Authorization
Mon Jan 19, 2015 06:51 pm
టీ20 ప్రపంచకప్ ఏడాదిలో భారత్, వెస్టిండీస్ వన్డే సిరీస్‌పై ఆసక్తి పెద్దగా లేదు!. వరల్డ్‌కప్ సూపర్ లీగ్‌లో సైతం ఈ సిరీస్ భాగం కాదు. గత వారం వన్డే సిరీస్‌ను ముగించుకున్న విండీస్, భారత్ నేడు తాజాగా మరో వైట్‌బాల్ వార్‌కు సిద్ధమయ్యాయి. కీలక ఆటగాళ్లు లేని వేళ సిరీస్‌లో లభించిన అవకాశాలతో సత్తా చాటేందుకు భారత కుర్రాళ్లు ఎదురుచూస్తున్నారు. భారత్‌తో సిరీస్‌లో వన్డే ఫామ్ మెరుగుపర్చుకోవటంపై కరీబియన్లు కన్నేశారు. భారత్, వెస్టిండీస్ తొలి వన్డే పోరు నేడు.
- వెస్టిండీస్‌తో భారత్ తొలి వన్డే నేడు
- రాత్రి 7 నుంచి డిడిస్పోర్ట్స్లో..
నవతెలంగాణ-పోర్ట్ ఆఫ్ స్పెయిన్
ఇంగ్లాండ్‌పై వరుసగా వైట్‌బాల్ సిరీస్ విజయాలను సాధించిన భారత్.. ప్రధాన ఆటగాళ్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్య, మహ్మద్ షమి, జశ్‌ప్రీత్ బుమ్రాలకు విశ్రాంతి అందించింది. కెఎల్ రాహుల్ శస్త్రచికిత్స అనంతరం కోలుకుంటున్నాడు. వన్డే జట్టులో సుమారు ఆరుగురు కీలక ఆటగాళ్లు లేకుండా భారత్ కరీబియన్ దీవులకు వెళ్లింది. తాత్కాలిక కెప్టెన్ శిఖర్ ధావన్ సారథ్యంలో సిరీస్ అసాంతం అవకాశాలు లభించనుండటంతో సత్తా చాటేందుకు కుర్రాళ్లు తహతహలాడుతున్నారు. మరోవైపు వన్డే ఫార్మాట్లో గత చివరి ఆరు మ్యాచుల్లోనూ ఓటమి చవిచూసిన వెస్టిండీస్ ఈ సిరీస్‌లో ఈ చెత్త రికార్డు నుంచి బయటపడేందుకు చూస్తోంది.
రాణించేనా?! : శిఖర్ ధావన్ ఈ సిరీస్‌లో భారత్‌కు కెప్టెన్. కానీ అతడు ఇటీవల పేలవంగా రాణిస్తున్నాడు. టీ20 ప్రణాళికల్లో చోటు కోల్పోయిన శిఖర్ ప్రస్తుతం 50 ఓవర్ల ఆటలోనే ఆడుతున్నాడు. కెఎల్ రాహుల్ ఫిట్నెస్ సాధిస్తే పూర్తి స్థాయి భారత జట్టులో ధావన్ స్థానం ప్రశ్నార్థకం. దీంతో అతడు వీలైనంత త్వరగా పరుగుల వేటలో పడిపోవాలి. చివరి ఐదు వన్డేల్లో ధావన్ 28 సగటు, 61.53 స్ట్రయిక్‌రేట్‌తో 112 పరుగులే చేశాడు. ఈ ఫార్మాట్లో సెంచరీ సాధించి 20 ఇన్నింగ్స్‌లు అయిపోయింది. జట్టులో కీలక బ్యాటర్లు సైతం లేకపోవటంతో నాయకుడిగా, సీనియర్ బ్యాటర్‌గా శిఖర్ ధావన్ రాణించాల్సిన అవసరం జట్టుకు సైతం ఏర్పడింది. మరో ఆటగాడు శ్రేయస్ అయ్యర్‌కు సైతం ఈ సిరీస్ కీలకం కానుంది. సూర్యకుమార్ యాదవ్ భారత జట్టులో స్థానం సుస్థిరం చేసుకునే పనిలో ఉండగా.. శ్రేయస్ అయ్యర్ వరుసగా విఫలమవుతున్నాడు. ఇది భవిష్యత్‌లో అతడి ఉద్వాసనకు దారితీయగలదు. వెస్టిండీస్‌తో సిరీస్‌లో రాణించటం శ్రేయస్ అయ్యర్‌కు అత్యవసరం. దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్ సూపర్ ఫామ్ కొనసాగించటంపై దృష్టి సారించనుండగా.. ఇషాన్ కిషన్, సంజు శాంసన్, రుతురాజ్ గైక్వాడ్‌లు అవకాశం లభిస్తే సత్తా చాటాలని భావిస్తున్నారు. ఇక బౌలింగ్ విభాగంలో షమి, బుమ్రా లేని వేళ మహ్మద్ సిరాజ్ ముందుండి నడిపించనున్నాడు. శార్దుల్ ఠాకూర్, అవేశ్ ఖాన్లు పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు. రవీంద్ర జడేజాతో కలిసి యుజ్వెంద్ర చాహల్ మాయజాలం చేయనున్నాడు.
