Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 3-0తో వన్డే సిరీస్ భారత్ వశం
- మూడో వన్డేలోనూ శ్రీలంక చిత్తు
భారత మహిళల జట్టు పరిపూర్ణ విజయం సాధించింది. శ్రీలంక పర్యటనలో టీ20, వన్డే సిరీస్‌ను సొంతం చేసుకుంది. ద్వీప దేశంలో ధనాధన్ మెరుపులతో చెలరేగిన హర్మన్‌ప్రీత్ సేన మూడో వన్డేలో 39 పరుగుల తేడాతో గెలుపొందింది. వన్డే సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది.
నవతెలంగాణ-పల్లెకల్
అమ్మాయిలు అదరగొట్టారు. శ్రీలంక పర్యటనలో వరుస సిరీస్ విజయాలు నమోదు చేశారు. పొట్టి ఫార్మాట్లో సిరీస్ దక్కినా క్లీన్‌స్వీప్ చేజారగా.. వన్డేల్లో ఆ లోటూ తీర్చేశారు. 3-0తో శ్రీలంక మహిళల జట్టుపై క్లీన్‌స్వీప్ విజయం సాధించారు. మూడో వన్డేలోనూ ఏకపక్ష విజయంతో సిరీస్‌ను సొంతం చేసుకున్నారు. స్టార్ స్పిన్నర్ రాజేశ్వరి గైక్వాడ్ (3/36) మాయజాలంతో 256 పరుగుల భారీ ఛేదనలో శ్రీలంక మహిళల జట్టు 216 పరుగులకే కుప్పకూలింది. టీమ్ ఇండియా 39 పరుగుల తేడాతో ఘన విజయం నమోదు చేసింది. అంతకముందు, హర్మన్‌ప్రీత్ కౌర్ (75, 88 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) కెప్టెన్సీ ఇన్నింగ్స్‌కు తోడు షెఫాలీ వర్మ (49, 50 బంతుల్లో 5 ఫోర్లు) రాణించటంతో భారత్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది. ధనాధన్ మోత మోగించిన హర్మన్‌ప్రీత్ కౌర్ 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'తో పాటు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును సైతం ఎగరేసుకుపోయింది. వన్డే సిరీస్ ట్రోఫీ టీమ్ ఇండియా ఖాతాలో వేసుకుంది. టీ20 సిరీస్‌ను 2-1తో, వన్డే సిరీస్‌ను 3-0తో గెల్చుకున్న టీమ్ ఇండియా శ్రీలంక పర్యటనను విజయవంతంగా ముగించుకుంది.
హర్మన్, షెఫాలీ జోరు : శ్రీలంక ఆహ్వానం మేరకు టాస్ ఓడిన భారత్ తొలుత బ్యాటింగ్‌కు వచ్చింది. స్టార్ బ్యాటర్ స్మృతీ మంధాన (6) నిరాశపరిచింది. 20 బంతులు ఎదుర్కొన్న మంధాన ఒక్క బౌండరీ బాదలేదు. వికెట్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి నిష్క్రమించింది. మరో ఓపెనర్ షెఫాలీ వర్మ (49, 50 బంతుల్లో 5 ఫోర్లు) ఫామ్ కొనసాగించింది. ఐదు ఫోర్లలో అలరించింది. యస్టికా భాటియా (30, 38 బంతుల్లో 5 ఫోర్లు) తోడుగా రెండో వికెట్‌కు కీలక భాగస్వామ్యం నెలకొల్పింది. షెఫాలీ, భాటియా జోరుతో భారత్ భారీ స్కోరు దిశగా సాగింది. కానీ స్వల్ప విరామంలోనే భాటియా, షెఫాలీ పెవిలియన్‌కు చేరుకున్నారు. హర్లీన్ డియోల్ (1), దీప్తి శర్మ (4), రిచా ఘోష్ (2) సైతం వికెట్లు కోల్పోయారు. దీంతో భారత్ 124/6 తో ఒత్తిడిలో పడింది.
ఈ పరిస్థితుల్లో హర్మన్‌ప్రీత్ కౌర్ (75) కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో అదరగొట్టింది. టెయిలెండర్ పూజ వస్ట్రాకర్ (56, 65 బంతుల్లో 3 సిక్స్‌లు) అండతో భారత్‌కు భారీ స్కోరు అందించింది. హర్మన్‌ప్రీత్ కౌర్ ఐదు ఫోర్లు, ఓ సిక్సర్‌తో 62 బంతుల్లో అర్థ సెంచరీ పూర్తి చేయగా.. పూజ వస్ట్రాకర్ మూడు సిక్సర్ల జోరుతో 63 బంతుల్లో ఆ ఘనత సాధించింది. ఈ జోడీ మెరుపులతో భారత్ భారీ స్కోరు నమోదు చేసింది. శ్రీలంక బౌలర్లలో రణవీర, రష్మి సిల్వ, చమరి ఆటపట్టులు తలా రెండు వికెట్లు ఖాతాలో వేసుకున్నారు.
