Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లక్ష్యం 342, ప్రస్తుతం 222/3
గాలే: తొలి టెస్ట్‌లో పాకిస్తాన్ జట్టు గెలుపు దిశగా పయనిస్తోంది. శ్రీలంక నిర్దేశించిన 342పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పాకిస్తాన్ జట్టు నాల్గోరోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 222పరుగులు చేసింది. మరో 120 పరుగులు చేస్తే పాక్ జట్టు గెలుపొందనుంది. అదే క్రమంలో ఆతిథ్య శ్రీలంక జట్టు మరో 7 వికెట్లను కూలిస్తే ఆ జట్టుకు విజయం దక్కనుంది. ఓవర్ నైట్ స్కోర్ 9 వికెట్ల నష్టానికి 329పరుగులకు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన లంక జట్టు మరో 8పరుగులు జోడించి చివరి వికెట్‌ను కోల్పోయింది. దీంతో 342పరుగుల భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన పాకిస్తాన్ జట్టును ఓపెనర్ షఫీక్(112నాటౌట్)కి తోడు కెప్టెన్ బాబర్ అజామ్(55) అర్ధసెంచరీతో ఆదుకున్నారు. నాల్గోరోజు ఆట ముగిసే సమయానికి రిజ్వాన్(7), షఫీక్ క్రీజ్‌లో ఉన్నారు.
యాసిర్ షా అద్భుత బౌలింగ్..
షేన్ వార్న్ 'బాల్ ఆఫ్ ది సెంచరీ'ని పోలి పాకిస్తాన్ స్పిన్నర్ యాసిర్ షా అదే విధంగా బంతిని వేసి క్రికెట్ అభిమానులను అలరించాడు. మంగళవారం ఆటలో భాగంగా కీలక ఇన్నింగ్స్ ఆడుతున్న కుషాల్ మెండిస్‌ను ఓ అద్భుత బంతికి బౌల్డ్ చేశాడు. కుషాల్ 74 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఇన్నింగ్స్ 56వ ఓవర్లో యాసిర్ షా బౌలింగ్‌కు వచ్చాడు. క్రీజులో ఉన్న కుషాల్‌కు పూర్తిగా లెగ్‌స్టంప్ అవతల వేసిన బంతి అనూహ్యమైన టర్న్ తీసుకొని ఆఫ్ స్టంప్‌ను ఎగురగొట్టింది. తాను వేసిన బంతి అంతలా టర్న్ అవుతుందని యాషిర్ షా కూడా ఊహించి ఉండడు. అందుకే వికెట్ పడగానే గట్టిగా అరుస్తూ సెలబ్రేట్ చేసుకోగా.. క్రీడాభిమానులు కొందరు మాత్రం ఆ బంతి షేన్ వార్న్ 'బాల్ ఆఫ్ ది సెంచరీ'ని పోలి ఉందని ట్వీట్ చేస్తున్నారు.