Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్వార్టర్స్‌లో పోరాడి ఓడిన సైనా
- సింగపూర్ ఓపెన్ 500
సింగపూర్ : భారత స్టార్ షట్లర్, రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత పి.వి సింధు సింగపూర్ ఓపెన్ సెమీఫైనల్లోకి ప్రవేశించింది. మహిళల సింగిల్స్ క్వార్టర్ఫైనల్లో మెరుపు విజయం నమోదు చేసిన తెలుగు తేజం.. సింగపూర్ ఓపెన్ టైటిల్ దిశగా మరో అడుగు ముందుకేసింది. శుక్రవారం జరిగిన క్వార్టర్ఫైనల్లో చైనా షట్లర్ హాన్ యువెపై మూడు గేముల్లో గెలుపొందిన సింధు.. వరుస పరాజయాల అనంతరం సత్తా చాటింది. 17-21, 21-11, 21-19తో గంటకుపైగా సాగిన పోరులో గెలుపొందింది. చైనా షట్లర్‌కు తొలి గేమ్‌ను కోల్పోయిన సింధు.. చావోరేవో తేల్చుకోవాల్సిన తరుణంలో వరుసగా చివరి రెండు గేముల్లో దుమ్మురేపింది. రెండో గేమ్‌ను ఏకపక్షంగా నెగ్గిన సింధు మూడో గేమ్‌లో ఒత్తిడిని జయించి సెమీస్ బెర్త్ సొంతం చేసుకుంది. వెటరన్ షట్లర్, లండన్ ఒలింపిక్స్ మెడలిస్ట్ సైనా నెహ్వాల్ సుదీర్ఘ విరామం అనంతరం మెరిసినా.. సెమీఫైనల్ బెర్త్‌ను దక్కించుకోలేదు. ప్రీ క్వార్టర్స్‌లో చైనా స్టార్ హీ బింగ్జియావ్పై గెలుపొందిన సైనా.. క్వార్టర్స్‌లో అయా ఒహౌరి (జపాన్)ను జయించలేకపోయింది. 13-21, 21-15, 20-22తో చివరి వరకు పోరాడి ఓడింది. తొలి గేమ్‌లో నిరాశపరిచిన సైనా, రెండో గేమ్‌లో సూపర్‌గా పుంజుకుంది. మ్యాచ్‌ను నిర్ణయాత్మక మూడో గేమ్‌కు తీసుకెళ్లింది. టైబ్రేకర్‌కు దారితీసిన మూడో గేమ్‌లో సైనా వరుస పాయింట్లు కోల్పోయి సెమీస్ బెర్త్‌ను చేజార్చుకుంది. నేడు జరిగే సెమీఫైనల్లో జపాన్ అమ్మాయి సీయెనా కవాకమితో సింధు తలపడనుంది. వరల్డ్ నం.38 కవాకమితో ముఖాముఖి పోరులో సింధు 2-0తో తిరుగులేని ఆధిపత్యంలో ఉంది. నేడు సెమీఫైనల్లో సింధు ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది.
పురుషుల సింగిల్స్‌లో అగ్ర షట్లర్ హెచ్.ఎస్ ప్రణరుకి మరోసారి నిరాశ ఎదురైంది. వరుస టోర్నీల్లో సెమీఫైనల్స్‌కు చేరుకుని సింగపూర్‌కు వచ్చిన ప్రణరు.. ఇక్కడ క్వార్టర్స్‌లోనే టైటిల్ వేటను చాలించాడు. జపాన్ ఆటగాడు కొడారు నరోకతో మూడు గేముల్లో ప్రణరు పోరాడి ఓడాడు. 21-12, 14-21, 18-21తో 63 నిమిషాల క్వార్టర్స్‌లో ప్రణరు వెనుకంజ వేశాడు. ప్రణరు నిష్క్రమణతో మెన్స్ సింగిల్స్ సర్క్యూట్లో భారత టైటిల్ ఆశలకు తెరపడింది. పురుషుల డబుల్స్ విభాగంలో ఎంఆర్ అర్జున్, ధ్రువ్ కపిల జోడీ నిష్క్రమించింది. ఇండోనేషియా జోడీ, రెండో సీడ్ మహ్మద్ ఆషాన్, హెండ్రా సెటివాన్ చేతిలో 21-10, 18-21, 17-21తో ఓటమి చెందారు. రెండో సీడ్ జోడీపై తొలి గేమ్‌లో గెలుపొందిన అర్జున్, ధ్రువ్ జోడీ.. తర్వాతి గేముల్లో ఒత్తిడికి తలొగ్గారు. సెమీఫైనల్స్ బెర్త్‌ను ఇండోనేషియా జోడీకి కోల్పోయారు.