Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్ కెరీర్ భీకర ఫామ్‌లో ఉన్నారు. తొలి వన్డేలో ఇంగ్లాండ్ తొలుత బ్యాటింగ్. అరివీర భయానక బ్యాటింగ్ లైనప్ కలిగిన ఇంగ్లాండ్ 350 పైచిలుకు పరుగులు చేయగలదనే కచ్చితమైన అంచనాలు!. పేస్ దళపతి జశ్‌ప్రీత్ బుమ్రా ఇంగ్లాండ్ భీకర బ్యాటింగ్ లైనప్‌ను చీల్చి చెండాడాడు. కండ్లుచెదిరే బంతులతో ఇంగ్లాండ్ టాప్ ఆర్డర్ అంతు తేల్చాడు. రారు (0), బెయిర్‌స్టో (0), రూట్ (0), లివింగ్‌స్టోన్ (0)లను ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు పంపించాడు. బుమ్రాకు షమి తోడవటంతో ఇంగ్లాండ్ 110 పరుగులకే కుప్పకూలింది. రోహిత్ శర్మ (76 నాటౌట్) కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో తొలి వన్డేలో భారత్ 10 వికెట్ల తేడాతో భారీ విజయం నమోదు చేసింది. సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది.
- ఆరు వికెట్లతో చెలరేగిన పేస్ దళపతి
- ఇంగ్లాండ్ 110 పరుగులకే ఆలౌట్
- ఛేదనలో రోహిత్ అజేయ అర్థ సెంచరీ
- తొలి వన్డేలో భారత్ ఘన విజయం
నవతెలంగాణ-లండన్
వైట్‌బాల్ ఫార్మాట్లో టీమ్ ఇండియా జోరు కొనసాగుతోంది. తొలుత టీ20ల్లో ఇంగ్లాండ్ వ్యూహ పద్దతులతో ఆ జట్టునే చిత్తు చేసిన భారత్.. తాజాగా వన్డేల్లోనూ అదే పునరావృతం చేస్తోంది. ఎదురుదాడి వ్యూహంతో తొలి వన్డేలో ఇంగ్లాండ్‌ను భారత్ దారుణంగా దెబ్బకొట్టింది. ప్రధాన పేసర్ జశ్‌ప్రీత్ బుమ్రా (6/19) నిప్పులు చెరిగే బంతులతో విజృంభించగా ఇంగ్లాండ్ తొలుత 110 పరుగులకే కుప్పకూలింది. బుమ్రాకు షమి తోడవటంతో ఇంగ్లాండ్ బ్యాటింగ్ లైనప్‌లో ఏకంగా ఐదుగురు బ్యాటర్లు సున్నా పరుగులకే వికెట్ కోల్పోయారు. జేసన్ రారు (0), జానీ బెయిర్‌స్టో (0), జో రూట్ (0), బెన్ స్టోక్స్ (0), లియాం లివింగ్‌స్టోన్ (0)లు ఖాతా తెరవకుండానే నిష్క్రమించారు. జోశ్ బట్లర్ (30), డెవిడ్ విల్లే (21) ఇంగ్లాండ్ వంద పరుగులు దాటే ప్రదర్శన చేశారు. స్వల్ప లక్ష్యాన్ని భారత్ అలవోకగా ఛేదించింది. ఓపెనర్లు రోహిత్ శర్మ (76 నాటౌట్, 58 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్స్‌లు), శిఖర్ ధావన్(31 నాటౌట్, 54 బంతుల్లో 4 ఫోర్లు) ఆడుతూ పాడుతూ కొట్టేశారు. కెప్టెన్ రోహిత్ శర్మ ధనాధన్ అజేయ అర్థ సెంచరీతో అదరగొట్టాడు. భారత్ పది వికెట్ల తేడాతో తొలి వన్డేలో ఘన విజయం సాధించింది. మూడు మ్యాచుల వన్డే సిరీస్‌లో 1-0తో ముందంజ వేసింది. ఆరు వికెట్ల వీరుడు జశ్‌ప్రీత్ బుమ్రా 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచాడు.
