Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రిజర్వ్ ఆటగాళ్లకు పరీక్ష
-విండీతో వన్డే సిరీస్
నవతెలంగాణ క్రీడావిభాగం
ఇంగ్లాండ్‌తో సమరం ముగిసింది. వన్డే సిరీస్ విజయానంతరం జట్టులోకి కొంతమంది ఆటగాళ్లు నేరుగా కరీబియన్ దీవులకు వెళ్లిపోయారు. కీలక ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్య, జశ్‌ప్రీత్ బుమ్రాలకు విండీస్ పర్యటన నుంచి విశ్రాంతి లభించింది. స్పోర్ట్స్ హెర్నియా సర్జరీ నుంచి కెఎల్ రాహుల్ కోలుకుంటున్నాడు. దీంతో వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు ఎక్కువగా రిజర్వ్ ఆటగాళ్లే ఎంపికయ్యారు. వచ్చే ఏడాది స్వదేశంలో ఐసీసీ వన్డే వరల్డ్‌కప్ జరుగనుంది. ఈ నేపథ్యంలో ప్రధాన బలగంతో పాటు బెంచ్ బలాన్ని సైతం పరీక్షించుకునే అవకాశం భారత్‌కు లభించింది. వెస్టిండీస్‌తో తొలి వన్డేకు ముందు చీఫ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, తాత్కాలిక కెప్టెన్ శిఖర్ ధావన్‌లు పలు కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది.
ధావన్ జోడీ ఎవరు? : ఇషాన్ కిషన్ జట్టులో తొలి ప్రాధాన్య రిజర్వ్ ఓపెనర్, వికెట్ కీపర్. ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌లో కిషన్‌కు అవకాశం రాలేదు. రోహిత్, ధావన్ జోడీ మూడు మ్యాచులు ఆడింది. రోహిత్ లేని వేళ కిషన్ ఆ స్థానంపై కన్నేశాడు. కానీ శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్ సైతం రేసులో ఉన్నారు. కుడి-ఎడమ కాంబినేషన్ కోసం భారత్ ప్రయత్నిస్తే గిల్, గైక్వాడ్‌లలో ఒకరికి అవకాశం లభించవచ్చు. లిస్ట్-ఏ క్రికెట్లో రుతురాజ్ 54.73 సగటుతో 100 స్ట్రయిక్‌రేట్‌తో (63 ఇన్నింగ్స్‌లు) అదరగొట్టాడు. మహారాష్ట్ర తరఫున విజరు హజారే టోర్నీలో 113 స్ట్రయిక్‌రేట్‌తో 603 పరుగులు బాదాడు. అందులో నాలుగు శతకాలు ఉన్నాయి. గిల్‌కు సైతం ఈ ఫార్మాట్లో మంచి రికార్డు ఉంది. ఇటీవల వన్డే మ్యాచ్ ప్రాక్టీస్ లేకపోవటం గిల్‌కు ప్రతికూలం.
మిడిల్ ఆర్డర్? : మిడిల్ ఆర్డర్లో సూర్యకుమార్ యాదవ్ ఓ బెర్త్ కోసం గట్టి పోటీదారు. దీంతో శ్రేయస్ అయ్యర్, దీపక్ హుడా, సంజు శాంసన్ సహా శుభ్‌మన్ గిల్‌లకు మిగతా రెండు స్థానాలపై కన్నేశారు. పూర్తి స్థాయి భారత వన్డే జట్టులో పాగా వేసేందుకు సూర్య సిద్ధమవుతున్నాడు. శ్రేయస్ అయ్యర్ తాజా ఫామ్ ఆందోళనకరం. అతడు అంతగా మెప్పించటం లేదు. అయినా, ఈ సిరీస్‌లో అతడిని తప్పించటం సాధ్యప డదు. దీపక్ హుడా, సంజు శాంసన్, గిల్ మధ్యనే పోటీ.
ఆల్‌రౌండర్లు ఎవరు? : జట్టులో స్పిన్ ఆల్‌రౌండర్లు దండిగా ఉన్నారు. రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్‌లతో పాటు దీపక్ హుడా అందుబాటులో ఉన్నాడు. హార్దిక్ పాండ్య స్థానంలో దీపక్‌ను ప్రయోగించే ఆలోచన ఉంటే అతడిని లోయర్ ఆర్డర్లో ఆడించవచ్చు. పేస్ ఆల్‌రౌండర్ శార్దుల్ ఠాకూర్ ఒక్కడే అందుబాటులో ఉన్నాడు. జట్టు మేనేజ్మెంట్కు మరో ఆప్షన్ లేదు.
బౌలింగ్ కూర్పు? : లోయర్ ఆర్డర్ బ్యాటింగ్ బలోపేతం కోసం జడేజా, శార్దుల్ తుది జట్టులో ఉండనున్నారు. యుజ్వెంద్ర చాహల్ తొలి ప్రాధాన్య స్పిన్నర్. దీంతో ఇద్దరు స్పెషలిస్ట్ పేసర్లకు మాత్రమే అవకాశం ఉంది. ఇంగ్లాండ్‌తో మూడో వన్డేలో ఆడిన మహ్మద్ సిరాజ్ రేసులో ముందున్నాడు. అర్షదీప్ సింగ్, ప్రసిద్ కృష్ణ, అవేశ్ ఖాన్లు మరో బెర్త్ కోసం పోటీపడుతున్నారు. ఆసీస్ పర్యటనలో సీనియర్ల లేని వేళ సిరాజ్ పేస్ దళాన్ని నడిపించాడు. విండీస్ టూర్లోనూ అదే బాధ్యత నిర్వర్తించనున్నాడు. అవేశ్ ఖాన్‌కు రెండో పేసర్‌గా అవకాశం దక్కవచ్చు. భారత్, వెస్టిండీస్ తొలి వన్డే శుక్రవారం పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో జరుగనుంది.