Authorization
Mon Jan 19, 2015 06:51 pm
టీమ్ ఇండియా చరిత్ర ముంగిట నిలిచింది. 1986 తర్వాత తొలిసారి ఇంగ్లాండ్ గడ్డపై సిరీస్ ఓటమి లేకుండా పర్యటనను ముగించిన రికార్డు రోహిత్‌సేన ముందుంది. టెస్టు సిరీస్‌ను డ్రా చేసుకున్న భారత్.. టీ20 సిరీస్‌ను సొంతం చేసుకుంది. నేడు నిర్ణయాత్మక పోరులో విజయం సాధిస్తే వన్డే సిరీస్ సైతం భారత్ వశం కానుంది. చివరి వన్డేలో విజయమే లక్ష్యంగా నేడు టీమ్ ఇండియా మాంచెస్టర్ పోరుకు సిద్ధమవుతోంది. ఇంగ్లాండ్‌తో భారత్ మూడో వన్డే నేడు.
- సిరీస్ నిర్ణయాత్మక పోరు నేడు
- భారత్, ఇంగ్లాండ్‌లకు బ్యాటింగే సమస్య
- మధ్యాహ్నాం 3.30 నుంచి సోనీలో ప్రసారం..
నవతెలంగాణ-మాంచెస్టర్ :
పేసర్లు ప్రతాపం చూపుతున్న సిరీస్‌లో.. నిర్ణయాత్మక మ్యాచ్‌లో విజయం కోసం ఇటు భారత్, అటు ఇంగ్లాండ్ బ్యాటర్లపై ఆధారపడుతున్నాయి. బుమ్రా, షమి విజృంభణతో తొలి వన్డేలో ఇంగ్లాండ్ 110 పరుగులే చేయగా.. టాప్లీ చెలరేగటంతో రెండో వన్డేలో భారత్ 146 పరుగులకే చేతులెత్తేసింది. ఇరు జట్ల బౌలింగ్ విభాగాలు జోరు మీదుండగా.. ఇరు జట్లకూ బ్యాటింగ్ లైనప్‌లు సమస్యగా మారాయి. టీ20 సిరీస్‌ను కోల్పోయిన ఇంగ్లాండ్ ఎలాగైనా వన్డే సిరీస్‌ను సొంతం చేసుకోవాలని చూస్తోంది. మరోవైపు అజేయంగా ఇంగ్లాండ్ పర్యటనను ముగించేందుకు టీమ్ ఇండియా సమాయత్తం అవుతోంది. దీంతో నేడు నిర్ణయాత్మక వన్డే పోరు రసవత్తరంగా సాగనుంది!.
ఆ ఇద్దరిపైనే ఫోకస్ : పరుగుల వరద పారించినా, పరుగుల వేటలో వెనుకంజ వేసినా.. విరాట్ కోహ్లి నిత్యం చర్చనీయాంశమే. ప్రస్తుతం అతడు వైఫల్యాల కారణంగా విమర్శలు ఎదుర్కొంటున్నాడు. జట్టు మేనేజ్మెంట్ కోహ్లికి దన్నుగా నిలుస్తోంది. అయినా, మెగా ఇన్నింగ్స్‌లు లేకుండా ఎంతోకాలం కోహ్లి ముందుకు సాగలేదు. విండీస్ పర్యటనకు విశ్రాంతి నేపథ్యంలో కోహ్లి ఇక్కడే విజృంభించాల్సి ఉంది. సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ సైతం బ్యాట్‌తో సమాధానం ఇవ్వాల్సి ఉంది. తొలి రెండు వన్డేల్లో ధావన్ పేలవంగా రాణించాడు. క్రీజులో ఏమాత్రం సౌకర్యవంతంగా కనిపించలేదు. విండీస్‌తో వన్డేలకు కెప్టెన్‌గా ఎంపికైన ధావన్ మాంచెస్టర్‌లో మంచి ఇన్నింగ్స్ ఆడితేనే.. 2023 వరల్డ్‌కప్‌కు వన్డే జట్టు ప్రణాళికల్లో ఉండగలడు. వన్డే ఫార్మాట్లో వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ చెప్పుకోదగిన ఇన్నింగ్స్ ఆడలేదు. రెడ్‌బాల్‌తో జోరందుకున్న పంత్.. మాంచెస్టర్‌లో నిర్ణయాత్మక పోరులో బ్యాట్‌తో ధనాధన్ ప్రదర్శన చేస్తాడేమో చూడాలి. బ్యాటింగ్ లైనప్‌ను బలోపేతం చేసేందుకు శార్దుల్ ఠాకూర్‌ను తుది జట్టులోకి తీసుకునే వీలుంది. ప్రసిద్ కృష్ణ బెంచ్‌కు పరిమితం కాకతప్పదు. బుమ్రా, షమి, చాహల్ మరోసారి వికెట్ల వేటలో ముందుండి నడిపించనున్నారు.