ఓపెనర్లు కొట్టేశారు : 111 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్ ఊదేసింది. ఓపెనర్లు ఆడుతూ పాడుతూ చిన్న స్కోరును చితక్కొట్టారు. కెప్టెన్ రోహిత్ శర్మ అజేయ అర్థ సెంచరీతో ఛేదనలో చెలరేగగా.. మరో ఓపెనర్ శిఖర్ ధావన్ సమయోచితంగా రాణించాడు. ఆరంభంలో ఓపెనర్లు నెమ్మదిగా ఆడారు. ఐదు ఓవర్లలో భారత్ 14 పరుగులే చేసింది. అందులో రోహిత్ శర్మ ఓ సిక్సర్, ఫోర్ బాదటం విశేషం. ఇన్నింగ్స్ ఏడో ఓవర్ నుంచి భారత్ జోరు మొదలైంది. టాప్లే ఓవర్లో తొలుత ధావన్ వరుస ఫోర్లు బాదగా.. రోహిత్ శర్మ మరో బౌండరీతో ముగించాడు. ఓవర్టన్ వేసిన పదో ఓవర్లో రోహిత్ శర్మ వరుసగా సిక్సర్, ఫోర్‌తో చెలరేగాడు. దీంతో పది ఓవర్లలో భారత్ 56/0తో జోరందుకుంది. కార్సే వేసిన ఓవర్లో రెండు సిక్సర్లు, ఓ ఫోర్‌తో కదం తొక్కిన రోహిత్ శర్మ 49 బంతుల్లో అర్థ సెంచరీ సాధించాడు. కార్సే వేసిన ఇన్నింగ్స్ 19వ ఓవర్లో రోహిత్ భారీ సిక్సర్ కొట్టగా.. కట్ షాట్‌తో బౌండరీ బాదిన ధావన్ లాంఛనం ముగించాడు. 18.4 ఓవర్లలో 114/0తో ఛేదనను ముగించారు.
బుమ్రా బూమ్.. ఇంగ్లాండ్ ఢమాల్! : టాస్ నెగ్గిన భారత్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. భీకర బ్యాటింగ్ లైనప్ కలిగిన ఆతిథ్య ఇంగ్లాండ్ తొలుత బ్యాటింగ్‌కు వచ్చింది. ఆ జట్టులోని బ్యాటర్ల ఇటీవల భీకర ప్రదర్శనలతో ది ఓవల్ మైదానంలో పరుగుల వరద ఆశించారు అభిమానులు. కానీ భారత పేస్ దళపతి జశ్‌ప్రీత్ బుమ్రా తొలి వన్డే గమనాన్ని శాసించాడు. అత్యుత్తమ బంతులతో నిప్పులు చెరిగిన బుమ్రా.. ఇంగ్లాండ్ బ్యాటర్లకు సింహాస్వప్నంగా మారాడు. ఓపెనర్ జేసన్ రారు (0)కి తొలుత స్వింగ్ చూపించిన బుమ్రా.. అతడిని ట్రాప్‌లో పడేశాడు. స్వింగ్ చేయని బంతితో రారు వికెట్లను గిరాటేశాడు. జో రూట్ (0) ఎడ్జ్‌తో వికెట్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చాడు. ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే రారు, రూట్లను డకౌట్ చేసిన బుమ్రా ఇంగ్లాండ్‌ను కష్టాల్లో పడేశాడు. జానీ బెయిర్‌స్టో (7), లియాం లివింగ్‌స్టోన్ (0)లను సైతం బుమ్రా గొప్పగా అవుట్ చేశాడు. ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ (0) సంగతి షమి చూసుకున్నాడు. బుమ్రా, షమి షోతో ఇంగ్లాండ్ 26/5తో పీకల్లోతు కష్టాల్లో కూరుకుంది. వన్డే క్రికెట్ చరిత్రలోనే అత్యంత స్వల్ప
