Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంధాన, షెఫాలీ విశ్వరూపం
- శ్రీలంకపై భారత్ ఘన విజయం
- 2-0తో వన్డే సిరీస్ అమ్మాయిల వశం
నవతెలంగాణ-పల్లెకల్
భారత మహిళల జట్టు ఇటీవల కాలంలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. శ్రీలంకపై పది వికెట్ల తేడాతో అసమాన విజయం సొంతం చేసుకుంది. యువ పేసర్ రేణుక సింగ్ కెరీర్ బెస్ట్ గణాంకాలు నమోదు చేయగా.. చాలా కాలం విరామం తర్వాత షెఫాలీ వర్మ (71 నాటౌట్, 71 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) స్మృతీ మంధాన (94 నాటౌట్, 83 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్స్) దంచికొట్టారు. బంతితో రేణుక సింగ్.. బ్యాట్‌తో మంధాన, షెఫాలీ చెలరేగటంతో రెండో వన్డేలో శ్రీలంక మహిళలపై భారత మహిళల జట్టు ఏకపక్ష విజయం నమోదు చేసింది. 174 పరుగుల లక్ష్యాన్ని వికెట్ నష్టపోకుండా, 25.4 ఓవర్లలోనే ఊదేసింది. మూడు మ్యాచుల వన్డే సిరీస్‌లో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో సిరీస్‌ను సొంతం చేసుకుంది. రేణుక సింగ్ నాలుగు వికెట్ల ప్రదర్శనతో తొలుత శ్రీలంక మహిళల జట్టు 173 పరుగులకే కుప్పకూలింది. భారత పేసర్ రేణుక సింగ్ 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు సొంతం చేసుకుంది. సిరీస్‌లో నామమాత్రపు మూడో వన్డే గురువారం పల్లెకల్లోనే జరుగనుంది.
దంచికొట్టారు : భారత్ ముందున్న లక్ష్యం 174 పరుగులు. తొలి వన్డేలో శ్రీలంక ఇంతకంటే తక్కువ టార్గెట్‌ను నిర్దేశించింది. అయినా, భారత్ డెత్ ఓవర్లలో గానీ విజయాన్ని అందుకోలేదు. రెండో వన్డేలోనూ ఆ తరహా ప్రదర్శనే ఉంటుందనే అనుకున్నారు. కానీ చాన్నాండ్ల తర్వాత టాప్ ఆర్డర్లో ఇద్దరు డ్యాషింగ్ బ్యాటర్లు విశ్వరూపం చూపించారు. ధనాధన్ ఆరంభాలు ఇస్తున్నప్పటికీ నిలకడగా మెగా ఇన్నింగ్స్‌లు సాధించటంలో విఫలమవుతున్న యువ ఓపెనర్ షెఫాలీ వర్మ సత్తా చాటింది. స్టార్ బ్యాటర్ స్మృతీ మంధాన తోడుగా చెలరేగింది. ఈ జోడీ ధనాధన్ షోతో శ్రీలంక బౌలర్లు తేలిపోయారు. పవర్‌ప్లే (10 ఓవర్లు) ముగిసే సరికి 55/0తో ఉన్న భారత ఇన్నింగ్స్‌కు ఆ తర్వాత ఊపోచ్చింది. ఓ వైపు మంధాన, మరోవైపు షెఫాలీ పోటీపడి మరీ పరుగులు పిండుకున్నారు. మంధాన 56 బంతుల్లో అర్థ సెంచరీ నమోదు చేయగా.. షెఫాలీ వర్మ 57 బంతుల్లో ఆ ఘనత సాధించింది. అర్థ సెంచరీల అనంతరం షెఫాలీతో పాటు మంధాన సైతం స్పీడ్ పెంచింది. దీంతో 25.4 ఓవర్లలోనే భారత్ లాంఛనం ముగించింది.
అంతకముందు, తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక మహిళల జట్టు 173 పరుగులకు కుప్పకూలింది. పేసర్ రేణుక సింగ్ (4/28) నిప్పులు చెరుగగా.. మేఘన సింగ్ (2/43), స్పిన్నర్ దీప్తి శర్మ (2/30) వికెట్ల వేటలో ఆకట్టుకున్నారు. ఓపెనర్ హాసిని పెరీరా (0), విష్మి గుణరత్నె (3), హర్షిత సమరవిక్రమ (0) భారత బౌలింగ్ పదును ముందు తేలిపోయారు. కెప్టెన్ చమరి ఆటపట్టు (27, 45 బంతుల్లో 3 ఫోర్లు) కాసేపు క్రీజులో నిలిచినా ఫలితం లేకపోయింది. చివర్లో ఆమ కాంచన (47 నాటౌట్, 83 బంతుల్లో 2 ఫోర్లు) రాణించటంతో శ్రీలంక గౌరవప్రద స్కోరు సాధించింది. అనుష్క సంజీవని (25, 44 బంతుల్లో 2 ఫోర్లు), నీలాక్షి డిసిల్వ (32, 62 బంతుల్లో 3 ఫోర్లు) శ్రీలంక 50 ఓవర్లు ఆడేలా చేశారు.
సంక్షిప్త స్కోరు వివరాలు :
శ్రీలంక మహిళల ఇన్నింగ్స్ : 173/10 (ఆమ కాంచన 47, నీలాక్షి డిసిల్వ 32, రేణుక సింగ్ 4/28)
భారత మహిళల ఇన్నింగ్స్ : 174/0 (స్మృతీ మంధాన 94, షెఫాలీ వర్మ 71, ఆచిని కులసూర్య 0/24)