Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కశ్యప్, సాయిప్రణీత్ పరాజయం
- మలేషియా మాస్టర్స్ ఓపెన్
కౌలాలంపూర్ : మూడుసార్లు చాంపియన్, ఏడో సీడ్ పి.వి సింధు మలేషియా మాస్టర్స్ ఓపెన్ 500 టోర్నీ క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించింది. వరుస గేముల్లో ఎదురులేని విజయం సాధించిన తెలుగు తేజం మహిళల సింగిల్స్ టైటిల్‌కు మరో అడుగు చేరువైంది. గురువారం జరిగిన ప్రీ క్వార్టర్‌ఫైనల్ పోరులో చైనా షట్లర్ జాంగ్ యి మాన్‌పై సింధు 21-12, 21-10తో ఏకపక్ష విజయం నమోదు చేసింది. 28 నిమిషాల్లోనే క్వార్టర్స్‌కు చేరుకున్న సింధు.. రెండు గేముల్లోనూ చైనా అమ్మాయిపై చెలరేగింది. దూకుడుగా ఆడిన సింధు ప్రత్యర్థికి అవకాశమే ఇవ్వకుండా పాయింట్లు కొల్లగొట్టింది. నేడు క్వార్టర్ఫైనల్లో పి.వి సింధుకు కఠిన సవాల్ ఎదురు కానుంది. ప్రియ ప్రత్యర్థి చైనీస్ తైపీ టాప్ షట్లర్ తైజు యింగ్‌తో సింధు క్వార్టర్స్‌లో తలపడనుంది. మలేషియా ఓపెన్‌లో గత వారం తైజు యింగ్ చేతిలోనే కంగుతిన్న సింధు.. నేడు ప్రతీకారం తీర్చుకోవాలని బరిలోకి దిగనుంది. తైజు యింగ్‌పై 5-16 ముఖాముఖి రికార్డు కలిగిన సింధు నేడు వరల్డ్ నం.2ను ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.
పురుషుల సింగిల్స్‌లో హెచ్.ఎస్ ప్రణరు సైతం క్వార్టర్ఫైనల్లో కాలుమోపాడు. ప్రీ క్వార్టర్స్‌లో చైనీస్ తైపీ షట్లర్ వాంగ్ జు వీపై ప్రణరు వరుస గేముల్లో గెలుపొందాడు. 21-19, 21-16తో వరుస గేముల్లోనే ప్రణరు విజయం సాధించాడు. నేడు క్వార్టర్‌పైనల్లో జపాన్ ఆటగాడు కెంటా సునేమియాతో తలపడనున్నాడు. మరో షట్లర్ బి. సాయిప్రణీత్, కామన్వెల్త్ మాజీ చాంపియన్ పారుపల్లి కశ్యప్ పరాజయం పాలయ్యారు. సాయిప్రణీత్ 14-21, 17-21తో చైనా షట్లర్ లి షి ఫెంగ్ చేతిలో, పారుపల్లి కశ్యప్ 10-21, 15-21తో ఆరో సీడ్ ఇండోనేషియా షట్లర్ ఆంటోని గింటింగ్ చేతిలో ఓటమి పాలయ్యారు.