Authorization
Mon Jan 19, 2015 06:51 pm
టీమ్ ఇండియా చిచ్చరపిడుగు రిషబ్ పంత్ (125 నాటౌట్) అజేయ శతకంతో చెలరేగాడు. హార్దిక్ పాండ్య (71) తోడుగా ఛేదనలో అదరగొట్టిన రిషబ్ పంత్ భారత్‌కు 5 వికెట్ల తేడాతో మెరుపు విజయాన్ని కట్టబెట్టాడు. ఐదో వికెట్‌కు 133 పరుగులు జోడించిన పంత్, పాండ్య ఇంగ్లాండ్ గడ్డపై అజేయ సిరీస్ విజయం సాధించేలా చేశారు. 2-1తో వన్డే సిరీస్ భారత్ వశమవగా.. టీ20 సిరీస్ సైతం రోహిత్ సేన పడింది. 1986 తర్వాత భారత్ తొలిసారి ఇంగ్లాండ్ పర్యటనను సిరీస్ ఓటమి చవిచూడకుండా ముగించింది.
- ఛేదనలో చెలరేగిన చిచ్చరపిడుగు
- హార్దిక్ పాండ్య ఆల్‌రౌండ్ ప్రదర్శన
- మూడో వన్డేలో భారత్ ఘన విజయం
- 2-1తో వన్డే సిరీస్ కైవసం
నవతెలంగాణ-మాంచెస్టర్
రిషబ్ పంత్ (125 నాటౌట్, 113 బంతుల్లో 16 ఫోర్లు, 2 సిక్స్‌లు) అజేయ శతకంతో చెలరేగాడు. హార్దిక్ పాండ్య (71, 55 బంతుల్లో 10 ఫోర్లు) ధనాధన్ అర్థ సెంచరీతో కదం తొక్కాడు. 260 పరుగుల ఛేదనలో 72/4తో భారత్ కష్టాల్లో కూరుకున్న వేళ రిషబ్ పంత్, హార్దిక్ పాండ్య జోడీ ఐదో వికెట్‌కు 133 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. రిషబ్ పంత్ కెరీర్ తొలి వన్డే శతకం, హార్దిక్ పాండ్య ఆల్‌రౌండ్ ప్రదర్శనతో మూడో వన్డేలో భారత్ ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 42.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఊదేసింది. అంతకముందు, తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జోశ్ బట్లర్ (60, 80 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) బాధ్యతాయుత అర్థ సెంచరీతో మెరుగైన స్కోరు సాధించింది. హార్దిక్ పాండ్య (4/24) నిప్పులు చెరిగాడు. ఛేదనలో శతక వీరుడు రిషబ్ పంత్ 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలువగా.. 100 పరుగులు, ఆరు వికెట్లతో ఎక్స్ ఫ్యాక్టర్‌గా నిలిచిన హార్దిక్ పాండ్య 'మ్యాన్ ఆఫ్ ది సిరీస్'గా నిలిచాడు. 2-1తో వన్డే సిరీస్ ట్రోఫీ భారత్ సొంతమైంది. ఇయాన్ మోర్గాన్ నిష్క్రమణ అనంతరం స్వదేశంలో ఇంగ్లాండ్‌కు ఇది వరుసగా రెండో వైట్‌బాల్ సిరీస్ పరాజయం కావటం గమనార్హం.
పంత్, పాండ్య ఫటాఫట్ : 260 పరుగుల ఛేదనలో భారత టాప్ ఆర్డర్ విఫలమైంది. కెప్టెన్ రోహిత్ శర్మ (17), ఓపెనర్ శిఖర్ ధావన్ (1), స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి (17) టాప్లీ స్వింగ్‌కు దాసోహం అయ్యారు. సూర్యకుమార్ యాదవ్ (16) సైతం విఫలమవటంతో భారత్ 72/4తో పీకల్లోతు కష్టాల్లో కూరుకుంది. ఈ సమయంలో రిషబ్ పంత్, హార్దిక్ పాండ్య జోడీ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. ఐదో వికెట్‌కు 133 పరుగులు జోడించిన ఈ జోడీ.. ఆరంభంలో నెమ్మదిగా ఆడింది. ముఖ్యంగా పంత్ క్రీజులో కుదురుకునేందుకు సమయం తీసుకున్నాడు. ఏడు ఫోర్లతో 43 బంతుల్లోనే హార్దిక్ అర్థ సెంచరీ సాధించగా.. రిషబ్ పంత్ ఐదు ఫోర్లతో 71 బంతుల్లో అర్థ సెంచరీ సాధించాడు. కానీ ఆ తర్వాత పంత్ ఇన్నింగ్స్‌కు ఊపుతీసుకొచ్చాడు. 106 బంతుల్లో శతకం సాధించిన పంత్.. చివర్లో ఓవర్టన్ ఓవర్లో వరుసగా ఐదు బౌండరీలు బాదాడు. జో రూట్‌పై రివర్స్ స్వీప్‌తో బౌండరీ బాది లాంఛనం ముగించాడు. అర్థ సెంచరీ అనంతరం హార్దిక్ పాండ్య నిష్క్రమించినా.. జడేజా (7 నాటౌట్) తోడుగా పంత్ వేగంగా ఆడాడు. 42.1 ఓవర్లలోనే ఛేదనను పూర్తి చేశాడు. రెండో వన్డేలో ఛేదనలో విఫలమైన భారత్.. మాంచెస్టర్‌లో టాస్ నెగ్గినా సవాల్‌గా ఛేదనను ఎంచుకుంది.
