Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్రికెట్ మ్యాచ్‌కు భారత ప్రభుత్వ ప్రతిపాదన
- ఆజాదీ అమృత్ మహోత్సవ్ కార్యక్రమం
నవతెలంగాణ-న్యూఢిల్లీ
క్రికెట్ అభిమానులకు పసందైన సమరం సిద్ధమవుతోంది!. అగ్ర జట్టు టీమ్ ఇండియా ఓ వైపు, ప్రపంచ క్రికెట్ స్టార్స్ అంతా మరోవైపుగా క్రికెట్ పోరుకు రంగం సిద్ధమవుతోంది. ఈ మేరకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి భారత ప్రభుత్వం నుంచి ప్రతిపాదన వెళ్లినట్టు సమాచారం. 75 వసంతాల స్వాతంత్య్ర వేడుకల ఉత్సవాలను ఘనంగా జరుపుతున్న భారత ప్రభుత్వం.. అందులో భాగంగా అన్ని రంగాల్లోనూ పలు కార్యక్రమాలు చేపడుతోంది. భారత్‌లో అత్యంత ప్రజాదరణ కలిగిన క్రికెట్‌ను వేడుకగా చేసేందుకు మెగా మ్యాచ్ నిర్వహణకు నడుం బిగించింది.
ఆగస్టు 22న మెగా మ్యాచ్ : భారత్ వర్సెస్ వరల్డ్ ఎలెవన్‌తో క్రికెట్ మ్యాచ్ నిర్వహించనున్నారు. ఆగస్టు 22న ఈ మ్యాచ్‌ను నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ (ఫిరోజ్ షా కోట్ల) స్టేడియం లేదా అహ్మదాబాద్‌లోని మొతెరా (నరెంద్ర మోడీ) స్టేడియం ఈ మెగా మ్యాచ్‌కు వేదికగా నిలువనుంది. ' భారత్ ఎలెవన్, వరల్డ్ ఎలెవన్ మధ్య ఓ క్రికెట్ మ్యాచ్ నిర్వహణకు భారత ప్రభుత్వం నుంచి ప్రతిపాదన వచ్చింది. ఆగస్టు 22న మ్యాచ్ ఏర్పాటుకు సూచించారు. వరల్డ్ ఎలెవన్‌తో మ్యాచ్‌కు కనీసం 13-14 మంది అంతర్జాతీయ క్రికెటర్లు అవసరం. ఆటగాళ్ల అందుబాటును పర్యవేక్షించాల్సి ఉంది' అని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. జులై 22-26న బర్మింగ్‌హామ్ వేదికగా ఐసీసీ వార్షిక సమావేశాలు జరుగనున్నాయి. ఈ సమావేశాల కోసం బీసీసీఐ ఉన్నతాధికారులు బర్మింగ్‌హామ్‌కు వెళ్లనున్నారు. అక్కడే ఇతర దేశాల బోర్డు పెద్దలతో వరల్డ్ ఎలెవన్ కూర్పు గురించి చర్చించనున్నారు. భారత క్రికెట్ ప్రథమ ప్రాధాన్య ఆటగాళ్లను బరిలో నిలపటం పెద్ద సమస్య కాదు. జింబాబ్వేతో వైట్‌బాల్ సిరీస్ ఆగస్టు 20న ముగియనుంది. ఆగస్టు 22న భారత క్రికెటర్లు స్వదేశానికి చేరుకోనున్నారు. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, రిషబ్ పంత్‌లు జింబాబ్వే పర్యటనకు వెళ్లటం లేదు. అవసరమైతే జింబాబ్వేకు ద్వితీయ శ్రేణి జట్టును పంపించవచ్చు.
ఆ సమయంలో కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్) సహా ఇతర ద్వైపాక్షిక సిరీస్‌లు ఉన్నాయి. దీంతో వరల్డ్ ఎలెవన్‌లో పాల్గొనే క్రికెటర్లకు బోర్డు భారీగా నష్ట పరిహార పారితోషికం చెల్లించాల్సి ఉంటుంది. ఆగస్టు 27న ఆసియా కప్ కోసం భారత జట్టు శ్రీలంకకు బయల్దేరనుంది. భారత ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రతిపాదన కావటంతో బీసీసీఐ అధికారులు వరల్డ్ ఎలెవన్‌తో మ్యాచ్ నిర్వహణకు ప్రతిష్టాత్మకంగా తీసుకోనున్నారు. త్వరలోనే ఈ మ్యాచ్‌పై బీసీసీఐ నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం కనిపిస్తోంది.