Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఛేదనలో సూర్య శతకం వృథా
- చివరి టీ20లో భారత్ ఓటమి
- 2-1తో టీ20 సిరీస్ కైవసం
- ఇంగ్లాండ్‌కు ఊరట విజయం
నవతెలంగాణ-నాటింగ్‌హామ్
సూర్యకుమార్ యాదవ్ (117, 55 బంతుల్లో 14 ఫోర్లు, 6 సిక్స్‌లు) మెరుపు శతకం వృథా అయ్యింది. 216 పరుగుల భారీ ఛేదనలో భారత్ టాప్ ఆర్డర్ బ్యాటర్లు చేతులెత్తేశారు. సూర్యకుమార్ ఒక్కడే ఛేదనలో నిలబడ్డాడు. ధనాధన్ సెంచరీతో భారత్‌ను గెలుపు దిశగా తీసుకెళ్లాడు. కానీ మరో ఎండ్‌లో సహకారం కొరవడి, ఒత్తిడిలో చివరకు వికెట్ కోల్పోయాడు. చివరి టీ20లో భారత్ 17 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. 2-1తో టీ20 సిరీస్ భారత్ వశం కాగా, ఇంగ్లాండ్‌కు ఊరట విజయం లభించింది. అంతకముందు, ఇంగ్లాండ్ బ్యాటర్లు డెవిడ్ మలన్ (77, 39 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్‌లు), లియాం లివింగ్‌స్టోన్ (42 నాటౌట్, 29 బంతుల్లో 4 సిక్స్‌లు) చెలరేగారు. భారత బౌలర్లపై ధనాధన్ జోరు చూపించారు. ఈ ఇద్దరు రాణించటంతో మూడో టీ20లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 215 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది.
సూర్య ఒంటరి పోరాటం : 216 పరుగుల భారీ ఛేదనలో టాప్ ఆర్డర్ చేతులెత్తేసింది. రోహిత్ శర్మ (11, 12 బంతుల్లో 2 ఫోర్లు), విరాట్ కోహ్లి (11, 6 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్), రిషబ్ పంత్ (1, 5 బంతుల్లో), దినేశ్ కార్తీక్ (6), రవీంద్ర జడేజా (7), శ్రేయస్ అయ్యర్ (28, 23 బంతుల్లో 2 సిక్స్‌లు) నిరాశపరిచారు. మిగతా బ్యాటర్లు 59 బంతుల్లో 65 పరుగులు చేయగా.. సూర్యకుమార్ యాదవ్ శతకం విన్యాసంతో భారత్ చివరి బంతి వరకు రేసులో నిలిచింది. 32 బంతుల్లో అర్థ సెంచరీ బాదిన సూర్య.. శతకాన్ని మరో 16 బంతుల్లోనే చేరుకున్నాడు. 14 ఫోర్లు, 6 సిక్సర్లతో చెలరేగిన సూర్యకుమార్ యాదవ్ ఒంటిచేత్తో విజయాన్ని అందించేలా కనిపించాడు. కానీ మరో ఎండ్‌లో బ్యాటర్ లేకపోవటంతో ఒత్తిడికి లోనై.. 19వ ఓవర్లో వికెట్ కోల్పోయాడు. 20 ఓవర్లలో 9 వికెట్లకు 198 పరుగులే చేసిన భారత్ 17 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఇంగ్లాండ్ బౌలర్లలో టాప్లే (3/22) రాణించాడు.
దంచికొట్టారు : నామమాత్రపు టీ20 మ్యాచ్‌కు భారత్ నాలుగు మార్పులు చేసింది. పాండ్య, బుమ్రా, భువి, చాహల్ విశ్రాంతి తీసుకున్నారు. దీంతో భారత బౌలింగ్ లైనప్‌పై ఇంగ్లాండ్ బ్యాటర్లు ప్రతాపం చూపించారు. అవేశ్ ఖాన్ ఇన్నింగ్స్ ఆరంభ ఓవర్లో రెండు పరుగులే ఇచ్చినా.. ఉమ్రాన్ మాలిక్‌పై జోశ్ బట్లర్ విరుచుకుపడ్డాడు. ఓ ఓవర్లో 17 పరుగులు పిండుకున్నారు. దీంతో ఇంగ్లాండ్ ఇన్నింగ్స్‌కు ఊపోచ్చింది. జోరుమీదున్న జోశ్ బట్లర్ (18, 9 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్)ను అవేశ్ ఖాన్ బోల్తా కొట్టించగా.. జేసన్ రారు (27, 26 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లు)ని ఉమ్రాన్ మాలిక్ సాగనంపాడు. అప్పటికే బిష్ణోరు, జడేజా ఓవర్లో భారీ సిక్సర్లు బాదిన రారు.. ఇన్నింగ్స్‌ను ట్రాక్‌లో నిలిపాడు. ఫిల్ సాల్ట్ (8) నిరాశపరిచినా.. డెవిడ్ మలన్ (77), లియాం లివింగ్‌స్టోన్ (42 నాటౌట్) జోడీ నాల్గో వికెట్‌కు 84 పరుగుల భారీ భాగస్వామ్యం నమోదు చేసింది. 30 బంతుల్లోనే అర్థ సెంచరీ పూర్తి చేసిన మలన్.. ఉమ్రాన్ మాలిక్ ఓవర్లో వరుసగా సిక్సర్, ఫోర్‌తో విశ్వరూపం చూపించాడు. బ్రూక్ (19) తోడుగా చివర్లో లివింగ్‌స్టోన్ ఇంగ్లాండ్‌కు భారీ స్కోరు అందించాడు.
స్కోరు వివరాలు :
ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ : 215/7 (డెవిడ్ మలన్ 77, లివింగ్‌స్టోన్ 42, హర్షల్ 2/35, రవి బిష్ణోరు 2/30)
భారత్ ఇన్నింగ్స్ : 198/9 (సూర్యకుమార్ యాదవ్ 117, శ్రేయస్ అయ్యర్ 28, టాప్లే 3/22, విల్లే 2/40)