Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరీబియన్ దీవుల్లో వరుసగా రెండో వన్డే సిరీస్‌పై టీమ్ ఇండియా కన్నేసింది. ఉత్కంఠగా సాగిన తొలి వన్డేలో పైచేయి సాధించిన భారత్.. నేడు సిరీస్ విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. ద్వితీయ శ్రేణి జట్టుతో కరీబియన్ గడ్డపై కాలుమోపిన శిఖర్ ధావన్.. సిరీస్ విజయంతో సెలక్టర్లకు గట్టి సందేశం పంపాలని భావిస్తున్నాడు. తొలి వన్డేలో ఓడినా.. వెస్టిండీస్ అద్భుత ప్రదర్శనే చేసింది. దీంతో సిరీస్‌ను సమం చేయటంపై విండీస్ పట్టుదలగా కనిపిస్తోంది. భారత్, వెస్టిండీస్ కీలక రెండో వన్డే పోరు నేడు.
- మరో విజయంపై ధావన్సేన గురి
- సమం చేసేందుకు కరీబియన్ల ఆరాటం
- భారత్, వెస్టిండీస్ రెండో వన్డే నేడు
- రాత్రి 7 నుంచి డిడిస్పోర్ట్స్లో...
నవతెలంగాణ-పోర్ట్ ఆఫ్ స్పెయిన్ :
భారత్, వెస్టిండీస్ తొలి వన్డే అత్యంత ఉత్కంఠగా ముగిసింది. విజయం భారత్‌ను వరించినా.. వెస్టిండీస్ సైతం మానసికంగా గెలుపొందింది!. వన్డే ఫార్మాట్లో ఆ జట్టు 50 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేయటం సవాల్‌గా మారింది. 309 పరుగుల ఛేదనలో వెస్టిండీస్ ఆఖరు బంతి వరకు విజయం కోసం పోరాటం చేసింది. ఈ పోరాట స్ఫూర్తి కరీబియన్ శిబిరంలో కచ్చితంగా నూతన ఉత్సాహం నింపుతుంది. ఆ ఉత్సాహాన్ని నేడు విజయం కోసం ఉపయోగించేందుకు నికోలస్ పూరన్సేన సిద్ధమవుతోంది. మరోవైపు కుర్రాళ్లతో కరీబియన్ దీవులకు వచ్చిన శిఖర్ ధావన్.. ద్వితీయ శ్రేణి జట్టుతో ఏం చేయగలడా? అనిపించింది. కానీ కుర్రాళ్లు మెరువటంతో శిఖర్ ధావన్ నేడు ఏకంగా సిరీస్ విజయంపై గురిపెట్టాడు. వెస్టిండీస్‌లో వరుసగా రెండో వన్డే సిరీస్ విజయమే లక్ష్యంగా భారత్ బరిలోకి దిగుతోంది. తొలి వన్డే వేదికలోనే రెండో మ్యాచ్ జరుగునుండటంతో పిచ్, పరిస్థితుల పట్ల ఇరు జట్లకు ఓ అవగాహన ఏర్పడ్డాయి. ఇది రసవత్తర సమరానికి దారితీయనుంది!.
