Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇంగ్లాండ్‌తో రెండో వన్డే నేడు
-జోరుమీదున్న టీమ్ ఇండియా
-ప్రతీకార వేటలో బట్లర్గ్యాంగ్
-సాయంత్రం 5.30 నుంచి సోనీలో..
వైట్‌బాల్ ఫార్మాట్లో టీమ్ ఇండియా మరో సిరీస్ విజయంపై కన్నేసింది. బ్యాటింగ్ పవర్‌హౌస్ ఇంగ్లాండ్‌ను చిత్తు చేసి వన్డే సిరీస్‌ను వశం చేసుకోవాలని ముందుకు సాగుతోంది. బంతితో బుమ్రా, బ్యాట్‌తో రోహిత్ ధనాధన్ ప్రదర్శనతో తొలి వన్డేలో ఇంగ్లాండ్‌కు కోలుకోలేని పంచ్ ఇచ్చారు. ది ఓవల్ జోరును లార్డ్స్‌లోనూ పునరావృతం చేసి సిరీస్‌ను పట్టేయాలని టీమ్ ఇండియా భావిస్తోంది. ప్రతీకారం కోసం ఇంగ్లాండ్ ఎదురుచూస్తున్న వేళ కీలక రెండో వన్డే సమరం నేడు.
నవతెలంగాణ-లార్డ్స్
సమవుజ్జీల నడుమ హోరాహోరీ పోరాటం ఆశించిన క్రికెట్ అభిమానులకు, పండితులకు ది ఓవల్ మైదానంలో పేస్ దళపతి జశ్‌ప్రీత్ బుమ్రా నిరాశ మిగిల్చాడు!. అసమాన ప్రదర్శనతో నిప్పులు చెరిగిన బుమ్రా ఇంగ్లాండ్ బ్యాటింగ్ లైనప్ అంతు తేల్చాడు. బుమ్రా దెబ్బకు ఇంగ్లాండ్ తొలి వన్డేలో కుదేలైంది. టీ20 సిరీస్‌ను కోల్పోయిన ఇంగ్లాండ్.. వన్డే సిరీస్‌లోనైనా ఆశలు నిలుపుకోవాలంటే నేటి మ్యాచ్‌లో తప్పక విజయం సాధించాలి. సమిష్టి ప్రదర్శనతో లార్డ్స్‌లోనే లాంఛనం ముగించాలని టీమ్ ఇండియా భావిస్తోంది. ఇదే జోరులో ఇక్కడా గెలుపొంది వన్డే సిరీస్‌ను సొంతం చేసుకోవాలనే పట్టుదలతో కనిపిస్తోంది. సిరీస్ కోసం భారత్, సిరీస్‌పై ఆశల కోసం ఇంగ్లాండ్ నేడు అమీతుమీకి సిద్ధమయ్యాయి.
విరాట్ ఆడేనా?! : చివరి టీ20లో గాయపడిన విరాట్ కోహ్లి తొలి వన్డేకు దూరంగా ఉన్నాడు. తేలికపాటి గాయంతో విరాట్ కోహ్లి తుది జట్టు ఎంపికకు దూరమయ్యాడని జట్టు మేనేజ్మెంట్ తెలిపింది. నేడు రెండో వన్డేకు కోహ్లి ఫిట్నెస్ సాధించాడా? లేదా అనేది తెలియాలి. విరాట్ కోహ్లి ఫిట్నెస్ సాధిస్తే శ్రేయస్ అయ్యర్ బెంచ్‌కు పరిమితం కావాల్సి ఉంటుంది. బౌలర్ల విజృంభణతో తొలి వన్డేలో బ్యాటింగ్ లైనప్‌కు పరీక్ష ఎదురుకాలేదు. రిస్క్ తీసుకోవాల్సిన అవసరం రాలేదు. ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్‌లు స్వల్ప లక్ష్యాన్ని అలవోకగా ఛేదించారు. నేడు బ్యాటింగ్ లైనప్‌కు కఠిన సవాల్ ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. మిడిల్ ఆర్డర్లో విరాట్, పంత్, సూర్యకుమార్ యాదవ్‌లపై ఫోకస్ కనిపిస్తోంది. రానున్న వన్డే వరల్డ్‌కప్ నేపథ్యంలో మిడిల్ ఆర్డర్లో ఈ ముగ్గురు మెరిస్తే భారత్‌కు దిగులు ఉండదు. ఆల్‌రౌండర్లు హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజాలకు లార్డ్స్‌లో మంచి ఇన్నింగ్స్‌లు ఆడిన రికార్డు ఉంది. జశ్‌ప్రీత్ బుమ్రా సారథ్యంలో షమి, ప్రసిద్ కృష్ణలు పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు. జడేజాతో కలిసి యుజ్వెంద్ర చాహల్ స్పిన్ మాయ చూసుకోనున్నాడు.
