Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పొట్టి ఫార్మాట్లో ధనాధన్ ఎదురుదాడితో ఇంగ్లాండ్‌కు ఝలక్ ఇచ్చిన టీమ్ ఇండియా.. నేడు వన్డే సమరానికి సిద్ధమవుతోంది. టీ20 తరహాలోనే 50 ఓవర్ల ఆటలోనూ దూకుడు మంత్రం భారత్ ప్రయోగించనుంది. వన్డేల్లోనైనా భారత్‌ను దూకుడుగా ఎదుర్కొవాలని ఆతిథ్య ఇంగ్లాండ్ భావిస్తోంది. భారత్, ఇంగ్లాండ్ తొలి వన్డే పోరు నేడు.
- భారత్, ఇంగ్లాండ్ తొలి వన్డే నేడు
- ఓవల్‌లో ఇరు జట్లదీ దూకుడు మంత్రమే
- సాయంత్రం 5.30 నుంచి సోనీనెట్వర్క్లో..
నవతెలంగాణ-లండన్
టీ20 ప్రపంచకప్ ఏడాదిలో వన్డే సమరానికి ప్రాధాన్యత అరుదు. వచ్చే ఏడాది వన్డే వరల్డ్‌కప్ ప్రణాళికల్లో భాగంగా తాజాగా వన్డే సిరీస్‌ను చూడవచ్చు. ఆధునిక క్రికెట్లో విప్లవాత్మక మార్పులకు అనుగుణంగా జట్టు వ్యూహ రచన ఉండేందుకు భారత్, ఇంగ్లాండ్ ఈ సిరీస్‌ను ప్రయోగశాలగా చేసుకోనున్నాయి. మోర్గాన్ నిర్మించిన భయమెరుగని ఇంగ్లాండ్ బట్లర్ నాయకత్వంలో కొత్త శకంలోకి ప్రవేశిస్తుండగా... రోహిత్ శర్మ సారథ్యంలో టీమ్ ఇండియా సరికొత్త పంథాలో ఆడేందుకు అడుగులు వేస్తోంది. 50 ఓవర్ల ఆటైనా.. నేడు ఇరు జట్ల టీ20 తరహా దూకుడు ఆశించవచ్చు.
పంథాపైనే ఫోకస్ : వైట్‌బాల్ ఫార్మాట్లో టీమ్ ఇండియా ప్రణాళికలకు విమర్శలు ఉన్నాయి. సంప్రదాయ శైలిలో పరుగుల వేట టీమ్ ఇండియాను వెనుకంజ నిలుపుతోంది. దీంతో టీ20 సిరీస్‌లోనే భారత్ తొలి బంతి నుంచే దూకుడు ఫార్ములా అమలు చేసింది. వన్డేల్లోనూ రోహిత్, ద్రవిడ్ ద్వయం అదే పని చేయనుంది. శిఖర్ ధావన్, రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్‌లు భారత్‌కు కీలకం కానున్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ మెగా ఇన్నింగ్స్ బాకీ పడ్డాడు. ఆల్‌రౌండర్లు హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజాలకు ఇక్కడ మంచి రికార్డు ఉంది. ది ఓవల్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్ శిఖర్ ధావన్. విరామం అనంతరం ఆడుతున్న ధావన్ తడాఖా చూపించేందుకు సిద్ధమవుతున్నాడు. పేస్ దళపతి బుమ్రాతో షమి, శార్దుల్ ఠాకూర్ పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు. యుజ్వెంద్ర చాహల్‌తో కలిసి జడేజా స్పిన్ మాయ చేయనున్నాడు. తుది జట్టు కూర్పులో శ్రేయస్ అయ్యర్‌కు చోటు దక్కుతుందా? లేదా?అనేది చూడాలి.
జోరుమీదున్న ఇంగ్లాండ్ : టెస్టు సిరీస్‌లో ఆడిన క్రికెటర్లు సైతం అందుబాటులోకి రావటంతో ఇంగ్లాండ్ నూతనోత్తేజంతో కనిపిస్తోంది. కెరీర్ భీకర ఫామ్‌లో ఉన్న జో రూట్, జానీ బెయిర్‌స్టోలు తొలి వన్డేలో ఇంగ్లాండ్‌కు అతిపెద్ద బలం. టీ20 సిరీస్‌లో నిరాశపరిచిన జోశ్ బట్లర్ వన్డేల్లో సత్తా చాటేందుకు ఎదురు చూస్తున్నాడు. మోర్గాన్ కెప్టెన్సీ త్యజించిన అనంతరం ఆడుతున్న తొలి వన్డే సిరీస్‌లో ఇంగ్లాండ్ అతడి అడుగుల్లోనే నడుస్తుందేమో చూడాలి. ఆల్‌రౌండర్లు బెన్ స్టోక్స్, లివింగ్‌స్టోన్, శామ్ కరణ్‌లు భారత్‌కు సవాల్ విసరనున్నారు. క్రెయిగ్ ఓవర్టన్, డెవిడ్ విల్లే, రీసీ టాప్లేలు పేస్ బాధ్యతలు పంచుకోనుండగా.. మోయిన్ అలీ స్పిన్ బాధ్యతలు చూసుకోనున్నాడు. టీ20 సిరీస్ కోల్పోయిన ఇంగ్లాండ్.. వన్డే సిరీస్ కోసం అన్ని అస్త్రాలు వాడనుంది.
పిచ్, వాతావరణం : ది ఓవల్ మైదానం సహజంగానే ఫ్లాట్ పిచ్. పరుగుల వరదకు ఇది పెట్టింది పేరు. ఆరంభ ఓవర్లలోనే పేసర్లకు పిచ్ నుంచి సహకారం ఉంటుంది. స్పిన్నర్లు కీలక పాత్ర పోషించగలరు. వాతావరణం ఆహ్లాదకరంగా ఉండనుంది. ఎటువంటి వర్ష సూచనలు లేవు. టాస్ నెగ్గిన జట్టు తొలుత ఫీల్డింగ్ ఎంచుకునే అవకాశం ఉంది.
తుది జట్లు (అంచనా) :
భారత్ : రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధావన్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, మహ్మద్ షమి, శార్దుల్ ఠాకూర్, జశ్‌ప్రీత్ బుమ్రా, యుజ్వెంద్ర చాహల్.
ఇంగ్లాండ్ : జోశ్ బట్లర్ (కెప్టెన్), జేసన్ రారు, జో రూట్, హారీ బ్రూక్, జానీ బెయిర్‌స్టో (వికెట్ కీపర్), బెన్ స్టోక్స్, మోయిన్ అలీ, శామ్ కరణ్, మాట్ పార్కిన్సన్, రీసీ టాప్లే, డెవిడ్ విల్లే.
కోహ్లికి గాయం
భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి గాయానికి గురయ్యాడు. ఇంగ్లాండ్‌తో మూడో టీ20లో విరాట్ కోహ్లి గాయం పాలైనట్టు బీసీసీఐ వర్గాల సమాచారం. దీంతో నేడు తొలి వన్డేకు కోహ్లి దూరం కానున్నాడు. చివరి రెండు వన్డేలకు అందుబాటులో ఉండేందుకు తొలి మ్యాచ్ నుంచి విశ్రాంతి తీసుకునే అవకాశం ఉన్నట్టు జట్టు వర్గాలు తెలిపాయి. టీ20 సిరీస్ సహా కొంతకాలంగా నిలకడగా విఫలమవుతున్న విరాట్ కోహ్లి రానున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్ జట్టులో చోటును ప్రశ్నార్థకం చేసుకుంటున్న సంగతి తెలిసిందే.