Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రేపు సిరీస్ నిర్ణయాత్మక పోరు
- భారత్, ఇంగ్లాండ్ ఇక అమీతుమీ
అటు టెస్టు క్రికెట్, ఇటు పొట్టి ఫార్మాట్ పోటాపోటీగా అభిమానుల ఆదరణ పొందేందుకు సై అంటుండగా.. వన్డే క్రికెట్ తన ప్రాధాన్యతతో పాటు ఉనికి సైతం ప్రశ్నార్థకం చేసుకుంది. 2019 వన్డే వరల్డ్‌కప్ అనంతరం 50 ఓవర్ల ఆటకు పెద్దగా ఆదరణ లేకుండా పోయింది. వరుస టీ20 ప్రపంచకప్‌లో అగ్రజట్లు పూర్తి ఫోకస్ పొట్టి ఫార్మాట్‌పైనే నిలిపాయి. ఈ పరిస్థితుల్లో వన్డే క్రికెట్‌కు ఓ ధ్రిల్లర్ ఎదురుచూస్తోంది.
నవతెలంగాణ క్రీడావిభాగం
భారత్, ఇంగ్లాండ్ మూడు మ్యాచుల వన్డే సిరీస్. ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ నేపథ్యంలో భారత్, ఇంగ్లాండ్ చివరి టెస్టు మ్యాచ్‌కు అధిక ప్రాధాన్యత లభించింది. అందుకు తగినట్టుగానే బర్మింగ్‌హామ్ టెస్టు సమరం ప్రపంచ క్రికెట్ అభిమానుల దృష్టిని ఆకర్షించింది. రికార్డు లక్ష్యాన్ని ఇంగ్లాండ్ అలవోకగా ఛేదించింది. అంతకముందు, న్యూజిలాండ్‌పై వరుసగా మూడు టెస్టుల్లోనూ ఇంగ్లాండ్ లక్ష్యాలను విజయవంతంగా ఛేదించింది. టెస్టు క్రికెట్ చరిత్రలోనే ఓ జట్టు వరుసగా నాలుగు టెస్టుల్లో లక్ష్యాలను ఛేదించటం అరుదైన విషయం. విజయవంతమైన వరుస ఛేదనలతో టెస్టు క్రికెట్‌కు విపరీత ఆదరణ దక్కింది. ఇక టీ20 క్రికెట్‌కు గ్లోబల్ లీగ్‌లు, ద్వైపాక్షిక సిరీస్‌లతో కావాల్సినంత క్రేజ్ దక్కుతోంది. అటు టెస్టు క్రికెట్, ఇటు టీ20 క్రికెట్ జోరందుకోవటంతో.. నడుమ వన్డే క్రికెట్ ప్రాధాన్యత కోల్పోయింది. 2019 వన్డే వరల్డ్‌కప్ అనంతరం కరోనా మహమ్మారితో ప్రపంచ క్రికెట్ స్తంభించింది. టెస్టు చాంపియన్‌షిప్, టీ20 ప్రపంచకప్‌లు, టీ20 లీగ్‌లతో ప్రపంచ క్రికెట్ క్యాలెండర్ నిండిపోయింది. ఈ బిజీ షెడ్యూల్లో వన్డే క్రికెట్ తన ప్రాధాన్యత కోల్పోయింది. భారత్, ఇంగ్లాండ్ వన్డే సిరీస్‌తో ఈ ఫార్మాట్ మళ్లీ కొత్త శోభ సంతరించుకుంటుంది!.
