Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పొట్టి ఫార్మాట్లో బలమైన ఇంగ్లాండ్‌పై సిరీస్ విజయం సాధించేందుకు టీమ్ ఇండియా నేడు బర్మింగ్‌హామ్‌లో బరిలోకి దిగుతోంది. కెప్టెన్‌గా రోహిత్ శర్మ టీ20ల్లో వరుసగా 13వ విజయం నమోదు చేసి ప్రపంచ రికార్డు నెలకొల్పగా.. అదే ఊపులో మరో విజయంతో సిరీస్‌నూ సొంతం చేసుకునేందుకు భారత్ సిద్ధమవుతోంది. స్టార్ ఆటగాళ్ల రాకతో ఎడ్జ్‌బాస్టన్‌లో టీమ్ ఇండియా కూర్పు, వ్యూహంపై ఆసక్తి నెలకొంది. భారత్, ఇంగ్లాండ్ రెండో టీ20 నేడు.
- పొట్టి సిరీస్ విజయంపై భారత్ కన్ను
- జట్టులోకి కోహ్లి, పంత్, జడేజా రాక
- నేడు ఇంగ్లాండ్‌తో రెండో టీ20 పోరు
- రాత్రి 7 నుంచి సోనీనెట్వర్క్లో..
నవతెలంగాణ-బర్మింగ్‌హామ్
టీ20 సిరీస్ విజయమే లక్ష్యంగా నేడు భారత్ బరిలోకి దిగుతోంది. తొలి టీ20లో ఇంగ్లాండ్‌ను చిత్తు చేసిన టీమ్ ఇండియా నేడు బర్మింగ్‌హామ్‌లోనూ అదే ప్రదర్శన పునరావతృం చేయాలని చూస్తోంది. ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో ఆడిన విరాట్ కోహ్లి, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, జశ్‌ప్రీత్ బుమ్రాలు నేటి మ్యాచ్‌కు అందుబాటులో ఉండనున్నారు. సీనియర్ల రాకతో టీమ్ ఇండియా మరింత బలోపేతంగా మారనుంది. మరోవైపు తొలి పోరులో చేతులేత్తేసిన ఆతిథ్య ఇంగ్లాండ్ ఎడ్జ్‌బాస్టన్‌లో సిరీస్ సమం చేయాలని భావిస్తోంది. సిరీస్‌పై ఆశలు సజీవంగా నిలుపుకోవాలంటే నేడు ఇంగ్లాండ్ తప్పక నెగ్గాల్సి ఉంటుంది. దీంతో రెండో టీ20 సమరం రసవత్తరంగా సాగనుంది.
విరాట్‌పైనే ఫోకస్ : స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి కెరీర్లో తొలిసారి టీ20 తుది జట్టు కూర్పులో చోటుపై ప్రశ్నలు ఎదుర్కొంటున్నాడు. సీనియర్లకు విశ్రాంతి లభించిన వేళ యువ క్రికెటర్లు జాతీయ జట్టు తరఫున దుమ్ము రేపుతున్నారు. ఐర్లాండ్‌తో సిరీస్ సహా తాజాగా తొలి టీ20లో బలమైన ఇంగ్లాండ్‌ను మట్టికరిపించారు. 130 స్ట్రయిక్‌రేట్‌తో 80 పరుగులు చేయటం కంటే.. 180 స్ట్రయిక్‌రేట్‌తో 40 పరుగులు చేయడానికి కుర్రాళ్లు ఇష్టపడుతున్నారు. జట్టు మేనేజ్మెంట్ సైతం అందుకు సంతోషంగా అంగీకారం తెలుపుతోంది. ఈ పరిస్థితుల్లో చాన్నాండ్ల తర్వాత టీ20 జట్టులోకి రానున్న విరాట్ కోహ్లి తన స్థానానికి న్యాయం చేయాల్సిన పరిస్థితిలో ఉన్నాడు. టాప్ ఆర్డర్లో బ్యాటింగ్‌కు రానున్న విరాట్ కోహ్లి టీ20 ప్రపంచకప్ జట్టులో ఉండాలని అందరూ కోరుకుంటున్నారు. కానీ అందుకు తగ్గ ప్రదర్శన చేస్తేనే వరల్డ్‌కప్ జట్టులో నిలుస్తాడు. లేదంటే, సెలక్షన్ కమిటీకి కఠిన పరీక్ష ఎదురు కానుంది. రిషబ్ పంత్ సైతం టీ20ల్లో ప్రదర్శన పట్ల విమర్శలు ఎదుర్కొంటున్నాడు. నేడు పంత్‌ను ఓపెనర్‌గా ప్రయోగించే అవకాశం కనిపిస్తోంది. గొప్పగా రాణిస్తున్న దీపక్ హుడాను తప్పించటం కెప్టెన్‌గా రోహిత్‌కు కఠిన పరీక్షగా నిలువనుంది. పేస్ దళపతి జశ్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్ విభాగానికి నాయక త్వం వహించనుండ గా.. చాహల్‌తో కలిసి జడేజా స్పిన్ బాధ్యతలు పంచుకోనున్నాడు.
