Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పటౌడీ ట్రోఫీలో చివరి టెస్టుకు ముందు ఇంగ్లాండ్ ఛేదించిన మూడు టెస్టు లక్ష్యాలు 277, 299, 296. ఎడ్జ్‌బాస్టన్‌లో ఇంగ్లాండ్ నాల్గో ఛేదనను విజయవంతంగా ముగించారు. రికార్డు 378 పరుగుల లక్ష్యాన్ని 3 మాత్రమే కోల్పోయి ఛేదించింది. జో రూట్ (142 నాటౌట్), జానీ బెయిర్‌స్టో (114 నాటౌట్) అజేయ శతకాలతో ఛేదనలో చెలరేగారు. రూట్, జానీ ధనాధన్ షోతో చివరి టెస్టులో ఇంగ్లాండ్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. భారత్ టెస్టు క్రికెట్ చరిత్రలో తొలిసారి 378 పరుగులను కాపాడుకోవటంలో విఫలమైంది. పటౌడీ ట్రోఫీ 2-2తో సమం కాగా.. గత విజేత ఇంగ్లాండ్ ట్రోఫీని అట్టిపెట్టుకుంది.
- 378 లక్ష్యాన్ని ఛేదించిన ఇంగ్లాండ్
- జో రూట్, జానీ బెయిర్‌స్టో శతకాలు
- 2-2తో పటౌడీ ట్రోఫీ సమం
నవతెలంగాణ-బర్మింగ్‌హామ్ :
ఇంగ్లాండ్ చరిత్ర సృష్టించింది. 378 పరుగుల రికార్డు లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. బుమ్రా, షమి, సిరాజ్, శార్దుల్‌తో కూడిన భారత పేస్ దళాన్ని ఎదుర్కొని నాల్గో ఇన్నింగ్స్‌లో నిలువటం అసాధ్యమని క్రికెట్ పండితులు తేల్చిన పరిస్థితుల్లో.. జో రూట్ (142 నాటౌట్, 173 బంతుల్లో 19 ఫోర్లు, 1 సిక్స్), జానీ బెయిర్‌స్టో (114 నాటౌట్, 145 బంతుల్లో 15 ఫోర్లు, 1 సిక్స్) అజేయ శతకాలతో చరిత్రను తిరగరాశారు. రెడ్‌బాల్ టార్గెట్‌ను వైట్‌బాల్ వ్యూహంతో అలవోకగా అందుకున్నారు. 76.4 ఓవర్లలోనే ఇంగ్లాండ్ గెలుపు మార్క్‌ను ముద్దాడింది. సిరీస్‌లో నాలుగు శతకాలు సహా 737 పరుగులు పిండుకున్న జో రూట్ 'మ్యాన్ ఆఫ్ ది సిరీస్'గా నిలువగా.. రెండు ఇన్నింగ్స్‌ల్లో రెండు శతకాలు సాధించిన జానీ బెయిర్‌స్టో 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచాడు. ఇంగ్లాండ్ గడ్డపై 23 వికెట్లు సహా విలువైన 125 పరుగులు పిండుకున్న భారత పేస్ దళపతి జశ్‌ప్రీత్ బుమ్రా టీమ్ ఇండియా నుంచి 'మ్యాన్ ఆఫ్ ది సిరీస్'గా ఎంపికయ్యాడు. చివరి టెస్టులో ఇంగ్లాండ్ విజయంతో పటౌడీ ట్రోఫీ 2-2తో సమమైంది. పటౌడీ ట్రోఫీ గత సిరీస్ విజేత ఇంగ్లాండ్ కావటంతో.. ట్రోఫీని ఆ జట్టు అట్టిపెట్టుకుంది. అంతకముందు, భారత కెప్టెన్ బుమ్రా, ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ కలిసి పటౌడీ ట్రోఫీని సమంగా అందుకున్నారు. భారత్, ఇంగ్లాండ్ రెడ్ బాల్ సవాల్‌కు ఇక్కడితో తెరపడింది. వైట్‌బాల్ సమరం గురువారం తొలి టీ20తో షురూ కానుంది.