టాప్ కష్టాలు! : నవ ఇంగ్లాండ్ నిర్మాత ఇయాన్ మోర్గాన్ కెప్టెన్సీకి, క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అనంతరం ఇంగ్లాండ్ స్వదేశంలో రెండు వైట్‌బాల్ సిరీస్‌లు కోల్పోవటం పెద్ద చర్చనీయాంశం అవుతుంది. ఇప్పటికే ఓ సిరీస్‌ను కోల్పోయిన ఇంగ్లాండ్.. వరుసగా మరో సిరీస్‌ను చేజార్చుకునే పరిస్థితిలో కనిపించటం లేదు. మోర్గాన్ అండగా టాప్ ఆర్డర్లో విధ్వంసక ఇన్నింగ్స్‌లు నమోదు చేసిన జేసన్ రారు తాజాగా తడబడుతున్నాడు. చివరి ఐదు వైట్‌బాల్ ఇన్నింగ్స్‌ల్లో 4, 0, 27, 0, 23 పరుగులతో నిరాశపరిచాడు. బెంచ్‌పై ప్రతిభావంతులైన బ్యాటర్లు అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ పరిస్థితుల్లో రారు ఎంతోకాలం గత వైభవం ఘనతతో తుది జట్టులో ఉండలేడు. భారత్‌తో చివరి వన్డేలో అతడు మంచి ప్రదర్శన బాకీ పడ్డాడు. కెప్టెన్ జోశ్ బట్లర్, జో రూట్, జానీ బెయిర్‌స్టో నుంచి ఇంగ్లాండ్ తగిన ప్రదర్శన ఆశిస్తోంది. హ్యారీ బ్రూక్, ఫిల్ సాల్ట్, మాట్ పార్కిన్సన్‌లు జట్టుతో చేరినా.. ఇంగ్లాండ్ తుది జట్టులో మార్పులు చేసే అవకాశం కనిపించటం లేదు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఎటువంటి మార్పులు లేకుండానే ఇంగ్లాండ్ బరిలోకి దిగనుంది.
పిచ్, వాతావరణం : ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానం పరుగుల ప్రవాహానికి ప్రసిద్ధి!. ఇక్కడ జరిగిన చివరి తొమ్మిది వన్డేల్లో ఏకంగా ఆరు సార్లు తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు 290 పైచిలుకు పరుగులు చేసింది. ఉష్ణోగ్రత నేడు కాస్త ఎక్కువగా ఉండనుంది. భారత్‌కు అదేమీ పెద్ద సమస్య కాబోదు. చివరి 9 మ్యాచుల్లో 8 సార్లు తొలుత బ్యాటింగ్ చేసిన జట్టును విజయం వరించింది. టాస్ నెగ్గిన జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం ఎక్కువగా ఉంది.
తుది జట్లు (అంచనా) :
భారత్ : రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, శార్దుల్ ఠాకూర్, మహ్మద్ షమి, జశ్‌ప్రీత్ బుమ్రా, యుజ్వెంద్ర చాహల్.
ఇంగ్లాండ్ : జేసన్ రారు, జానీ బెయిర్‌స్టో, జో రూట్, బెన్ స్టోక్స్, జోశ్ బట్లర్ (కెప్టెన్, వికెట్ కీపర్), లియాం లివింగ్‌స్టోన్, మోయిన్ అలీ, డెవిడ్ విల్లే, క్రెయిగ్ ఓవర్టన్, బ్రేడన్ కార్సె, రీసీ టాప్లీ.