Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విధ్వంసకారుడు రిషబ్ పంత్ (146) ధనాధన్ సెంచరీతో చెలరేగాడు. టాప్ ఆర్డర్ బ్యాటర్లు చేతులెత్తేసిన వేళ రవీంద్ర జడేజా (83 నాటౌట్)తో కలిసి టీమ్ ఇండియాను ఆదుకున్నాడు. 98/5తో పీకల్లోతు కష్టాల్లో కూరుకున్న భారత్‌ను జడేజాతో కలిసి ఆరో వికెట్‌కు 222 పరుగులు జోడించిన రిషబ్ పంత్.. మెరుగైన స్థితిలో నిలిపాడు. పంత్ ప్రతాపంతో తొలి రోజు భారత్ 338/7తో పటిష్ట స్థితిలో నిలిచింది.
- రిషబ్ పంత్ ధనాధన్ శతకం
- రవీంద్ర జడేజా అజేయ అర్థ సెంచరీ
- భారత్ తొలి ఇన్నింగ్స్ 338/7
- ఇంగ్లాండ్‌తో ఐదో టెస్టు తొలి రోజు
నవతెలంగాణ-బర్మింగ్‌హామ్
రిషబ్ పంత్ (146, 111 బంతుల్లో 19 ఫోర్లు, 4 సిక్స్‌లు) ధనాధన్ సెంచరీతో చెలరేగాడు. ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (83 బ్యాటింగ్, 163 బంతుల్లో 10 ఫోర్లు) అజేయ అర్థ సెంచరీతో కదం తొక్కాడు. చిచ్చరపిడుగు రిషబ్ పంత్, సొగసరి బ్యాటర్ జడేజా జోడీ కదం తొక్కటంతో ఇంగ్లాండ్‌తో చివరి టెస్టు తొలి రోజు భారత్ మెరుగైన స్థితిలో నిలిచింది. మేఘావృతమైన వాతావరణంలో ఇంగ్లాండ్ పేసర్లు నిప్పులు చెరుగగా.. భారత్ ఓ దశలో 98/5తో పతనావస్థలో నిలిచింది. ఈ పరిస్థితుల్లో పంత్, జడేజా జోడీ ఆరో వికెట్‌కు 222 పరుగుల భారీ భాగస్వామ్యం నమోదు చేశారు. ఇంగ్లాండ్‌పై ఆరో వికెట్‌కు భారత్‌కు ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 338/7తో భారీ స్కోరు దిశగా సాగుతోంది.
పంత్ ఫటాఫట్ షో : వర్ష సూచనలు కనిపించిన ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో టాస్ నెగ్గిన ఇంగ్లాండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. శుభ్‌మన్ గిల్‌కు తోడుగా ఓపెనర్‌గా వచ్చిన చతేశ్వర్ పుజారా భారత్‌కు ఆశించిన ఆరంభం అందించలేదు. యువ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ ఆరంభంలో ఇంగ్లీష్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. నాలుగు ఫోర్లతో అలరించాడు. కానీ అతడి దూకుడుకు అండర్సన్ ముగింపు పలికాడు. ఓ ఎండ్‌లో నిలదొక్కుకున్న పుజారా (13, 46 బంతుల్లో 2 ఫోర్లు) పరుగుల వేటలో వెనుకంజ వేశాడు. దీంతో స్కోరు బోర్డు ముందుకు కదల్లేదు. అండర్సన్ అద్బుత బంతికి పుజారా సైతం నిష్క్రమించాడు. మూడో స్థానంలో వచ్చిన తెలుగు తేజం హనుమ విహారి (20, 53 బంతుల్లో 1 ఫోర్) సమయోచిత ఇన్నింగ్స్ ఆడేలా కనిపించాడు. కానీ అతడి కథకు మాథ్యూ పాట్స్ తెరదించాడు. రెండేండ్లుగా శతకం లేకుండా ఆడుతున్న విరాట్ కోహ్లి (11, 19 బంతుల్లో 2 ఫోర్లు) మళ్లీ నిరాశపరిచాడు. వర్షం అంతరాయంతో తొలి సెషన్ త్వరగా ముగియగా.. లంచ్ సెషన్లో ఆరంభంలోనే కోహ్లి వికెట్ కోల్పోయాడు. ఉపఖండ పిచ్‌లపై మెరిసిన శ్రేయస్ అయ్యర్ (15) తేలిపోయాడు. దీంతో 98 పరుగులకే భారత్ ఐదు కీలక వికెట్లు కోల్పోయింది.
ఈ పరిస్థితుల్లో రిషబ్ పంత్ (146) ధనాధన్ షో చూపించాడు. 19 ఫోర్లు, 4 సిక్సర్లతో చెలరేగాడు. ఆరు ఫోర్లు, ఓ సిక్సర్‌తో అర్థ సెంచరీ సాధించిన పంత్..89 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. శతకం అనంతరం సైతం దూకుడుగా ఆడిన పంత్ భారత స్కోరుకు వేగంగా ముందుకు తీసుకెళ్లాడు. మరో ఎండ్‌లో రవీంద్ర జడేజా నుంచి గొప్ప సహకారం లభించింది. ఏడు ఫోర్లుతో 104 బంతుల్లో అర్థ సెంచరీ సాధించిన జడేజా.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి అజేయంగా క్రీజులో నిలిచాడు. శార్దుల్ ఠాకూర్ (1) నిరాశపరచగా.. మహ్మద్ షమి (0 నాటౌట్) వికెట్ కాపాడుకుని క్రీజులో నిలిచాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో అండర్సన్ మూడు వికెట్లు పడగొట్టగా.. మాథ్యూ పాట్స్ రెండు వికెట్లు తీసుకున్నాడు. బెన్ స్టోక్స్, జో రూట్ చెరో వికెట్ ఖాతాలో వేసుకున్నారు.