Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జులై 28న వాదనలు విననున్న సుప్రీంకోర్టు
- బోర్డు రాజ్యాంగ సవరణపై బీసీసీఐ పిటిషను
న్యూఢిల్లీ : భారత క్రికెట్ పరిపాలన వర్గాలను ఉత్కంఠకు గురిచేస్తున్న బీసీసీఐ పిటిషను విచారణ మరోసారి వాయిదా పడింది. బీసీసీఐ రాజ్యాంగంలో సవరణలకు అవకాశం ఇవ్వాలని బోర్డు దాఖలు చేసిన పిటిషనుపై సుప్రీంకోర్టు జులై 28న వాదనలు విననుంది. ఈ మేరకు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ హిమ కోహ్లి, జస్టిస్ కృష్ణ మురారిలతో కూడిన త్రి సభ్య ధర్మాసనం సీనియర్ న్యాయవాది మణిందర్ సింగ్ను ఈ కేసులో కోర్టు సహాయకుడిగా (అమీకస్ క్యూరీ) నియమించింది. గతంలో ఈ కేసులో అమీకస్ క్యూరీగా వ్యవహరించిన పి.ఎస్ నరసింహా ఈ ఏడాది సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఎంపికయ్యారు. దీంతో మణిందర్ సింగ్ను తాజాగా నియమించారు. బీసీసీఐ తరఫున సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే వాదనలు వినిపించనున్నారు.
బీసీసీఐ నూతన రాజ్యాంగం ప్రకారం వరుసగా ఆరేండ్లు (రెండు పర్యాయాలు) పదవిలో కొనసాగిన వ్యక్తులు తిరిగి పోటీచేసేందుకు, పదవిలో కొనసాగేందుకు అనర్హులు. కచ్చితంగా మూడేండ్లు విరామం సమయం తీసుకోవాలి. పిఎస్ నరసింహ సహాయంతో పాలకుల కమిటీ ఈ మేరకు బీసీసీఐ నూతన రాజ్యాంగం ఆమోదం పొందేలా చేశారు. కొత్త కార్యవర్గానికి బాధ్యతలు అప్పగించటంతో పాలకుల కమిటీ 30 నెలల పహారా బాధ్యతలు ముగిశాయి. గంగూలీ, జై షా సారథ్యంలోని బీసీసీఐ నూతన పాలకవర్గం తొలి సమావేశంలో రాజ్యాంగ సవరణకు పూనుకుంది. సుప్రీంకోర్టులో పిటిషను దాఖలు చేసింది. వాస్తవానికి లోధా కమిటీ ప్రతి మూడేండ్లకు ఓసారి విరామం సమయం సిఫారసు చేయగా.. జస్టిస్ డివై చంద్రచూడ్ ఆ నిబంధనను సరళతరం చేసి ప్రతి ఆరేండ్లకు ఓ సారి విరామం సమయం విధించారు. తాజాగా ఆ నిబంధనను సైతం ఎత్తివేయాలని బోర్డు కోరుతోంది. బీసీసీఐ ఆఫీస్ బేరర్లలో అధ్యక్షుడు గంగూలీ, కార్యదర్శి జై షా, కోశాధికారి అరుణ్ కుమార్ ధుమాల్, సంయుక్త కార్యదర్శి జయేశ్ రంజన్, ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లాలు వరుసగా ఆరేండ్ల పదవీ కాలం పూర్తి చేసుకున్నారు. సుప్రీంకోర్టు రాజ్యాంగ సవరణకు అనుమతిస్తే రానున్న వార్షిక సభ్య సమావేశంలో తిరిగి ఎన్నికై 2025 వరకు బీసీసీఐ పగ్గాలు చేతుల్లో ఉంచుకునేందుకు గంగూలీ, జై షా ప్రయతిస్తున్నారు.