Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శ్రీలంకతో రెండో వన్డే నేడు
పల్లెకల్ : శ్రీలంక పర్యటనలో టీమ్ ఇండియా వరుసగా రెండో సిరీస్ విజయంపై కన్నేసింది. టీ20 సిరీస్‌ను 2-1తో నెగ్గిన హర్మన్‌ప్రీత్ సేన.. తాజాగా వన్డే సిరీస్‌ను సైతం దక్కించుకునేందుకు నేడు బరిలోకి దిగుతోంది. దీప్తి శర్మ, రేణుక సింగ్ ద్వయం స్పిన్, పేస్ దాడితో తొలి వన్డేలో శ్రీలంక అమ్మాయిలను చిత్తు చేశారు. తొలి వన్డేలో ఏకపక్ష విజయం నమోదు చేసిన భారత మహిళలు నేడూ అదే ప్రదర్శన పునరావృతం చేసేందుకు సిద్దమవుతున్నారు. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఫామ్‌లోకి రావటం భారత్‌కు శుభ సూచకం. దీప్తి శర్మ సైతం ఆల్‌రౌండ్ నైపుణ్యాలు ప్రదర్శిస్తోంది. టాప్ ఆర్డర్లో షెఫాలీ వర్మ ఎదురుదాడిలో ముందంజ వేస్తున్నా.. నిలకడగా భారీ ఇన్నింగ్స్‌లు నమోదు చేయాల్సిన బాధ్యత ఆమెపై ఉంది. నేడు షెఫాలీ నుంచి మెగా ఇన్నింగ్స్ వస్తుందేమో చూడాలి. ఇక టీ20లో మెరిసిన స్మృతీ మంధాన తొలి వన్డేలో నిరాశపరిచింది. నేడు మంధాన సైతం మంచి ఇన్నింగ్స్‌పై కన్నేసింది. యస్టికా భాటియా, రిచా ఘోష్‌లు సైతం సత్తా చాటేందుకు ఎదురు చూస్తున్నారు. చివరి టీ20లో ధనాధన్ మెరుపుల అనంతరం వన్డే సిరీస్ ఆరంభ మ్యాచ్‌లో శ్రీలంక బ్యాటర్లు చేతులెత్తేశారు. కెప్టెన్ చమరి ఆటపట్టు టాప్ ఆర్డర్లో నిలిస్తేనే ఆ జట్టు నేడు చెప్పుకోదగిన పరుగులు చేయగలదు. బ్యాటింగ్ భారం మోస్తున్న చమరి ఆటపట్టు నేడు సిరీస్‌లో ఆతిథ్య జట్టు ఆశలు నిలుపుతుందేమో చూడాలి. భారత్, శ్రీలంక మహిళల రెండో వన్డే పోరు నేడు ఉదయం 10 గంటలకు ఆరంభం కానుంది.