పుంజుకుంటారా?! : వైట్‌బాల్ ఫార్మాట్లో భీకర ఫామ్‌లో ఉన్న ఇంగ్లాండ్ తొలి టీ20లో పోటీ ఇవ్వలేకపోయింది. భారీ ఛేదనలో విధ్వంసక బ్యాటర్ జోశ్ బట్లర్ వైఫల్యం జట్టు ప్రదర్శనపై ప్రతికూల ప్రభావం చూపింది. టాప్ ఆర్డర్లో జోశ్ బట్లర్ నిలబడితే ఇంగ్లాండ్ దూకుడు వేరే లెవల్లో ఉంటుంది. సిరీస్‌పై ఆశలు నిలుపుకునేందుకు బట్లర్‌కు ఇదే చివరి అవకాశం. దీంతో ఇంగ్లాండ్ కెప్టెన్ నేడు మెగా ఇన్నింగ్స్‌పై కన్నేశాడు. లియాం లివింగ్‌స్టోన్, డెవిడ్ మలాన్‌లు ఇంగ్లాండ్‌కు కీలకం కానున్నారు. స్పిన్ ఆల్‌రౌండర్ మోయిన్ అలీ నుంచి ఇంగ్లాండ్ ధనాధన్ షో ఆశిస్తోంది. అతడు రాణిస్తే ఇంగ్లాండ్‌కు రెండు విభాగాల్లో సమస్య ఉండదు. తొలి బంతి నుంచే ఎదురుదాడికి దిగుతోన్న భారత బ్యాటర్లకు చెక్ పెట్టేందుకు ఇంగ్లాండ్ కొత్త వ్యూహంతో రావాల్సి ఉంది.
పిచ్, వాతావరణం : ఎడ్జ్‌బాస్టన్ టీ20ల్లో భారీ స్కోర్లకు ప్రసిద్ది. ఇక్కడ నమోదైన అత్యధిక స్కోరు 221. అత్యల్ప స్కోరు 144. విరాట్ కోహ్లికి ఇక్కడ మంచి రికార్డుంది. నేడు ఇక్కడ పెద్దగా వర్ష సూచనలు లేవు. ఆహ్లాదకర వాతావరణం ఉండనుంది. టాస్ నెగ్గిన జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం కనిపిస్తోంది.
తుది జట్లు (అంచనా) :
ఇంగ్లాండ్ : జేసన్ రారు, జోశ్ బట్లర్ (కెప్టెన్, వికెట్ కీపర్), డెవిడ్ మలాన్, లియాం లివింగ్‌స్టోన్, హారీ బ్రూక్, మోయిన్ అలీ, శామ్ కరణ్, క్రిస్ జోర్డాన్, టైమల్ మిల్స్, రీసీ టోప్లే, మాట్ పార్కిన్సన్.
భారత్ : రోహిత్ శర్మ (కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, దినేశ్ కార్తీక్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, జశ్‌ప్రీత్ బుమ్రా, యుజ్వెంద్ర చాహల్.
అభిమానుల్లో పోలీసులు!
భారత్, ఇంగ్లాండ్ రెండో టీ20 మ్యాచ్ నిర్వహణను ఎడ్జ్‌బాస్టన్ స్టేడియం నిర్వాహకులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇక్కడ జరిగిన ఐదో టెస్టులో అభిమానులు జాతి వివక్ష వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ఇప్పటికే వెస్ట్ మిడ్‌ల్యాండ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోమారి ఇక్కడ ఇటువంటి ఘటనలకు తావులేకుండా చూసేందుకు.. ఫుట్‌బాల్ మ్యాచ్ తరహాలో అభిమానుల గ్యాలరీల్లో అండర్ కవర్ పోలీసులను మోహరించనున్నారు.