పుంజుకోగలరా?! : జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్.. వన్డే సిరీస్‌లో ఈ పేర్లు చూడగానే ఇంగ్లాండ్ భారీ స్కోర్లపై కన్నేయటం ఖాయం అనిపించింది. తొలి వన్డేలో అందుకు పూర్తి భిన్నమైన పరిస్థితిని చూశాం. కెప్టెన్ జోశ్ బట్లర్ సైతం భారత బౌలర్లకు ఎదురు నిలిచే సాహాసం చేయలేకపోయాడు. సిరీస్ చేజార్చుకునే ప్రమాదం ముంగిట ఇంగ్లాండ్ భీకర టాప్-5 బ్యాటర్లు రారు, బెయిర్‌స్టో, రూట్, స్టోక్స్, బట్లర్ నేడు ఏం చేస్తారనేది ఆసక్తికరం. ధనాధన్ ఇన్నింగ్స్‌లకు పెట్టింది పేరైన ఈ బ్యాటింగ్ లైనప్ నేడు బుమ్రా, షమి ద్వయాన్ని ఎదుర్కొవటంపై ఇంగ్లాండ్ సిరీస్ ఆశలు ఆధారపడి ఉంటాయి. పిచ్ నుంచి లభించిన స్వింగ్, సీమ్‌ను గొప్పగా సద్వినియోగం చేసుకున్న బుమ్రాను నేడు లార్డ్స్‌లో ఇంగ్లాండ్ ఎలా నిలువరిస్తుందో ఆసక్తికరం. స్పిన్నర్ మోయిన్ అలీ అంచనాలను అందుకోలేదు. పేస్ విభాగంలో మాట్ పార్కిన్సన్‌ను తుది జట్టులోకి తీసుకునే అవకాశం కనిపిస్తోంది.
పిచ్, వాతావరణం : లార్డ్స్ మైదానం ఎల్లప్పుడూ స్వింగ్ బౌలర్లకు స్వర్గధామం. నేడు వన్డే పోరుకు పిచ్ అతీతం కాదు. 2019 వరల్డ్‌కప్ ఫైనల్స్ తర్వాత ఇక్కడ ఒక్క వన్డే జరిగింది. ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ గెలుపొందింది. నేడు వాతావరణం ఆహ్లాదకరంగా ఉండనుంది. ఎటువంటి వర్ష సూచనలు లేవు. టాస్ నెగ్గిన జట్టు తొలుత ఫీల్డింగ్ ఎంచుకునేందుకు మొగ్గుచూపవచ్చు.
తుది జట్లు (అంచనా) :
భారత్ : రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధావన్, శ్రేయస్ అయ్యర్/విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, మహ్మద్ షమి, జశ్‌ప్రీత్ బుమ్రా, ప్రసిద్ కృష్ణ, యుజ్వెంద్ర చాహల్.
ఇంగ్లాండ్ : జేసన్ రారు, జానీ బెయిర్‌స్టో, జో రూట్, బెన్ స్టోక్స్, జోశ్ బట్లర్ (కెప్టెన్, వికెట్‌కీపర్), లియాం లివింగ్‌స్టోన్, మోయిన్ అలీ, శామ్ కరణ్, డెవిడ్ విల్లే, బ్రేడన్ కార్సె, మాట్ పార్కిన్సన్.