Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బైజూస్, పేటీఎం ఒప్పందాలపై వార్తలు
ముంబయి : భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)లో లీకులు శుక్రవారం ఉదయం నుంచి సోషల్ మీడియాను ఊపేశాయి. ఐపీఎల్ మీడియా హక్కుల వేలంతో రికార్డు ధర సొంతం చేసుకున్న బీసీసీఐ... స్వదేశీ అంతర్జాతీయ సీజన్‌కు సైతం స్పాన్సర్‌షిప్‌ల ద్వారా గణనీయంగా ఆర్జిస్తోంది. బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సమావేశం ముగిసిన అనంతరం బోర్డు నుంచి లీకులు రావటం గమనార్హం. బీసీసీఐ జెర్సీ లోగో స్పాన్సర్ బైజూస్, భారత స్వదేశీ సీజన్ టైటిల్ స్పాన్సర్ పేటీఎంలపై ఈ లీకులు వచ్చాయి. ఈ లీకులను బీసీసీఐ అధికారులు ఖండించినా.. అందులో వాస్తవాలు సైతం ఉండటం విశేషం. తొలుత భారత జట్టు జెర్సీ లోగో స్పాన్సర్ బైజూస్ విషయానికొద్దాం. బైజూస్ సంస్థ బీసీసీఐకి సుమారు రూ.86.21 కోట్లు బకాయి పడింది. ఈ మేరకు బ్యాంకు గ్యారంటీలు సైతం ఆ సంస్థ ఇవ్వలేదని లీకులు వచ్చాయి. నిజానికి మొబైల్ కంపెనీ ఒప్పొ నుంచి బైజూస్ ఆ హక్కులు పొందింది. బీసీసీఐతో బైజూస్ ఒప్పందం నిజానికి ముగిసింది. మరో మూడేండ్ల కొనసాగింపు ఒప్పందానికి ఇరు వర్గాలు అంగీకారానికి వచ్చాయి. కానీ నూతన ఒప్పందంపై సంతకాలు చేయలేదు. తొలుత చేసుకున్న ఒప్పందం ముగిసిన అనంతరం జరిగిన మ్యాచులకు గాను చెల్లించాల్సిన మొత్తాన్ని బైజూస్ ఇంకా బోర్డుకు చెల్లించలేదు. అందుకు గల కారణం, నూతన ఒప్పందంలో సంతకాలు చేయకుండా చెల్లింపులు జరపటం సాధ్యపడదని సమాచారం. బైజూస్ బకాయీలు చెల్లించలేని పరిస్థితుల్లో బోర్డు వద్ద ఇప్పటికే ఉన్న బ్యాంకు గ్యాంరెంటీల ద్వారా సొమ్ము చేసుకోవచ్చు. కానీ బీసీసీఐ ఆ పని చేయలేదు. అంటే, ఇరు వర్గాల సమ్మతితోనే ఈ బకాయి చెల్లింపు ప్రక్రియ తాత్కాలిక నిలిచిపోయిందని తెలుస్తోంది. బకాయి మొత్తం రూ.86.21 కోట్లు అని వార్తలు రావటంతో లీకులు బోర్డు నుంచే వెళ్లాయని చెప్పవచ్చు. ఇక, రెండోది భారత క్రికెట్ జట్టు స్వదేశీ సీజన్ టైటిల్ స్పాన్సర్ పేటీఎం. సిరీస్ టైటిల్ హక్కులపై పేటీఎం ఆసక్తిగా లేదని సోషల్ మీడియాలు వార్తలు వచ్చాయి. బీసీసీఐ తన హక్కులను మరో సంస్థ మాస్టర్‌కార్డ్‌కు బదిలీ చేసేందుకు సిద్ధమవుతోందని సమాచారం. మాస్టర్‌కార్డ్‌కు భారత క్రికెట్‌తో ప్రయాణం చేసేందుకు ముందు నుంచీ ఆసక్తి ఉంది. ఇప్పుడు పేటీఎం నుంచి టైటిల్ స్పాన్సర్షిప్ హక్కులు దక్కించుకునేందుకు ఆ సంస్థ సిద్ధంగానే ఉండవచ్చు. దీనిపై అటు బీసీసీఐ, ఇటు స్పాన్సర్ల నుంచి వివరణ, ప్రకటన లేకుండా.. లీక్‌లు బయటకి రావటం బీసీసీఐని ఇరకాటంలో పడేసింది.