Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సింగపూర్ ఓపెన్ టైటిల్ వశం
- ఫైనల్లో చైనా షట్లర్‌పై విజయం
- సింగపూర్ ఓపెన్ 500
నవతెలంగాణ-సింగపూర్
భారత బ్యాడ్మింటన్ సూపర్‌స్టార్ పి.వి సింధు ఎట్టకేలకు గర్జించింది. ఆసియా చాంపియన్ వాంగ్ జి యి (చైనా)పై వరల్డ్ చాంపియన్ పి.వి సింధు (భారత్) అద్భుత విజయం సాధించింది. వరుస పరాజయాల అనంతరం బిడబ్ల్యూఎఫ్ 500 టోర్నీలో విజేతగా అవతరించింది. ఈ ఏడాది సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ టోర్నీ, స్విస్ ఓపెన్ విజేతగా నిలిచిన సింధు.. ఈ ఏడాది తొలి బిడబ్ల్యూఎఫ్ 500 విజయం సొంతం చేసుకుంది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో చైనా యువ షట్లర్‌ను చిత్తు చేసిన సింధు సింగపూర్ ఓపెన్ చాంపియన్‌గా నిలిచింది. మూడు గేముల పాటు ఉత్కంఠగా సాగిన ఫైనల్లో సింధు 2-1తో అద్భుత విజయం నమోదు చేసింది. గంటపాటు సాగిన టైటిల్ పోరులో 21-9, 11-21, 21-15తో సింధు విజయం సాధించింది. సింగపూర్ ఓపెన్ విజేతగా సింధు నిలువటంతో భారత ప్రధాని నరెంద్రమోడీ, భారత క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్లు ట్విట్టర్ వేదికగా తెలుగు తేజానికి అభినందించారు.
అలవోకగా.. : మహిళల సింగిల్స్ టైటిల్ పోరు మూడు గేముల్లో ముగిసినా.. భారత అగ్ర షట్లర్ సింధు అలవోకగానే విజయం సాధించింది. ఫైనల్లో గాలి వీచే దిశ ప్రభావం చూపించింది. సింధు రెండు గేముల్లో అనుకూలంగా ఉన్న కోర్టు వైపు నిలువటం ఆమెకు కలిసొచ్చింది. తొలి గేమ్‌ను సింధు 21-9తో సులువుగా గెల్చుకుంది. తొలి గేమ్‌లో 0-2తో వెనుకంజలో నిలిచిన సింధు వరుసగా 11 పాయింట్లు కొల్లగొట్టింది. గాలి వీచే దిశను సద్వినియోగం చేసుకుని తన రేంజ్ షాట్లు స్వేచ్ఛగా ఆడింది. విరామం అనంతరం సైతం సింధు జోరు తగ్గలేదు. రెండో గేమ్‌లో వాంగ్ జి యి సైతం అదే రీతిలో రెచ్చిపోయింది. 6-0తో భారీ ఆధిక్యంలో నిలిచిన వాంగ్ జి యి.. విరామ సమయానికి 11-4తో ముందంజలో నిలిచింది. నిర్ణయాత్మక మూడో గేమ్‌లో సింధు మరోసారి మెరుగైన కోర్టులో నిలిచింది. కానీ ఈ గేమ్‌లో వాంగ్ జి యి పట్టు విడువలేదు. చివరి వరకు సింధుతో పోరాడింది. 5-5 అనంతరం సింధు 11-6తో విరామ సమయానికి ఆధిక్యం సాధించింది. కానీ వరుస పాయింట్లతో 11-12తో సింధును వెంబడించిన వాంగ్ జి యి స్కోరు సమం చేయటంలో విఫలమైంది. ఆధిక్యం నిలుపుకున్న సింధు 21-15తో మూడో గేమ్‌తో పాటు సీజన్లో తొలి బిడబ్ల్యూఎఫ్ 500 టోర్నీ టైటిల్‌ను సొంతం చేసుకుంది. గతంలో ఆల్ ఇంగ్లాండ్ చాంపియన్‌షిప్స్‌లో వాంగ్ జి యిని ఓడించిన సింధు.. మళ్లీ సింగపూర్ ఓపెన్ ఫైనల్లో ఆసియా చాంపియన్‌ను చిత్తు చేసింది.
సంతోషంగా ఉంది : బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ క్రీడల్లో భారత బ్యాడ్మింటన్ బృందానికి సారథి పి.వి. సింధు. మెన్స్ జట్టు ఇటీవల థామస్ కప్ విజయంతో సరికొత్త చరిత్ర సృష్టించగా.. మహిళల సింగిల్స్ సర్క్యూట్లో పెద్దగా విజయాలు రాలేదు. ప్రతిష్టాత్మక కామన్వెల్త్ క్రీడల ముంగిట, సింధు సింగపూర్ ఓపెన్ విజేతగా నిలువటం ఆమె ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. సింగపూర్ నుంచి స్వదేశానికి రాగానే ఓ రోజు విశ్రాంతి తీసుకోనున్న సింధు, వెంటనే కామన్వెల్త్ క్రీడల శిక్షణ శిబిరానికి హాజరు కానుంది. ' సింగపూర్ ఓపెన్ విజేతగా నిలువటం సంతోషంగా ఉంది. కామన్వెల్త్ క్రీడల ముంగిట ఈ విజయం కొత్త ఉత్సాహం ఇస్తుంది. వాంగ్ జి యితో పాయింట్ల వ్యత్యాసం స్వల్పంగా ఉండటంతో ప్రతి పాయింట్‌ను కీలకంగా తీసుకున్నాను. ఫైనల్లో నా ప్రదర్శన పట్ల సంతృప్తిగా ఉన్నాను' అని విజయానంతరం పి.వి సింధు వ్యాఖ్యానించింది.