Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నాలుగు వికెట్లతో సిరాజ్ విజృంభణ
- శతకంతో ప్రతిఘటించిన జానీ బెయిర్‌స్టో
- భారత్‌కు 132 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం
ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో టీమ్ ఇండియా ఆధిపత్యం నడుస్తోంది. హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ నాలుగు వికెట్ల ప్రదర్శనతో తొలి ఇనింగ్స్‌లో ఇంగ్లాండ్ 284 పరుగులకే కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్‌లో 132 పరుగుల భారీ ఆధిక్యం సొంతం చేసుకున్న టీమ్ ఇండియా.. పటౌడీ ట్రోఫీపై పట్టు వదలటం లేదు. మూడో రోజు టీ విరామ సమయానికి భారత్ ఆధిక్యం 169 పరుగులు.
నవతెలంగాణ-బర్మింగ్‌హామ్
భారత బౌలర్లు విజృంభించారు. వర్షం అంతరాయం కలిగించిన టెస్టు సమరంలో పేసర్లు నిప్పులు చెరిగారు. కెప్టెన్ జశ్‌ప్రీత్ బుమ్రా (3/68), మహ్మద్ షమి (2/78) ఇంగ్లాండ్ బ్యాటర్లకు ముకుతాడు వేయగా.. హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ (4/66) వికెట్ల వేటలో దూసుకుపోయాడు. భారత పేస్ త్రయం దెబ్బకు ఇంగ్లాండ్ బ్యాటింగ్ లైనప్ కకావికలమైంది. కెరీర్ భీకర ఫామ్‌లో ఉన్న జానీ బెయిర్‌స్టో (104, 140 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్స్‌లు) మరో ధనాధన్ శతకంతో చెలరేగాడు. లోయర్ ఆర్డర్లో బెన్ స్టోక్స్‌తో కలిసి 66, శామ్ బిల్లింగ్స్‌తో కలిసి 92 పరుగుల భాగస్వామ్యాలు నమోదు చేసిన జానీ బెయిర్‌స్టో ఇంగ్లాండ్‌కు తొలి ఇన్నింగ్స్‌లో మెరుగైన స్కోరు అందించాడు. 61.3 ఓవర్లలో ఇంగ్లాండ్ 284 పరుగులకు కుప్పకూలింది. టీమ్ ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 416 పరుగుల భారీ స్కోరు నమోదు చేసిన సంగతి తెలిసిందే. బౌలర్ల దూకుడుతో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 132 పరుగుల భారీ ఆధిక్యం సొంతం చేసుకుంది. భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 37/1తో ఆడుతోంది. చతేశ్వర్ పుజారా (17 నాటౌట్), హనుమ విహారి (10 నాటౌట్) అజేయంగా ఆడుతున్నారు!.
బెయిర్‌స్టో శతకనాదం : ఓవర్‌నైట్ స్కోరు 84/5తో మూడో రోజు బ్యాటింగ్‌కు వచ్చిన ఇంగ్లాండ్ విలువైన భాగస్వామ్యాలు నమోదు చేసింది. భారత కెప్టెన్ బుమ్రా బూమ్ బూమ్‌తో టాప్ ఆర్డర్ కుప్పకూలగా.. మిడిల్, లోయర్ ఆర్డర్ బాధ్యతాయుతంగా నిలిచాయి. కెరీర్ భీకర ఫామ్‌లో ఉన్న జానీ బెయిర్‌స్టో (106, 140 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్స్‌లు) శతక గర్జన చేశాడు. కెప్టెన్ బెన్ స్టోక్స్ (25, 36 బంతుల్లో 3 ఫోర్లు)తో కలిసి ఆరో వికెట్‌కు 66 పరుగులు జోడించిన జానీ బెయిర్‌స్టో.. ఏడో వికెట్‌కు శామ్ బిల్లింగ్స్ (36, 57 బంతుల్లో 4 ఫోర్లు) 92 పరుగుల భారీ భాగస్వామ్యం నమోదు చేశాడు. భారత బౌలర్ల మెరుపులతో ఆరంభంలో నెమ్మదిగా ఆడిన జానీ బెయిర్‌స్టో.. వర్షం అంతరాయం కలిగించిన మ్యాచ్‌లో చివర్లో రెచ్చిపోయాడు. ఏడు ఫోర్లతో 81 బంతుల్లో అర్థ సెంచరీ సాధించిన బెయిర్‌స్టో.. 14 ఫోర్లు, రెండు సిక్సర్లతో 119 బంతుల్లోనే సెంచరీ బాదాడు. బెన్ స్టోక్స్‌ను శార్దుల్ ఠాకూర్ వెనక్కి పంపించగా.. శామ్ బిల్లింగ్స్‌ను సిరాజ్ సాగనంపాడు. లోయర్ ఆర్డర్లో రెండు కీలక భాగస్వామ్యాలతో ఇంగ్లాండ్ గొప్పగా పుంజుకుంది. శతక వీరుడు జానీ బెయిర్‌స్టోను షమి అవుట్ చేయటంతో ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌కు లాంఛనంగా తెరపడింది. టెయిలెండర్లలో మాథ్యూ పాట్స్ (19, 18 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) వేగంగా పరుగులు పిండుకున్నాడు. అదనపు పరుగుల రూపంలో భారత్ 35 పరుగులను సమర్పించుకుంది. సిరాజ్ ఓవర్లో ఓ ఫోర్, సిక్సర్ అనంతరం పాట్స్ వికెట్ కోల్పోవటంతో 284 పరుగుల వద్ద ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌కు తెరపడింది. భారత బౌలర్లలో హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ (4/66), కెప్టెన్ జశ్‌ప్రీత్ బుమ్రా (3/68), మహ్మద్ షమి (2/78) రాణించారు. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 132 పరుగుల భారీ ఆధిక్యం సొంతం చేసుకుంది.