ఉదయం సెషన్లోనే..! : ఓవర్‌నైట్ స్కోరు 259/3 (57 ఓవర్లలో)తో చివరి రోజు బ్యాటింగ్‌కు వచ్చిన ఇంగ్లాండ్ లాంఛనం తొలి సెషన్లోనే ముగించింది. 119 పరుగులను ఉదయం సెషన్లోనే పిండుకుంది. టార్గెట్ రెండెంకలకు రాగానే జానీ బెయిర్‌స్టో విశ్వరూపం చూపించాడు. 14 ఫోర్లతో 136 బంతుల్లో జో రూట్ సిరీస్‌లో అసమాన నాల్గో శతకం సాధించగా.. జానీ బెయిర్‌స్టో 12 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 138 బంతుల్లో ఈ ఘనత అందుకున్నాడు. వరుసగా నాల్గో టెస్టులో (కివీస్‌పై మూడు) జానీ బెయిర్‌స్టో శతకం నమోదు చేసి భీకర ఫామ్ కొనసాగించాడు. టీ20 తరహాలో పరుగుల ప్రవాహం సృష్టించిన జో రూట్, జానీ బెయిర్‌స్టో 19.4 ఓవర్లలోనే అవసరమైన 119 పరుగులు సాధించారు. ఎటువంటి బంతినైనా బాదేలా కనిపించిన రూట్, జానీ ద్వయం.. ఛేదనలో అదే పని చేసింది. బుమ్రా సంధించిన గుడ్ లెంగ్త్ బంతులను సైతం రూట్, జానీ వదల్లేదు. మంచి బంతులనే శిక్షించిన ఈ జోడీ.. ఇక గురి తప్పిన బంతులను ఏం చేసిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రన్‌రేట్ సుమారు 5 ఉండటంతో.. ఇంగ్లాండ్‌పై ఒత్తిడి సృష్టించటంలో భారత్ విఫలమైంది. పరుగుల వరదతో రూట్, జానీ జోడీ భారత బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టింది. న్యూజిలాండ్‌పై మూడు టెస్టుల్లో ఛేదనలను వరుసగా విజయవంతంగా ముగించిన ఇంగ్లాండ్.. భారత్‌పైనా అదే జోరు చూపించింది. చీఫ్ కోచ్ బ్రెండన్ మెక్‌కలమ్, కెప్టెన్ బెన్ స్టోక్స్ కాంబినేషన్లో ఇంగ్లాండ్ వరుసగా నాల్గో టెస్టు విజయం నమోదు చేసింది. భారత బౌలర్లలో బుమ్రా రెండు వికెట్లు పడగొట్టాడు. జో రూట్, జానీ బెయిర్‌స్టోలో ఓ క్యాలెండర్ ఏడాదిలో అత్యధిక శతకాలు సాధించిన ఇంగ్లాండ్ బ్యాటర్ల జాబితాలో డెనిస్ కాంప్టన్ (1947), మైకల్ వాన్ (2002)లను సమం చేశారు. ఈ నలుగురు బ్యాటర్లు ఓ ఏడాదిలో ఆరు టెస్టు శతకాలు బాదారు.
స్కోరు వివరాలు :
భారత్ తొలి ఇన్నింగ్స్ : 416/10
ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ : 284/10
భారత్ రెండో ఇన్నింగ్స్: 245/10
ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ : అలెక్స్ లీస్ (రనౌట్) 56, జాక్ క్రావ్లీ (బి) బుమ్రా 46, ఒలీ పోప్ (సి) పంత్ (బి) బుమ్రా 0, జో రూట్ నాటౌట్ 142, జానీ బెయిర్‌స్టో నాటౌట్ 114, ఎక్స్‌ట్రాలు : 20, మొత్తం :(76.4 ఓవర్లలో 3 వికెట్లకు) 378.
వికెట్ల పతనం : 1-107, 2-107, 3-109.
బౌలింగ్ : జశ్‌ప్రీత్ బుమ్రా 17-1-74-2, మహ్మద్ షమి 15-2-64-0, రవీంద్ర జడేజా 18.4-3-62-0, మహ్మద్ సిరాజ్ 15-0-96-0, శార్దుల్ ఠాకూర్ 11-0-65-0.
అలా అయితే, ఇలా కాకపోతే.. అనేవి ఎప్పుడూ క్రికెట్లో విషయమే!. ఆట అలాగే సాగుతుంది. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ మాకంటే మెరుగైన ప్రదర్శన చేసింది. రెండు జట్లు మంచి క్రికెట్ ఆడాయి. రిషబ్ పంత్ గొప్పగా ఆడాడు. పంత్, జడేజా ఎదురుదాడితో మ్యాచ్‌లో భారత్ ముందంజలో నిలిచింది. పంత్ పట్ల ఎంతో సంతోషంగా ఉంది. నాయకత్వం మంచి సవాల్. ఎన్నో గొప్ప విషయాలు నేర్చుకున్నాను. భారత జట్టుకు కెప్టెన్సీ వహించటం ఓ గౌరవం, ఇది గొప్ప అనుభవం నేర్పింది'
- జశ్‌ప్రీత్ బుమ్రా, మ్యాన్ ఆఫ్ ది సిరీస్.