ఖతర్నాక్ పోరాటం : అన్ని జట్లు రానున్న టీ20 ప్రపంచకప్‌పై దృష్టి నిలపటంతో భారత్, ఇంగ్లాండ్ వన్డే సిరీస్‌పై పెద్దగా ఆసక్తి కనిపించలేదు. భారత్ సైతం ఇటీవల వన్డే ఫార్మాట్లో ఆడిన సిరీస్‌లు తక్కువ. కానీ, వన్డే క్రికెట్‌కు తిరిగి ఆదరణ దక్కేందుకు ఏం చేయాలో ఈ సిరీస్‌లో సరిగ్గా అదే జరిగింది. టెస్టు, టీ20 ఫార్మాట్లో ప్రస్తుతం బ్యాటర్ల రాజ్యం నడుస్తోంది. ఆధునిక క్రికెట్ ప్రభావం కాబోలు.. టెస్టు క్రికెట్లో పరుగుల వరద పారుతోంది. నాల్గో ఇన్నింగ్స్‌లోనూ 400 పరుగులు చేసేందుకు బ్యాటర్లు వెనుకాడటం లేదు. టెస్టు క్రికెట్లో ఇది సరికొత్త పరిణామం. వన్డే క్రికెట్ ప్రాధాన్యత సాధించేందుకు ఈ ఫార్మాట్లో బౌలర్లు మెరవటం అత్యంత కీలకం. బౌలర్లకు అనుకూలించే పిచ్‌లను తయారు చేయటం ప్రధానం. భారత్, ఇంగ్లాండ్ తొలి రెండు వన్డేల్లో అదే చోటు చేసుకుంది. భారత పేస్ దళపతి జశ్‌ప్రీత్ బుమ్రా ఆరు వికెట్ల ప్రదర్శనతో తొలి వన్డేలో భారత్ అలవోక విజయం సాధించింది. ఇంగ్లాండ్ పేసర్ రీస్ టాప్లీ ఆరు వికెట్ల విన్యాసంతో ఇంగ్లాండ్ రెండో వన్డేలో ప్రతీకారం విజయం నమోదు చేసింది. ఈ రెండు వన్డేల్లోనూ బౌలర్లు అద్భుత ప్రదర్శన కనబరిచారు. 350 పైచిలుకు స్కోర్లు నమోదు కానున్న సిరీస్‌గా భారీ అంచనాలు కనిపించాయి. అందుకు పూర్తి భిన్నంగా వన్డే సిరీస్ బౌలర్ల కనుసన్నల్లో సాగుతోంది. బౌలర్లు చెలరేగుతున్న సిరీస్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. సిరీస్ నిర్ణయాత్మక సమరంపై అందరి దృష్టి పడేందుకు అదో కారణం.
థ్రిల్లర్ సిద్ధమవుతోంది : నిరుడు భారత్, ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ మాంచెస్టర్‌లో ముగియాల్సింది. అనివార్య కారణాలతో ఆ టెస్టు జరుగలేదు. ఈ ఏడాది ఆ టెస్టును ఎడ్జ్‌బాస్టన్‌కు కేటాయించారు.
ఈ ఏడాది భారత జట్టు ఇంగ్లాండ్ పర్యటన మాంచెస్టర్‌లో ముగిసేలా ఈసీబీ షెడ్యూల్ రూపొందింది. నిర్ణయాత్మక వన్డే పోరు ఆదివారం మాంచెస్టర్లోనే జరుగనుంది. టీ20 సిరీస్‌ను భారత్ 2-0తో ముందే గెల్చుకోవటంతో చివరి మ్యాచ్‌పై ఆసక్తి సన్నగిల్లింది. కానీ వన్డే సిరీస్‌కు పర్ఫెక్ట్ ముగింపు దక్కనుంది. తొలి వన్డేలో భారత్, రెండో వన్డేలో ఇంగ్లాండ్ గెలుపొందగా సిరీస్ 1-1తో సమమైంది. ఇరు జట్లకు బౌలర్లతోనే ఘన విజయాలు లభించాయి. దీంతో నిర్ణయాత్మక పోరుపై ఆసక్తి నెలకొంది. భారత్ బ్యాటింగ్‌ను మెరుగుపర్చుకుని సిరీస్‌ను సొంతం చేసుకోవాలని చూస్తుండగా.. ఆ అవకాశం ప్రత్యర్థికి ఇవ్వకుండా సిరీస్ దక్కించుకునేందుకు ఇంగ్లాండ్ సిద్ధమవుతోంది. అటు భారత్, ఇటు ఇంగ్లాండ్ పేస్ దళాలు చివరి సమరానికి స్వింగ్, సీమ్‌తో విరుచుకుపడేందుకు రంగం సిద్ధం చేసుకున్నాయి. ఇక మాంచెస్టర్‌లో భారత్, ఇంగ్లాండ్ థ్రిల్లర్ అభిమానులకు విందు భోజనమే!.