గిల్ విఫలం : లంచ్ సెషన్లో రెండో ఇన్నింగ్స్ మొదలెట్టిన టీమ్ ఇండియా ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే ఓపెనర్ వికెట్ కోల్పోయింది. జేమ్స్ అండర్సన్‌పై ఓ బౌండరీ బాదిన యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (4, 3 బంతుల్లో 1 ఫోర్) ఆ తర్వాతి బంతికే స్లిప్స్‌లో దొరికిపోయాడు. దీంతో 4 పరుగులకే భారత్ తొలి వికెట్‌ను కోల్పోయింది. మరో ఓపెనర్ చతేశ్వర్ పుజారా (17 నాటౌట్)తో జతకట్టిన తెలుగు తేజం హనుమ విహారి (10 నాటౌట్) మరో వికెట్ పడకుండా ఆడుతున్నాడు. రెండో వికెట్‌కు ఈ జోడీ 33 పరుగులు జోడించింది. ఇంగ్లీష్ కౌంటీ క్రికెట్లో మంచి అనుభవం ఉన్న పుజారా, విహారిలు ప్రస్తుతం క్రీజులో ఉండటంతో భారత్ టాప్ ఆర్డర్లో ఈ జోడీ నుంచి విలువైన భాగస్వామ్యం ఆశిస్తోంది.
స్కోరు వివరాలు :
భారత్ తొలి ఇన్నింగ్స్ : 416/10
ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ : అలెక్స్ (బి) బుమ్రా 6, క్రావ్లీ (సి) గిల్ (బి) బుమ్రా 9, ఒలీ పోప్ (సి) శ్రేయస్ (బి) బుమ్రా 10, జో రూట్ (సి) పంత్ (బి) సిరాజ్ 31, జానీ బెయిర్‌స్టో (సి) కోహ్లి (బి) షమి 106, జాక్ లీచ్ (సి) పంత్ (బి) షమి 0, బెన్ స్టోక్స్ (సి) బుమ్రా (బి) ఠాకూర్ 25, శామ్ బిల్లింగ్స్ (బి) సిరాజ్ 36, స్టువర్ట్ బ్రాడ్ (సి) పంత్ (బి) సిరాజ్ 1, మాథ్యూ పాట్స్ (సి) శ్రేయస్ (బి) సిరాజ్ 19, జేమ్స్ అండర్సన్ నాటౌట్ 6, ఎక్స్‌ట్రాలు : 35, మొత్తం :(61.3 ఓవర్లలో ఆలౌట్) 284.
వికెట్ల పతనం : 1-16, 2-27, 3-44, 4-78, 5-83, 6-149, 7-241, 8-248, 9-267, 10-284.
బౌలింగ్ : జశ్‌ప్రీత్ బుమ్రా 19-3-68-3, మహ్మద్ షమి 22-4-78-2, మహ్మద్ సిరాజ్ 11.3-2-66-4, శార్దుల్ ఠాకూర్ 7-0-48-1, రవీంద్ర జడేజా 2-0-3-0.
భారత్ రెండో ఇన్నింగ్స్ : శుభ్‌మన్ గిల్ (సి) క్రావ్లీ 4, చతేశ్వర్ పుజారా బ్యాటింగ్ 17, హనుమ విహారి బ్యాటింగ్ 10, ఎక్స్టాలు : 06, మొత్తం :(13 ఓవర్లలో వికెట్ నష్టానికి) 37.
వికెట్ల పతనం : 1-4.
బౌలింగ్ : జేమ్స్ అండర్సన్ 6-1-15-1, స్టువర్ట్ బ్రాడ్ 4-1-11-0, మాథ్యూ పాట్స్ 2-1-1-0, జాక్ లీచ్ 1-0-5-0.