Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిబంధనలు తెలిసే.. బోర్డు కార్యదర్శిగా ఎన్నిక
- పదవీ కాలం ముగిశాక పిల్లిమొగ్గలు
- బీసీసీఐ రాజ్యాంగ సవరణ కోసం పట్టు
'బీసీసీఐ, రాష్ట్ర క్రికెట్ సంఘంలో కలిపి వరుసగా రెండు పర్యాయాలు (ఆరేండ్లు) పదవిలో కొనసాగిన వ్యక్తులు తప్పకుండా మూడేండ్లు పదవులకు దూరంగా ఉండాలి. మూడేండ్ల విరామం అనంతరమే తిరిగి క్రికెట్ బోర్డు పదవులు చేపట్టేందుకు అర్హులు' సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఆర్ఎం లోధా కమిటీ సిఫార్సుల మేరకు బీసీసీఐ నూతన రాజ్యాంగంలో అత్యంత స్పష్టంగా చేర్చబడిన నిబంధన ఇది. మరో ఏడాదిలో పదవీ కాలం ముగుస్తుందనే పూర్తి అవగాహనతోనే బీసీసీఐ పీఠమెక్కిన సౌరవ్ గంగూలీ, జై షాలు ఇప్పుడు కుర్చీ దిగేందుకు పిల్లిమొగ్గలు వేస్తున్నారు.
నవతెలంగాణ-హైదరాబాద్
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సమూల ప్రక్షాళన పరంపర.. ఎడతెగని కథలా సాగుతోంది. ఐపీఎల్ స్ఫాట్ ఫిక్సింగ్ కుంభకోణంతో దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు వీధుల్లోకి వచ్చిన నిరసన ప్రదర్శనలు చేపట్టిన ఫలితంగా.. దేశ అత్యున్నత న్యాయస్థానం బీసీసీఐ పరిపాలన వ్యవస్థను సంస్కరించే బాధ్యతను మాజీ సీజేఐ జస్టిస్ ఆర్ఎం లోధా కమిటీకి అప్పగించింది. భారత క్రికెట్ వ్యవస్థాగత పరిపాలన విధానాలు, రాష్ట్ర స్థాయి నుంచి బీసీసీఐ వరకు కొందరి వ్యక్తుల్లోనే అధికారం కేంద్రీకృతం కావడాన్ని గమనించిన లోధా కమిటీ..భారత క్రికెట్ వ్యవస్థకు నూతన జవసత్వాలు తీసుకొచ్చేందుకు విప్లవాత్మక సంస్కరణలను సిఫారసు చేసింది. లోధా కమిటీ సిఫారసులను యథాతథంగా ఆమోదించిన సుప్రీంకోర్టు.. అమలు బాధ్యతను మాజీ కాగ్ వినోద్ రారు సారథ్యంలోని పాలకుల కమిటీ (సీఏఓ)కు అప్పగించింది. నూతన రాజ్యాంగం ప్రకారం ఎన్నికలు నిర్వహించిన సీఓఏ కొత్త పాలక వర్గానికి అధికార బాధ్యతలు అప్పగించి తప్పుకోగానే.. బీసీసీఐలో సంస్కరణల కథ మొదటికొచ్చింది. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, కార్యదర్శి జై షా, సంయుక్త కార్యదర్శి జయేశ్ జార్జ్ పదవీ కాలాలు ముగిసినా.. ఇప్పటికీ కుర్చీ వదలడానికి ఇష్టపడటం లేదు.
రూల్స్‌కు విరుద్ధంగా : బీసీసీఐ రాజ్యాంగం ప్రకారం ఏ వ్యక్తి వరుసగా ఆరేండ్లు బీసీసీఐ లేదా రాష్ట్ర క్రికెట్ సంఘాల్లో పదవి చేపట్టకూడదు. ఆరేండ్ల అనంతరం (రెండు పర్యాయాలు) కచ్చితంగా విరామం సమయంలోకి వెళ్లిపోవాలి. నిబంధనల ప్రకారం బీసీసీఐ అధ్యక్ష, కార్యదర్శుల పదవీ కాలం ముగిసిపోయింది. గుజరాత్ క్రికెట్ సంఘం (జీసీఏ)లో జై షా 2013 నుంచి కొనసాగుతున్నాడు. బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్)లో గంగూలీ 2014 నుంచి కొనసాగుతున్నాడు. 2019 అక్టోబర్‌లో జై షా, గంగూలీ బీసీసీఐ పదవి బాధ్యతలు చేపట్టారు. జై షా పదవీ కాలం 2020 మే నెలలో ముగియగా.. సౌరవ్ గంగూలీ పదవీ కాలం అదే ఏడాది జులైలో ముగిసింది. సంయుక్త కార్యదర్శి జయేశ్ జార్జ్ పదవీ కాలం 2020 ఆగస్టులో ముగిసింది. సుప్రీంకోర్టు ఆదేశాలు, బోర్డు నూతన రాజ్యాంగం ప్రకారం ఈ ముగ్గురు పదవుల నుంచి తప్పుకుంటే.. కొత్త వ్యక్తులు పాలనా బాధ్యతలు చేపట్టడానికి మార్గం సుగమం కానుంది.
