Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆసీస్‌పై ఇన్నింగ్స్ విజయం
- 1-1తో టెస్టు సిరీస్ సమం
గాలె (కొలంబో) : ఆర్థిక, రాజకీయ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకకు ఆ దేశ క్రికెట్ జట్టు వరుస ఊరటలు కలిగిస్తూనే ఉంది. అసమాన ప్రదర్శనలతో అద్వితీయ విజయాలు నమోదు చేసి శ్రీలంక ప్రజల్లో కొంతైనా ఆనందం నింపుతోంది!. లెఫ్టార్మ్ స్పిన్నర్ ప్రభత్ జయసూర్య (6/118, 6/59) 12 వికెట్ల మాయజాలంతో చెలరేగటంతో రెండో టెస్టులో ఆస్ట్రేలియాపై శ్రీలంక ఘన విజయం సాధించింది. ఇన్నింగ్స్ 39 పరుగులతో గొప్పగా గెలుపొందింది. జయసూర్య మాయకు ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 41 ఓవర్లలో 151 పరుగులకే కుప్పకూలింది. స్టీవ్ స్మిత్ (0), లబుషేన్ (32), ఉస్మాన్ ఖవాజా (29), కామెరూన్ గ్రీన్ (23), మిచెల్ స్టార్క్ (16), మిచెల్ స్విప్సన్ (0) వికెట్లను జయసూర్య పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో స్టీవ్ స్మిత్ (145 నాటౌట్), మార్నస్ లబుషేన్ (104) శతకాలతో ఆస్ట్రేలియా 364 పరుగులు చేసింది. కానీ, దినేశ్ చండిమాల్ (206 నాటౌట్) అజేయ ద్వి శతకానికి తోడు దిమిత్ కరుణరత్నె (86), కుశాల్ మెండిస్ (85), కుమింద్ మెండిస్ (61), ఎంజెలో మాథ్యూస్ (52) రాణించటంతో శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 554 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. ఆస్ట్రేలియా రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌ను అందుకోలేకపోయింది. శ్రీలంక సూపర్ విక్టరీతో రెండు మ్యాచుల టెస్టు సిరీస్ 1-1తో సమంగా ముగిసింది. జయసూర్య 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలువగా, దినేశ్ చండిమాల్ 'మ్యాన్ ఆఫ్ ది సిరీస్' అవార్డు అందుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో 350 పైచిలుకు పరుగులు చేసినా ఇన్నింగ్స్ తేడాతో పరాజయం పాలవటం టెస్టు క్రికెట్ చరిత్రలో ఆస్ట్రేలియాకు ఇదే ప్రథమం కావటం గమనార్హం.