కథ మారేనా? : వెస్టిండీస్‌కు వన్డే ఫార్మాట్లో మంచి రికార్డు లేదు. ఈ ఫార్మాట్లో 50 ఓవర్ల పాటు క్రీజులో నిలువటం సైతం ఆ జట్టుకు సవాలే. 2021 జనవరి నుంచి వెస్టిండీస్ వన్డేల్లో 12 సార్లు తొలుత బ్యాటింగ్ చేయగా.. అందులో తొమ్మిదిసార్లు పూర్తి ఓవర్లు ఆడలేకపోయింది. మంచి బౌలింగ్ విభాగమున్న భారత్‌పైనా కరీబియన్లు ఏపాటి నిలుస్తారనేది ఆసక్తికరం. సీనియర్ ఆల్‌రౌండర్ జేసన్ హోల్డర్ జట్టులోకి రావటం విండీస్‌కు ఊరట. హోల్డర్ రాకతో అటు బౌలింగ్‌లో, ఇటు బ్యాటింగ్‌లో విండీస్ మెరుగుపడనుంది. ఇక యువ సారథి నికోలస్ పూరన్‌కు భారత్‌పై ఎదురులేని రికార్డు కలిగి ఉన్నాడు. బారత్ తొమ్మిది ఇన్నింగ్స్‌ల్లో 44.25 సగటుతో 354 పరుగులు చేశాడు నికోలస్ పూరన్. జట్టులోని ప్రతిభావంతులు సమిష్టిగా రాణిస్తే విండీస్ గట్టి పోటీ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. యువ పేసర్ అకీల్ హోస్సేన్ భారత బ్యాటర్లకు సవాల్ విసరగలడు. ఈ ఏడాది 14 మ్యాచుల్లో 4.90 ఎకానమీతో 22 వికెట్లు కూల్చిన అకీల్ వన్డే సిరీస్‌లో కీలకంగా మారనున్నాడు.
పిచ్, వాతావరణం : బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌కు సిద్ధం చేసిన పిచ్‌లను విండీస్ కెప్టెన్ పూరన్ విమర్శించాడు. దీంతో నేడు క్వీన్స్ పార్క్ ఓవల్‌లో బ్యాట్‌కు, బంతికి సరసమైన పోటీ ఉండేలా పిచ్ ఎదురు కానుంది. ఇక్కడ చివరగా 2019లో అంతర్జాతీయ మ్యాచ్ జరిగింది. పిచ్ ఎలా స్పందిస్తుందనే విషయంలో కాస్త ఆసక్తి కనిపిస్తోంది. ఇక్కడ జరిగిన 9 మ్యాచుల్లో భారత్ ఎనిమిదింట విజయాలు నమోదు చేసింది. ఓ మ్యాచ్ వర్షార్పణమైంది. మేఘావృతమైన వాతావరణం ఉన్నప్పటికీ.. ఎటువంటి వర్షం సూచనలు లేవని వాతావరణ శాఖ తెలిపింది.
తుది జట్లు (అంచనా) :
భారత్ : శిఖర్ ధావన్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్/ఇషాన్ కిషన్, దీపక్ హుడా, సంజు శాంసన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, శార్దుల్ ఠాకూర్, అవేశ్ ఖాన్, యుజ్వెంద్ర చాహల్, మహ్మద్ సిరాజ్.
వెస్టిండీస్ : షారు హోప్ (వికెట్‌కీపర్), బ్రాండన్ కింగ్, షమ్రా బ్రూక్స్, కైల్ మేయర్స్, నికోలస్ పూరన్ (కెప్టెన్), రోవ్‌మన్ పావెల్, జేసన్ హోల్డర్, అకీల్ హోస్సేన్, అల్జారీ జోసెఫ్, మోటీ, జైడెన్ సీల్స్.