Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోహ్లి ఫామ్‌పై రోహిత్ శర్మ
లండన్ : 'అసలు ఎందుకు ఈ చర్చ నడుస్తోంది. నాకు ఏం అర్థం కావటం లేదు. విరాట్ కోహ్లి భారత్‌కు ఎన్నో విజయాలు సాధించాడు. ఆ స్థాయి ఆటగాడు ఫామ్‌లోకి వచ్చేందుకు ఒకటి, రెండు ఇన్నింగ్స్‌లు చాలు'.. ఇంగ్లాండ్‌తో రెండో వన్డే అనంతరం భారత కెప్టెన్ రోహిత్ శర్మ వ్యాఖ్యలు ఇవి. భారత మాజీ కెప్టెన్, సూపర్‌స్టార్ విరాట్ కోహ్లి గత కొంతకాలంగా పేలవ ఫామ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఇంగ్లాండ్‌తో చివరి టెస్టు, రెండు టీ20లు సహా రెండో వన్డేలో విరాట్ కోహ్లి విఫలమయ్యా డు. దీంతో తుది జట్టులో విరాట్ కోహ్లి స్థానంపై విమర్శకులు వేలెత్తి చూపుతున్నారు. ' వరల్డ్ నం.2 టెస్టు బౌలర్ అశ్విన్‌ను టెస్టు జట్టు నుంచి తప్పించినప్పుడు.. మాజీ వరల్డ్ నం.1 బ్యాటర్‌ను టీ20 జట్టు నుంచి ఎందుకు తప్పించకూడదు?' అని భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ పేర్కొన్న సంగతి తెలిసిందే. మూడో టీ20లో సూర్యకుమార్ యాదవ్ శతకం సాధించినా, భారత్ పరాజయం పాలైంది. ఆ మ్యాచ్‌లో విరాట్ కోహ్లి తేలిపోయాడు. అతడి స్థానంలో ఫామ్‌లో ఉన్న దీపక్ హుడాను ఆడించివుంటే ఫలితం వేరేలా ఉండేదని విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో మాజీ క్రికెటర్లు సైతం విరాట్ కోహ్లి స్థానాన్ని ప్రశ్నించటం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో కెప్టెన్ రోహిత్ శర్మ విమర్శకులపై మండిపడ్డాడు.
'విరాట్ కోహ్లి ఎన్నో మ్యాచులు ఆడాడు. ఎన్నో ఏండ్లుగా అంతర్జాతీయ క్రికెట్లో ఆడుతున్నాడు. అతడు గొప్ప బ్యాటర్. అతడికి మళ్లీ ప్రత్యేకంగా భరోసా అక్కర్లేదు. క్రికెటర్ కెరీర్లో ఫామ్ ఎత్తు పల్లాలు చూస్తుంది. అది కెరీర్లో భాగం. ఎన్నో మ్యాచులు ఆడి, విజయాలు అందించి, పరుగుల వరద పారించిన బ్యాటర్‌కు ఒకట్రెండు ఇన్నింగ్స్‌లు చాలు, పుంజుకోగలడు. ఇది నా ఆలోచన, సహచర క్రికెటర్లు సైతం ఇదే విధంగా ఆలోచిస్తున్నారని అనుకుంటున్నాను. ఇక క్రికెట్ పండితులు అంటూ విశ్లేషణలు.. అసలు ఎవరీ విశ్లేషకులు. వాళ్లకు అసలు ఏం తెలుసు? జట్టులో ఏం జరుగుతుందనే సంగతి వారికి తెలియదు. జట్టు ప్రణాళికలు, జట్టు చర్చల గురించి వారికి తెలియదు. జట్టు అంతర్గత చర్చల్లో ఏం జరుగుతుందో తెలియని వారు చేసే వ్యాఖ్యలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. విరాట్ కోహ్లి సైతం మానవమాత్రుడే. అతడూ కొన్ని మ్యాచుల్లో తక్కువ స్కోర్లు చేస్తాడు. విరాట్ కోహ్లి ప్రస్తుతం వన్డే క్రికెట్లో అత్యుత్తమ బ్యాటర్ కాకపోయినా.. అత్యుత్తమ బ్యాటర్లలో ఒకడనే విషయం మర్చిపోకూడదు' అని రోహిత్ శర్మ ఘాటూగా వ్యాఖ్యానించాడు. ఇంగ్లాండ్ పర్యటనలో విరాట్ కోహ్లికి మద్దతుగా నిలువటం రోహిత్ శర్మకు ఇది రెండోసారి కావటం గమనార్హం.