Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రోహిత్ యాదవ్ సైతం అడుగు
- పపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్
బల్లెం వీరుడు నీరజ్ చోప్రా అదరగొట్టాడు. టోక్యో ఒలింపిక్స్‌లో పసిడి పతకంతో భారతావనిని పులకింపజేసిన నీరజ్ చోప్రా.. ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్‌లోనూ అటువంటి ప్రదర్శన పునరావృతం చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడు. నీరజ్ చోప్రాతో పాటు మరో జావెలియన్ త్రోయర్ రోహిత్ యాదవ్ ఈ విభాగంలో ఫైనల్స్‌కు చేరుకున్నారు. ఓవరాల్‌గా ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో ఫైనల్స్‌కు అర్హత సాధించిన భారత క్రీడాకారుల సంఖ్య 12కు చేరుకోవటం విశేషం.
నవతెలంగాణ-యుజీన్ :ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్‌లో భారత అథ్లెట్లు సత్తా చాటుతున్నారు. జావెలిన్ త్రో విభాగంలో భారత బల్లెం వీరులు అరుదైన చరిత్ర సృష్టించారు. ఒలింపిక్ పసిడి పతక విజేత నీరజ్ చోప్రా, రోహిత్ యాదవ్‌లు జావెలిన్ త్రో విభాగం ఫైనల్లోకి ప్రవేశించారు. 24 ఏండ్ల నీరజ్ చోప్రాకు ఇది తొలి ప్రపంచ చాంపియన్‌షిప్స్ ఫైనల్ కాగా.. రోహిత్ యాదవ్ సైతం కెరీర్లో అతిపెద్ద ఘనత సొంతం చేసుకున్నాడు. అర్హత రౌండ్లో గ్రూప్-ఏలో నీరజ్ చోప్రా అగ్రస్థానంలో నిలువగా.. గ్రూప్-బిలో రోహిత్ యాదవ్ ఆరో స్థానంలో నిలిచాడు. ఓవరాల్‌గా నీరజ్ చోప్రా రెండో స్థానంలో, రోహిత్ యాదవ్ 11వ స్థానంలో నిలిచి జావెలిన్ త్రో ఫైనల్స్‌కు దూసుకెళ్లారు. ఆదివారం ఉదయం జావెలిన్ త్రో ఫైనల్స్ జరుగనున్నాయి.
ఒకే ఒక్క త్రో : టోక్యో ఒలింపిక్స్‌లో పసిడి పతకంతో భారత అథ్లెటిక్స్ చరిత్రలోనే అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఒలింపిక్ విజేతగా అవతరించి సరికొత్త ప్రమాణాలను నెలకొల్పాడు. ప్రపంచ చాంపియన్‌షిప్స్ పసిడిపై కన్నేసిన నీరజ్ చోప్రా.. అందుకోసం ముందుగానే ప్రణాళికలు వేసుకున్నాడు. గత నెల రోజులుగా యూరోప్ పర్యటనలో కీలక టోర్నీల్లో ప్రాతినిథ్యం వహించాడు. దూరం మెరుగుపర్చుకుని పతకాలూ సొంతం చేసుకున్నాడు. దీంతో ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో నీరజ్ చోప్రా ప్రదర్శన పట్ల అమితమైన ఆసక్తి నెలకొంది. శుక్రవారం జరిగిన జావెలిన్ త్రో అర్హత రౌండ్లో నీరజ్ చోప్రా ధనాధన్ షో చూపించాడు. అర్హత రౌండ్లో ప్రతి అథ్లెట్‌కు మూడు అవకాశాలు ఉంటాయి. కానీ నీరజ్ చోప్రా తొలి ప్రయత్నంలోనే బల్లెంను ఏకంగా 88.39 మీటర్ల దూరం విసిరాడు. అర్హత మార్క్‌ను తొలి ప్రయత్నంలోనే అందుకున్నాడు. దీంతో మరో రెండు సార్లు అతడు బల్లెం విసరాల్సిన అవసరమే ఏర్పడలేదు. గ్రూప్-ఏలో నీరజ్ చోప్రా అగ్రస్థానంలో నిలిచాడు. మరోవైపు డిఫెండింగ్ చాంపియన్, పసిడి పోరులో నీరజ్ చోప్రా ప్రధాన ప్రత్యర్థి అండర్సన్ పీటర్స్ (గ్రెనెడ) 89.91 మీటర్ల దూరంతో గ్రూప్‌తో పాటు ఓవరాల్‌గా నం.1గా నిలిచాడు. భారత్‌కు చెందిన మరో జావెలిన్ త్రోయర్ రోహిత్ యాదవ్ 80.42 మీటర్ల దూరంతో ఫైనల్స్‌కు అర్హత సాధించాడు. తొలి ప్రయత్నంలోనే 80.42 మీటర్లు సాధించిన రోహిత్ యాదవ్.. రెండో ప్రయత్నంలో ఫౌల్ అయ్యాడు. మూడో ప్రయత్నంలో 77.32 మీటర్ల దూరమే విసరగలిగాడు. అయినా, గ్రూప్-బిలో ఆరో స్థానంలో రోహిత్ యాదవ్ ఆదివారం నాటి మెగా ఈవెంట్లో తొలిసారి బల్లెం బలం నిరూపించుకోనున్నాడు. ఇదిలా ఉండగా, ట్రిపుల్ జంప్ విభాగంలో భారత అథ్లెట్ ఎల్డోస్ పాల్ ఫైనల్స్‌కు అర్హత సాధించాడు. శుక్రవారం నాటి అర్హత రౌండ్లో పాల్ 17.68 మీటర్లతో ఆకట్టుకున్నారు. గ్రూప్-ఏలో ఆరో స్థానంలో నిలిచిన పాల్, ఓవరాల్‌గా 12వ స్థానంలో ఉన్నారు. ట్రిపుల్ జంప్ ఫైనల్స్‌లో పాల్ అదృష్టం పరీక్షించుకోనున్నాడు.
ఫైనల్లో సత్తా చాటుతా : అర్హత రౌండ్లో ఇది మంచి ఆరంభం. ఫైనల్లో మాత్రం వంద శాతం ప్రదర్శన ఇస్తాను. ఆదివారం ఏం జరుగుతుందో చూద్దాం, ఎందుకంటే ప్రతి రోజు భిన్నమైనది. అత్యుత్తమ ప్రదర్శన చేయటమే నా చేతుల్లో ఉంది. ఎవరు ఏ రోజు అత్యధిక దూరం బల్లెం విసురుతారో మనకు తెలియదు. నా రనప్‌లో కాస్త జిగ్‌జాగ్ కనిపిస్తుంది. త్రో విసిరే సమయంలో నేను కాస్త కదిలాను. అయినా, అది మంచి త్రో. రేసులో ఎంతోమంది ఉత్తమ త్రోయర్లు ఉన్నారు. ఐదారుగురు త్రోయర్లు ఈ ఏడాది కెరీర్ ఉత్తమ ప్రదర్శన కనబరిచారు. వాళ్లందరూ మంచి ఊపులో ఉన్నారు. ఆదివారం ఫైనల్స్ ఆసక్తికరంగా సాగనుందని నీరజ్ చోప్రా అన్నాడు.