Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శ్రీలంక సంక్షోభ పరిస్థితులే కారణం
దుబాయ్ : ఆసియా కప్ శ్రీలంకలో జరిగే అవకాశాలు సన్నగిల్లుతున్నాయి. తీవ్ర ఆర్థిక, రాజకీయ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంక రానున్న రెండు వారాల్లో ఆరంభం కావాల్సిన లంక ప్రీమియర్ లీగ్ (ఎల్పీఎల్)ను నిరవధికంగా వాయిదా వేసింది. ఆసియా కప్ నిర్వహణకు శ్రీలంకలో తగిన పరిస్థితులు లేవని ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) భావిస్తోంది. దీంతో వేదికను శ్రీలంక నుంచి యుఏఈకి మార్పు చేసేందుకు ఏసీసీ సిద్ధమవుతోంది. ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 11 వరకు జరిగే ఆసియా కప్ (టీ20 ఫార్మాట్) ఆతిథ్య హక్కులు శ్రీలంక క్రికెట్ బోర్డు దగ్గరే ఉంటాయి. కానీ ఆతిథ్య నగరాలుగా యుఏఈలోని స్టేడియాలు ఉండనున్నాయి. భారత మహిళల జట్టు పర్యటన, ఆస్ట్రేలియా మెన్స్ జట్టు పర్యటన విజయవంతం కావటంతో ఆసియా కప్‌ను సైతం లంకలోనే నిర్వహిస్తామని ఆ దేశ క్రికెట్ బోర్డు దీమా వ్యక్తం చేసింది. కానీ ఆహార ధాన్యాలు, వాహన ఇంధనం, కరెంట్ సరఫరాలో కొరతకు తోడు వీధుల్లో నిత్యం నిరసన ప్రదర్శనలతో శ్రీలంక సతమతం అవుతోంది. రెండు జట్లకు ఆతిథ్యం ఇవ్వటం, పది జట్లకు ఏకకాలంలో ఆతిథ్యం ఇవ్వటం ఒక్కటి కాదని శ్రీలంక బోర్డుకు సైతం తెలుసు. ఆసియా కప్ ఆతిథ్య వేదికగా యుఏఈని త్వరలోనే ఏసీసీ, శ్రీలంక క్రికెట్ బోర్డు కలిసి ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.