పాత పాట.. కొత్త రాగంలో..! : బీసీసీఐ సంస్కరణల అమలు సమయంలో సుప్రీంకోర్టులో పెద్ద తతంగమే సాగింది. గరిష్ట వయోపరిమితి, మూడేండ్ల విరామ సమయంపై బీసీసీఐ అంగీకారం తెలపలేదు. నిస్సహాయ స్థితిలో శశాంక్ మనోహర్ ఐసీసీ బాధ్యతల్లోకి వెళ్లిపోగా.. ధిక్కారణ స్వరం వినిపించిన అనురాగ్ ఠాకూర్ (ప్రస్తుత కేంద్ర క్రీడాశాఖ మంత్రి)పై సుప్రీంకోర్టు వేటు వేసింది. ఈ నిబంధనలను మార్చుతూ రాజ్యాంగ సవరణలు చేస్తారని ముందే ఊహించిన సుప్రీంకోర్టు.. అందుకు సుప్రీంకోర్టు ముందస్తు అనుమతి తప్పనిసరి చేస్తూ మెలిక పెట్టింది. కొత్త రాజ్యాంగానికి అంగీకారం తెలుపుతూ ఏర్పడిన నూతన పాలకవర్గం తొలి సమావేశంలో.. ఈ నిబంధనలను మార్చేందుకు రాజ్యాంగ సవరణకు పూనుకుంది. అందుకు బీసీసీఐ సభ్యుల ఏకాభిప్రాయం సాధించింది. రాజ్యాంగ సవరణకు ప్రతిసారి సుప్రీంకోర్టు అనుమతి అవసరం లేకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేసింది. వరుసగా ఆరేండ్ల అనంతరం విరామం సమయం నిబంధన తొలగింపు కుదరదు అంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వగా.. తాజాగా రాజ్యాంగ సవరణకు అనుమతిస్తే ఆ నిబంధన మార్చుకుంటామని బీసీసీఐ వాదిస్తోంది.
సరికొత్త వాదన?! : జై షా, గంగూలీ పదవీ కాలాలు ముగుస్తున్న సమయంలో బీసీసీఐ ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టులో దాఖలు చేసింది. 2020, జులైలో వీడియో కాన్ఫరెన్స్‌లో వాదనలు వినాల్సింది, కానీ అది జరుగలేదు. చివరగా ఈ కేసులో ఏప్రిల్, 2021లో వాదనలు చోటుచేసుకున్నాయి. కోవిడ్ పరిస్థితుల్లో సుప్రీంకోర్టులో ఇది లిస్టింగ్‌కు రాలేదు. సుప్రీంకోర్టులో పిటిషన్ విచారణకు రావాల్సి ఉందనే సాకుతో జై షా, గంగూలీ పదవులు వీడలేదు. పదవీ కాలాలు ముగిసిన అధ్యక్ష, కార్యదర్శుల కనుసన్నల్లోనే బీసీసీఐ మెగా ఐపీఎల్ మీడియా హక్కుల వేలం, ఐపీఎల్ కొత్త ప్రాంఛైజీల వేలం వేసింది. ఈ కేసులో కోర్టు సహాయకారిగా ఉన్న పిఎస్ నరసింహ న్యాయమూర్తిగా నియమించబడ్డారు. ఇక, రానున్న సెప్టెంబర్‌లో బీసీసీఐ వార్షిక సర్వ సభ్య సమావేశం జరుగనుంది. ఆ సమావేశంలో బీసీసీఐ నూతన కార్యవర్గం ఎన్నిక కానుంది. ఆ లోగా సుప్రీంకోర్టులో తీర్పు అనుకూలంగా వస్తే.. పదవుల్లో యథాతథంగా కొనసాగేందుకు జై షా, గంగూలీ ప్రయత్నిస్తున్నారు.
అందుకోసం 2023 వన్డే వరల్డ్‌కప్ ఆతిథ్య బాధ్యతలను వాడుకునేందుకు సిద్ధమవుతున్నారు. వచ్చే ఏడాది ఐసీసీ మెగా ఈవెంట్‌కు వేదిక భారత్. దేశవ్యాప్తంగా విభిన్న నగరాల్లో జరిగే ప్రపంచకప్ నిర్వహణ బాధ్యతలు.. అప్పుడప్పుడే కొత్తగా వచ్చే కార్యవర్గంతో కష్టమైన పనిగా కోర్టులో వాదనలు వినిపించనున్నారు. ప్రపంచకప్ నిర్వహణ సజావుగా సాగేందుకు, క్షేత్రస్థాయిలో అభివృద్ది పనుల కోసం మూడేండ్ల విరామ నిబంధన తొలగించాలని సుప్రీంకోర్టును కోరనున్నారని చెప్పవచ్చు!.
సుప్రీంలో నేడు విచారణ
ఎట్టకేలకు సుప్రీంకోర్టులో విచారణకు వచ్చిన బీసీసీఐ కేసు గురువారానికి వాయిదా పడింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ కృష్ణ మురారి, జస్టిస్ హిమా కోహ్లిలతో కూడిన త్రి సభ్య ధర్మాసనం ముందు బుధవారం విచారణకు వచ్చింది. నూతన రాజ్యాంగం ప్రకారం సాంకేతికంగా అధ్యక్ష, కార్యదర్శుల పదవీ కాలం ముగిసినా ఇంకా కొనసాగుతున్నారని బిహార్ క్రికెట్ సంఘం తరఫున న్యాయవాది వాదించారు. బీసీసీఐ తరఫున సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే ఒక రోజు వాయిదా కోరగా ధర్మాసనం అనుమతిచ్చింది. ' రేపు విచారిద్దాం. ఒక్కరోజులో ఏం జరుగదు. తొందరేముంది? అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.