Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 10మీ ఎయిర్ రైఫిల్‌లో స్వర్ణం షూటింగ్ ప్రపంచకప్
చాంగ్వాన్ (దక్షిణ కొరియా) : భారత యువ షూటర్ అర్జున్ బాబుట గురి అదిరింది. 23 ఏండ్ల అర్జున్ షూటింగ్ ప్రపంచకప్‌లో కండ్లుచెదిరే ప్రదర్శన చేశాడు. టోక్యో ఒలింపిక్స్ సిల్వర్ మెడలిస్ట్‌ను ఓడించి.. పసిడి పతకం సొంతం చేసుకున్నాడు. గోల్డ్ మెడల్ రేసులో అర్జున్ బాబుట అంచనాలను మించి రెచ్చిపోయాడు. టాప్ క్లాస్ గురితో 17-9తో ఏకపక్ష ప్రదర్శన గావించాడు. అమెరికా షూటర్ లుకాస్‌ను వెనక్కి నెట్టి షూటింగ్ ప్రపంచకప్‌లో పసిడి పతకం సాధించాడు. మెన్స్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో అర్జున్ బాబుట అగ్రస్థానంలో నిలిచాడు. అర్హత రౌండ్లో 630.5 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచిన అర్జున్, తర్వాతి రౌండ్లో 261.7 పాయింట్లతో ముందంజలో నిలిచాడు. ఇదే విభాగంలో ఫైనల్స్‌కు అర్హత సాధించిన మరో భారత షూటర్ పార్థ్ మఖిజా నాల్గో స్థానంలో నిలిచాడు. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో మెహులీ ఘోష్ 628.7 పాయింట్లు సాధించినా.. 0.1 పాయింట్ వ్యత్యాసంతో రెండో రౌండ్‌కు దూరమైంది. మెన్స్ ఎయిర్ పిస్టల్ విభాగంలో నవీన్ (587), సాగర్ దంగి (582), శివ నర్వాల్ (580)లు ఫైనల్స్‌కు అర్హత సాధించారు. ఈ విభాగాల్లో పతక పోటీలు నేడు జరుగుతాయి. మహిళల విభాగంలో స్టార్ షూటర్లు మను భాకర్ (573), ఇషా సింగ్ (570) ఆర్పీఎస్ విభాగంలో అంచనాలను అందుకోలేదు. పతక రౌండ్‌కు అర్హత సాధించలేదు.