స్కోరుకు ఆలౌటయ్యే ప్రమాదంలో పడింది. ఇంగ్లాండ్ కెప్టెన్ జోశ్ బట్లర్ (30, 32 బంతుల్లో 6 ఫోర్లు) మరో ఎండ్‌లో దూకుడుగా ఆడే ప్రయత్నం చేశాడు. వికెట్లు పడినా.. ఎదురుదాడి మంత్ర వీడేందుకు ఇష్టపడలేదు. ఫలితంగా మహ్మద్ షమి వలలో పడిన బట్లర్.. డీప్ స్క్వేర్‌లో బౌండరీ లైన్ వద్ద సూర్యకుమార్‌కు దొరికిపోయాడు. అంతకముందే మోయిన్ అలీ (14, 18 బంతుల్లో 2 ఫోర్లు) ప్రసిద్ కృష్ణకు రిటర్న్ క్యాచ్‌తో నిష్క్రమించాడు. 68 పరుగులకు 8 వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్‌కు టెయిలెండర్లు గౌరవప్రద స్కోరు అందించారు. డెవిడ్ విల్లే (21, 26 బంతుల్లో 3 ఫోర్లు), బ్రేడన్ కార్సె (15, 26 బంతుల్లో 2 ఫోర్లు), రీసీ టాప్లే (6 నాటౌట్, 7 బంతుల్లో 1 సిక్స్) చెప్పుకోదగిన పరుగులు చేశాడు. రెండో స్పెల్‌లో బంతి అందుకున్న బుమ్రా.. చివరి రెండు వికెట్లతో లాంఛనం ముగించాడు. కెరీర్ అత్యుత్తమ గణాంకాలు 6/19తో మ్యాచ్‌ను ముగించాడు. 25.2 ఓవర్లలో ఇంగ్లాండ్ 110 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో మహ్మద్ షమి (3/31), ప్రసిద్ కృష్ణ (1/26) రాణించారు.
స్కోరు వివరాలు :
ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ : జేసన్ రారు (బి) బుమ్రా 0, జానీ బెయిర్‌స్టో (సి) రిషబ్ పంత్ (బి) బుమ్రా 7, జో రూట్ (సి) రిషబ్ పంత్ (బి) బుమ్రా 0, బెన్ స్టోక్స్ (సి) రిషబ్ పంత్ (బి) మహ్మద్ షమి 0, జోశ్ బట్లర్ (సి) సూర్యకుమార్ (బి) మహ్మద్ షమి 30, లియాం లివింగ్‌స్టోన్ (బి) బుమ్రా 0, మోయిన్ అలీ (సి,బి) ప్రసిద్ కృష్ణ 14, డెవిడ్ విల్లే (బి) బుమ్రా 21, క్రెయిగ్ ఓవర్టన్ (బి) మహ్మద్ షమి 8, బ్రేడన్ కార్సె (బి) బుమ్రా 6, రీసీ టాప్లే నాటౌట్ 6, ఎక్స్‌ట్రాలు : 9, మొత్తం : (25.2 ఓవర్లలో ఆలౌట్) 110.
వికెట్ల పతనం : 1-6, 2-6, 3-7, 4-17, 5-26, 6-53, 7-59, 8-68, 9-103, 10-110.
బౌలింగ్ : మహ్మద్ షమి 7-0-31-3, జశ్‌ప్రీత్ బుమ్రా 7.2-3-19-6, హార్దిక్ పాండ్య 4-0-22-0, ప్రసిద్ కృష్ణ 5-0-26-1, యుజ్వెంద్ర చాహల్ 2-0-10-0.
భారత్ ఇన్నింగ్స్ : రోహిత్ శర్మ 76 నాటౌట్, శిఖర్ ధావన్ 31 నాటౌట్, ఎక్స్‌ట్రాలు : 07, మొత్తం : (18.4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా) 114.
బౌలింగ్ : డెవిడ్ విల్లే 3-0-8-0, రీసీ టాప్లే 5-3-22-0, క్రెయిగ్ ఓవర్టన్ 4-0-34-0, బ్రేడన్ కార్సే 3.4-0-38-0, బెన్ స్టోక్స్ 1-0-1-0, మోయిన్ అలీ 2-0-9-0.