Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 3 పరుగుల తేడాతో విండీస్‌పై పైచేయి
- సిరీస్‌లో 1-0 ఆధిక్యం భారత్ సొంతం
పోర్ట్ ఆఫ్ స్పెయిన్ : ఉత్కంఠగా సాగిన తొలి వన్డేలో వెస్టిండీస్‌పై భారత్ 3 పరుగుల తేడాతో విజయం సాధించింది. చివరి ఓవర్లో వెస్టిండీస్‌కు 15 పరుగులు అవసరం కాగా.. హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ (2/57) కండ్లుచెదిరే యార్కర్లతో కరీబియన్ బ్యాటర్లను బురిడీ కొట్టించాడు. శార్దుల్ ఠాకూర్ (2/54), యుజ్వెంద్ర చాహల్ (2/58) సైతం రాణించటంతో 309 పరుగుల ఛేదనలో వెస్టిండీస్ 50 ఓవర్లలో 6 వికెట్లకు 305 పరుగులే చేసింది. ఛేదనలో ఆ జట్టు ఓపెనర్ కైల్ మేయర్ (75, 68 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్స్), బ్రాండన్ కింగ్ (54, 66 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్థ సెంచరీలకు తోడు షమ్రా బ్రూక్స్ (46, 61 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. చివర్లో అకీల్ హుస్సేన్ (32 నాటౌట్, 32 బంతుల్లో 2 ఫోర్లు), రోమారియో షెఫర్డ్ (39 నాటౌట్, 25 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఆఖరు బంతి వరకు పోరాటం చేశారు. అయినా, వెస్టిండీస్ గెలుపు గీత తాకలేకపోయింది. మూడు మ్యాచుల వన్డే సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ కెప్టెన్ శిఖర్ ధావన్ (97, 99 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్‌లు), శుభ్‌మన్ గిల్ (64, 53 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), శ్రేయస్ అయ్యర్ (54, 57 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్థ సెంచరీలు సాధించగా 50 ఓవర్లలో 7 వికెట్లకు 308 పరుగులు చేసింది.