గైక్వాడ్ మాయజాలం : భారీ ఛేదనలో శ్రీలంక మహిళల జట్టు ఎంతోసేపు రేసులో నిలువలేదు. కెప్టెన్, ఓపెనర్ చమరి ఆటపట్టు (44, 41 బంతుల్లో 8 ఫోర్లు) క్రీజులో ఉన్నంతసేపే ఆ జట్టు పోటీలో నిలిచింది. హాసిని పెరీరా (39, 57 బంతుల్లో 3 ఫోర్లు) ఆరంభంలో భారత్‌పై ఒత్తిడి పెంచిన ఆటపట్టు ఆతిథ్య జట్టుకు ఊరట విజయం అందించేలా కనిపించింది. హర్మన్‌ప్రీత్ కౌర్ ఓవర్లో ఆటపట్టు పోరాటానికి తెరపడగా.. శ్రీలంక పతనం లాంఛనమే అయ్యింది. స్పిన్నర్ రాజేశ్వరి గైక్వాడ్ మూడు కీలక వికెట్లతో శ్రీలంక ఛేదనను దెబ్బతీసింది. లోయర్ ఆర్డర్లో నీలాక్షి డిసిల్వ (48 నాటౌట్, 59 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) ఒంటరి పోరాటంతో ఓటమి అంతరాన్ని కుదించింది. 155/8తో 200 పరుగుల లోపే ఆలౌటయ్యేలా కనిపించిన శ్రీలంక టెయిలెండర్ల జోరుతో చివరి రెండు వికెట్లకు 50కి పైగా పరుగులు సాధించింది. భారత బౌలర్ల మెరుపులతో 47.3 ఓవర్లలో శ్రీలంక ఇన్నింగ్స్‌కు తెరపడింది.
స్కోరు వివరాలు :
భారత మహిళల ఇన్నింగ్స్ : షెఫాలీ వర్మ (ఎల్బీ) సిల్వ 49, స్మృతీ మంధాన (సి) సంజీవని (బి) దిల్హరి 6, యస్టికా భాటియా (సి) కాంచన (బి) రణవీర 30, హర్లీన్ డియోల్ (స్టంప్డ్) సంజీవని (బి) సిల్వ 1, దీప్తి శర్మ (సి) పెరీరా (బి) రణసింగె 4, హర్మన్‌ప్రీత్ కౌర్ (సి) రణసింగె (బి) ఆటపట్టు 75, రిచా ఘోష్ (సి) ఆటపట్టు (బి) రణవీర 2, పూజ వస్ట్రాకర్ నాటౌట్ 56, మేఘన సింగ్ (బి) ఆటపట్టు 8, రేణుక సింగ్ (బి) కాంచన 2, రాజేశ్వరి గైక్వాడ్ నాటౌట్ 3, ఎక్స్‌ట్రాలు : 19, మొత్తం :(50 ఓవర్లలో 9 వికెట్లకు) 255.
వికెట్ల పతనం : 1-30, 2-89, 3-92, 4-94, 5-118, 6-124, 7-221, 8-242, 9-251.
బౌలింగ్ : ఆమ కాంచన 9-0-63-1, ఒషాడి రణసింగె 9-0-42-1, కవిష దిల్హరి 8-0-30-1, ఇనోక రణవీర 10-0-22-2, రష్మి సిల్వ 6-0-53-2, చమరి ఆటపట్టు 8-0-45-2.
శ్రీలంక మహిళల ఇన్నింగ్స్ : విష్మి గుణరత్నె (సి) రాజేశ్వరి (బి) మేఘన సింగ్ 3, చమరి ఆటపట్టు (సి) పూజ (బి) హర్మన్‌ప్రీత్ 44, హాసిని పెరీరా (బి) రాజేశ్వరి 39, కవిష దిల్హరి (స్టంప్డ్) యస్టికా (బి) రాజేశ్వరి 12, హర్షిత సమరవిక్రమ (బి) డియోల్ 22, నీలాక్షి డిసిల్వ నాటౌట్ 48, అనుష్క సంజీవని (బి) పూజ 1, ఆమ కాంచన (స్టంప్డ్) యస్టికా (బి) రాజేశ్వరి 2, ఒషాడి రణసింగె (సి) యస్టికా (బి) పూజ 1, రష్మి సిల్వ (బి) మేఘన సింగ్ 18, ఇనోక రణవీర (బి) దీప్తి 10, ఎక్స్‌ట్రాలు : 216, మొత్తం : (47.3 ఓవర్లలో ఆలౌట్) 216.
వికెట్ల పతనం : 1-7, 2-63, 3-99, 4-110, 5-146, 6-149, 7-152, 8-155, 9-183, 10-216.
బౌలింగ్ : రేణుక సింగ్ 8-0-33-0, మేఘన సింగ్ 7-0-32-2, దీప్తి శర్మ 8.3-0-47-1, రాజేశ్వరి గైక్వాడ్ 10-0-36-3, హర్మన్‌ప్రీత్ కౌర్ 5-0-21-1, పూజ వస్ట్రాకర్ 7-0-33-2, హర్లీన్ డియోల్ 2-1-7-1.