Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వేతనాల్లో లింగ భేదానికి మంగళం
- మెన్స్, ఉమెన్స్ క్రికెటర్లకు సమాన వేతనం
క్రైస్ట్‌చర్చ్ (న్యూజిలాండ్) : ప్రగతిశీల సమాజంలో ప్రగతిశీల నిర్ణయాలకు ఎప్పుడూ అవకాశం మెండుగానే ఉంటుంది. న్యూజిలాండ్ ఇది మరోసారి నిరూపించింది. ప్రపంచ క్రీడా రంగంలో మెన్, ఉమెన్ అథ్లెట్లకు వేతనాలు, నగదు బహుమానంలో వ్యత్యాసం పట్ల ఎంతో కాలంగా నిరసన స్వరాలు వినిపిస్తున్నాయి. సమాన పని, సమాన వేతనానికే తిలోదకాలు ఇస్తున్న రోజుల్లో.. న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు చారిత్రక నిర్ణయం తీసుకుంది. పురుష, మహిళా క్రికెటర్లకు సమానంగా వేతనాలు అందించేందుకు సంకల్పించింది. ఈ మేరకు న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు, ఇతర ఆరు ప్రధాన క్రికెట్ సంఘాలతో న్యూజిలాండ్ క్రికెట్ ప్లేయర్ల అసోసియేషన్ నూతన ఐదేండ్ల ఒప్పందం కుదుర్చుకుంది. కొత్త ఐదేండ్ల ఒప్పందంతో అంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్లో న్యూజిలాండ్ మహిళా, పురుష క్రికెటర్లు సమానంగా వేతనాలు పొందనున్నారు. ఈ మేరకు న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు మంగళవారం ప్రకటించింది. ' పురుష క్రికెటర్లతో సమానంగా మహిళా క్రికెటర్లకు వేతనాలు చాలా పెద్ద ముందడుగు. ఈ నిర్ణయం యంగ్ ఉమెన్, బాలికలను గొప్పగా ప్రభావితం చేయనుంది' అని న్యూజిలాండ్ మహిళా క్రికెటర్ సోఫీ డివైనె వ్యాఖ్యానించింది. ప్రపంచ క్రికెట్లో మెన్, ఉమెన్ క్రికెటర్లు సమాన వేతనాలు పొందనుండటం ఇదే ప్రథమం.
నూతన ఒప్పందం ప్రకారం వార్షిక కాంట్రాక్టుతో పాటు మ్యాచ్ ఫీజుల్లోనూ న్యూజిలాండ్ మహిళా క్రికెటర్లు సమానంగా ఆర్జించనున్నారు. టెస్టు మ్యాచ్‌కు రూ. 5 లక్షలు (10,250 న్యూజిలాండ్ డాలర్లు), వన్డే మ్యాచ్‌కు రూ. 2 లక్షలు (4000 న్యూజిలాండ్ డాలర్లు), టీ20 మ్యాచ్‌కు రూ. 1.25 లక్షలు (2500 న్యూజిలాండ్ డాలర్లు) మ్యాచ్ ఫీజు రూపంలో సమానంగా దక్కనుంది. దేశవాళీ క్రికెట్ సర్క్యూట్లో వన్డే మ్యాచ్‌లకు రూ.40 వేలు (800 న్యూజిలాండ్ డాలర్లు), టీ20 మ్యాచ్‌కు రూ.30 వేలు (575 న్యూజిలాండ్ డాలర్లు) మ్యాచ్ ఫీజులుగా నిర్ణయించారు. నూతన కాంట్రాక్టులో భాగంగా ఉత్తమ న్యూజిలాండ్ మహిళా క్రికెటర్ ఏడాదికి సుమారుగా రూ. 1 కోటి ఆర్జించనుంది. దేశవాళీ సర్క్యూట్లో మహిళా క్రికెటర్లకు అందించే కాంట్రాక్టులను సైతం 54 నుంచి 72కు పెంపుదల చేశారు. ఆగస్టు 1 నుంచి ఈ ఒప్పందం అమల్లోకి రానుంది.