్, బ్యాడ్మింటన్ తరహాలో ఇటీవల అధిక ప్రాధాన్యత సంతరించుకున్న ఆట హ్యాండ్‌బాల్!. హైదరాబాద్ వేదికగా వరుస టోర్నీల నిర్వహణతో క్షేత్రస్థాయిలో హ్యాండ్‌బాల్ క్రీడకు గొప్ప ఆదరణ లభిస్తోంది. హ్యాండ్‌బాల్ అకాడమీ ఏర్పాటుతో హైదరాబాద్ హ్యాండ్‌బాల్ హబ్‌గా రూపాంతరం చెందనుంది. ఇటీవల ఆసియా క్లబ్ లీగ్ చాంపియన్‌షిప్ పోటీలను విజయవంతంగా నిర్వహించిన సందర్భంగా జాతీయ హ్యాండ్‌బాల్ సమాఖ్య అధ్యక్షుడు అర్శనపల్లి జగన్ మోహన్‌రావు నవతెలంగాణతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ విషయాలు..
నవతెలంగాణ-హైదరాబాద్
హ్యాండ్‌బాల్ అభివద్ధిపై మీ విజన్?
హ్యాండ్‌బాల్ ఇండోర్ గేమ్. మన దగ్గర సదుపాయాల లేమితో అవుట్డోర్ గేమ్‌గా మారింది. ఈ పరిస్థితులను మార్చేందుకు కంకణం కట్టుకున్నాం. అంతర్జాతీయ, ఆసియా హ్యాండ్‌బాల్ సమాఖ్యలు, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో హైదరాబాద్‌లో ప్రపంచశ్రేణి హ్యాండ్‌బాల్ అకాడమీకి ప్రణాళిక చేస్తున్నాం. తొలి దశలో పట్టణాల్లో హ్యాండ్‌బాల్‌ను ఇండోర్గేమ్గా మార్చుతాం. హ్యాండ్‌బాల్ ప్రీమియర్ లీగ్ రాకతో దేశవ్యాప్తంగా పరిస్థితుల్లో మార్పులు చూడబోతున్నాం.
హైదరాబాద్‌లో అకాడమీ ఎలా ఉండనుంది?
అంతర్జాతీయ హ్యాండ్‌బాల్ సమాఖ్య ఉన్నతాధికారులతో అకాడమీ ఆలోచన పంచుకున్నాం. అకాడమీ ఏర్పాటు ప్రణాళికను రెండుగా చూడాలని సూచించారు. మౌళిక సదుపాయాల కల్పన, నిష్ణాతులైన కోచింగ్ సిబ్బంది తయారు. అకాడమీ నిర్మాణ పనుల కంటే ముందుగా కోచింగ్ వ్యవస్థ బలోపేతం దిశగా అడుగు పడనుంది. త్వరలోనే అంతర్జాతీయ హ్యాండ్‌బాల్ నిపుణులతో ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో శిక్షణ తరగతులు ఏర్పాటు చేస్తాం. అకాడమీ ఏర్పాటు విషయానికొస్తే భవిష్యత్‌లో హైదరాబాద్‌ను హ్యాండ్‌బాల్‌కు హబ్‌గా మార్చేలా ఈ నిర్మాణం ఉండబోతుంది. అకాడమీలో హాస్టల్, జిమ్, స్విమ్మింగ్ పూల్, స్పోర్ట్స్ సైన్స్ సెంటర్, రిహాబిలేషన్ సెంటర్ భాగంగా ఉంటాయి.
హెచ్ఎఫ్ఐ అధ్యక్షుడిగా మీరు సాధించిన విజయాలు?
జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మన జట్ల ప్రదర్శన గొప్పగా మెరుగుపడింది. జట్టు ఎంపికలో ప్రతిభకు పెద్ద పీట వేయటంతో ఆసియా మహిళల చాంపియన్‌షిప్ (జూనియర్))లో భారత్ విజేతగా నిలిచింది. ఈ విజయం వెనుక హెచ్ఎఫ్ఐ కృషి ఉంది. హిమాచల్ ప్రదేశ్‌లో ప్రత్యేక శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నాం, అక్కడ సుమారు 200 మంది క్రీడాకారిణీలు శిక్షణ పొందుతున్నారు.
క్రికెట్ తరహాలో హ్యాండ్‌బాల్‌కు ఆదరణ ఎలా తీసుకొస్తారు?
ఇది చాలా పెద్ద ప్రక్రియ. ఏ క్రీడకైనా గుర్తింపు, ఆదరణ దక్కాలంటే మైదానంలో మెరుపు విజయాలే కారణం. అత్యుత్తమ క్రీడాకారులను తీర్చిదిద్దితే విజయాలు వాటంతటవే వస్తాయి. హ్యాండ్‌బాల్‌కు ప్రచారం అక్కడి నుంచి మొదలు. హ్యాండ్‌బాల్ ప్రీమియర్ లీగ్ తర్వాత ఆదరణ గణనీయంగా పెరుగనుంది.