పాండ్య ప్రతాపం : కెప్టెన్ జోశ్ బట్లర్ (60) అర్థ సెంచరీకి తోడు జేసన్ రారు (41), మోయిన్ అలీ (34) రాణించటంతో ఇంగ్లాండ్ మెరుగైన స్కోరు సాధించింది. కొత్త బంతితో నిప్పులు కక్కిన సిరాజ్.. జానీ బెయిర్‌స్టో (0), జో రూట్ (0) ఒకే ఓవర్లో పెవిలియన్‌కు పంపించాడు. ఓపెనర్ జేసన్ రారు, బెన్ స్టోక్స్‌లు ఇన్నింగ్స్‌ను నిలబెట్టే ప్రయత్నం చేయగా.. హార్దిక్ పాండ్య ఈ ఇద్దరినీ సాగనంపాడు. దీంతో ఇంగ్లాండ్ 74 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. లియాం లివింగ్‌స్టోన్ (27), మోయిన్ అలీ తోడుగా బట్లర్ ఇన్నింగ్స్‌కు ముందుకు తీసుకెళ్లాడు. టెయిలెండర్లలో డెవిడ్ విల్లే (18), క్రెయిగ్ ఓవర్టన్ (32) రాణించటంతో ఇంగ్లాండ్ 259 పరుగులు చేసింది. నాలుగు వికెట్ల ప్రదర్శనతో పాండ్య ఇంగ్లాండ్‌ను కోలుకోలేని దెబ్బకొట్టగా.. స్పిన్నర్ చాహల్ (3/60), పేసర్ సిరాజ్ (2/66) రాణించారు.
ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ : రారు (సి)పంత్ (బి) హార్దిక్ 41, బెయిర్‌స్టో (సి) (సబ్) శ్రేయస్ (బి) సిరాజ్ 0, రూట్ (సి) రోహిత్ (బి) సిరాజ్ 0, స్టోక్స్ (సి,బి) హార్దిక్ 27, బట్లర్ (సి)జడేజా (బి) హార్దిక్ 60, అలీ (సి)పంత్ (బి)జడేజా 34, లివింగ్‌స్టోన్ (సి)జడేజా (బి) హార్దిక్ 27, డెవిడ్ విల్లే (సి) సూర్య (బి)చాహల్ 18, ఓవర్టన్ (సి)కోహ్లి (బి)చాహల్ 32, కార్సె నాటౌట్ 3, టాప్లీ (బి)చాహల్ 0, ఎక్స్‌ట్రాలు : 17, మొత్తం :(45.5 ఓవర్లలో ఆలౌట్) 259.
వికెట్ల పతనం : 1-12, 2-12, 3-66, 4-74, 5-149, 6-198, 7-199, 8-247, 9-257, 10-259. బౌలింగ్ : షమి 7-0-38-0, సిరాజ్ 9-1-66-2, కృష్ణ 9-0-48-0, హార్దిక్ 7-3-24-4, చాహల్ 9.5-0-60-3, జడేజా 4-0-21-1.
భారత్ ఇన్నింగ్స్ : రోహిత్ (సి) రూట్ (బి) టాప్లీ 17, ధావన్ (సి) రారు (బి) టాప్లీ 1, కోహ్లి (సి) బట్లర్ (బి) టాప్లీ 17, పంత్ నాటౌట్ 125, సూర్య (సి) బట్లర్ (బి) ఓవర్టన్ 16, హార్దిక్ (సి)స్టోక్స్ (బి) కార్సె 71, జడేజా నాటౌట్ 7, ఎక్స్‌ట్రాలు : 7, మొత్తం :(42.1 ఓవర్లలో 5 వికెట్లకు) 261.
వికెట్ల పతనం : 1-13, 2-21, 3-38, 4-72, 5-205. బౌలింగ్ : టాప్లీ 7-1-35-3, విల్లే 7-0-58-0, కార్సె 8-0-45-1, అలీ 8-0-33-0, ఓవర్టన్ 8-0-54-1, స్టోక్స్ 2-0-14-0, లివింగ్‌స్టోన్ 2-0-14-0, రూట్ 0.1-0-4-0.