మిడిల్ ఒక్కటే సమస్య! : తొలి వన్డేలో భారత్ అన్ని విభాగాల్లోనూ మెరుగైన ప్రదర్శన చేసింది. సుమారు 19 నెలల అనంతరం తొలి వన్డే ఆడిన శుభ్‌మన్ గిల్.. కెరీర్ అత్యుత్తమ స్కోరు నమోదు చేశాడు. కొత్త బంతినీ, మెత్తబడిన బంతినీ స్వేచ్ఛగా బాదిన శుభ్‌మన్ గిల్ వేగంగా అర్థ సెంచరీ పూర్తి చేశాడు. రుతురాజ్, ఇషాన్ కిషన్‌లను వెనక్కి నెట్టి ఓపెనర్‌గా తుది జట్టులో నిలిచిన శుభ్‌మన్ గిల్ అందుకు తగిన ప్రదర్శన చేశాడు. శ్రేయస్ అయ్యర్ సైతం ఆకట్టుకున్నాడు. ఇంగ్లాండ్ పర్యటనలో తేలిపోయిన కెప్టెన్ శిఖర్ ధావన్ శివమెత్తాడు. 3 పరుగుల దూరంలో శతకం చేజార్చుకున్నప్పటికీ.. పర్యాటక జట్టుకు విజయం అందించే ఇన్నింగ్స్ ఆడాడు. టాప్-3 బ్యాటర్ల అర్థ సెంచరీలతో చెలరేగటంతో భారత్ భారీ స్కోరుపై కన్నేసింది. కానీ మిడిల్ ఆర్డర్ ఆశించిన ప్రదర్శన చేయలేదు. సూర్యకుమార్ యాదవ్, సంజు శాంసన్ సహా దీపక్ హుడాలను అంచనాలను అందుకోలేదు. సూర్యకుమార్, సంజు శాంసన్‌లు ఐపీఎల్లో అదరగొట్టారు, మంచి టచ్‌లో ఉన్నారు. నేటి మ్యాచ్‌లో ఈ ఇద్దరూ మెరిస్తే భారత్ భారీ స్కోరుపై కన్నేయవచ్చు. బుమ్రా, షమి లేని వేళ సిరాజ్ నాయకుడిగా పేస్ దళాన్ని గొప్పగా నడిపించాడు. చివర్లో కండ్లుచెదిరే యార్కర్లతో కరీబియన్ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. శార్దుల్ ఠాకూర్, చాహల్ సైతం కరీబియన్ల కట్టడిలో కీలక పాత్ర పోషించారు. రవీంద్ర జడేజా గాయం నుంచి కోలుకోలేదు. దీంతో అక్షర్ పటేల్ ఆ బాధ్యత పోషించనున్నాడు. దీపక్ హుడా పార్ట్‌టైమ్ స్పిన్నర్‌గా మంచి మార్కులు కొట్టేశాడు. నేడు అతడి నుంచి బ్యాట్‌తోనూ భారత్ మంచి ఇన్నింగ్స్ ఆశిస్తోంది.
గెలుపు దీమా వచ్చే! : తొలి వన్డేలో వెస్టిండీస్ విజయంపై విశ్వాసం సాధించింది!. ఛేదనలో ఆ జట్టు మెరుగైన ప్రదర్శన చేసింది. టాప్ ఆర్డర్లో మేయర్స్, బ్రూక్స్, కింగ్ రాణించారు. కెప్టెన్ నికోలస్ పూరన్, రోవ్‌మన్ పావెల్లలో ఒకరు అంచనాలను అందుకునే ప్రదర్శన చేసి ఉంటే..తొలి వన్డే ఫలితం కచ్చితంగా మరోలా ఉండేది. నాణ్యమైన భారత బౌలింగ్‌ను ఎదుర్కొని వెస్టిండీస్ 50 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసింది. నిజానికి ఆ జట్టుకు ఇది ఓ పెద్ద ఘనత అని చెప్పవచ్చు. అల్జారీ జొసెఫ్, అకీల్ హుస్సేన్, మోటీలు బంతితో విండీస్‌కు కీలకం కానున్నారు.
పిచ్, వాతావరణం : గ్రీన్ పార్క్ ఓవల్ పిచ్ బ్యాటర్లకు అనుకూలం. ఇక్కడ కుదురుకుంటే పరుగుల ఖాయం. మ్యాచ్ సాగుతున్న కొద్ది పిచ్ నెమ్మదించిన భావన కలిగినా.. ఆ ప్రభావం పెద్దగా లేదు. బంతి మెత్తబడిన తర్వాత సైతం పరుగుల ప్రవాహానికి ఢోకా ఉండదు!. పేసర్లు, స్పిన్నర్లు క్రమశిక్షణతో బంతులేస్తేనే వికెట్ల వేటలో నిలబడగలరు. మ్యాచ్ రోజు ఎటువంటి వర్ష సూచనలు కనిపించటం లేదు. టాస్ నెగ్గిన జట్టు తొలుత ఫీల్డింగ్ ఎంచుకునే అవకాశం కనిపిస్తోంది.
తుది జట్లు (అంచనా) :
భారత్ : శిఖర్ ధావన్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), దీపక్ హుడా, అక్షర్ పటేల్, శార్దుల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, యుజ్వెంద్ర చాహల్, ప్రసిద్ కృష్ణ.
వెస్టిండీస్ : షారు హౌప్ (వికెట్ కీపర్), కైల్ మేయర్స్, షమ్రా బ్రూక్స్, బ్రాండన్ కింగ్, నికోలస్ పూరన్ (కెప్టెన్), రోవ్‌మన్ పావెల్, అకీల్ హౌస్సేన్, రోమారియో షెఫర్డ్, అల్జారీ జొసెఫ్, జైదేవ్ సీల్స్, మోటీ.