Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రపంచ క్రీడల్లో రికార్డు పతకం సొంతం
బర్మింగ్‌హామ్ (అమెరికా) : భారత ఆర్చరీ జోడీ చరిత్ర సృష్టించింది. ప్రపంచ క్రీడల్లో తొలి కాంస్య పతకం సాధించిన ఘనత సొంతం చేసుకుంది. కాంపౌడ్ మిక్స్డ్ జట్టు విభాగంలో వెన్నం జ్యోతి సురేఖ, అభిషేక్ వర్మ అదరగొట్టారు. కాంస్య పతక పోరులో మెక్సికో ఆర్చరీ జంటపై ఓ పాయింట్ తేడాతో పతకం సొంతం చేసుకున్నారు. మెడల్ రేసులో తొలి రౌండ్లో సురేఖ, వర్మలు ఆధిక్యం సాధించారు. మెక్సికో జోడీ ఆండ్రీయ బెకెరా, మైగల్ బెకెరాలు రెండో రౌండ్లో స్కోరు సమం చేశారు. ఉత్కంఠ రేగిన మూడో రౌండ్లో భారత జోడీ గురి తప్పలేదు. తుది రౌండ్లోనూ విల్లు ఎక్కుపెట్టిన సురేఖ, వర్మ పర్ఫెక్ట్ స్కోర్లు సాధించారు. 157-156తో కాంస్య పతకం సొంతం చేసుకున్నారు. ప్రపంచ క్రీడల్లో భారత్‌కు ఇది తొలి మెడల్ అని భారత ఆర్చరీ సంఘం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ మెడల్‌తో స్టార్ ఆర్చర్ అభిషేక్ వర్మ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. కెరీర్ 50వ మెడల్ సాధించిన అభిషేక్ వర్మ.. ప్రపంచ స్థాయిలో అన్ని మెగా వేదికలపై పతకాలు సాధించిన ఏకైక భారత ఆర్చర్‌గా నిలిచాడు. వరల్డ్ గేమ్స్, వరల్డ్ చాంపియన్‌షిప్స్, వరల్డ్‌కప్ ఫైనల్, వరల్డ్‌కప్, ఆసియా క్రీడలు, ఆసియా చాంపియన్‌షిప్స్‌లో అభిషేక్ వర్మ పతకాలు కొల్లగొట్టాడు. ఇక, వ్యక్తిగత విభాగంలో అభిషేక్ వర్మ తృటిలో పతకం చేజార్చుకున్నాడు. క్వార్టర్ఫైనల్లో వరల్డ్ నం.1, వరల్డ్ చాంపియన్ ఆర్చర్ మైక్ స్కాలెసర్ (అమెరికా)ను ఓడించిన అభిషేక్ వర్మ.. సెమీఫైనల్లో వరల్డ్ నం.4 జీన్ ఫిలిప్ (ఫ్రాన్స్)కు 141-143తో పసిడి పోరు బెర్త్‌ను కోల్పోయాడు. కాంస్య పతకం కోసం జరిగిన పోటీలో కెనడా ఆర్చర్ క్రిస్టోఫర్ పెర్కిన్స్ చేతిలో 145-148తో వెనుకంజ వేసి పతకం చేజార్చుకున్నాడు.