Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మరో చరిత్ర. మరో చారిత్రక పతక విన్యాసం. భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా అద్భుతం ఆవిష్కరించాడు. ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్‌లో రజత పతకం సొంతం చేసుకున్నాడు. ఒలింపిక్స్ పసిడితో ఆ ఘనత సాధించిన ఏకైక భారతీయుడిగా చరిత్ర సృష్టించిన నీరజ్ చోప్రా.. తాజాగా వరల్డ్ చాంపియన్‌షిప్స్‌లో సిల్వర్‌తో మెరిశాడు. ప్రతిష్టాత్మక వరల్డ్ ఈవెంట్లో సిల్వర్ మెడల్ సాధించిన తొలి భారత అథ్లెట్‌గా రికార్డు నెలకొల్పాడు.
- ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో రజతం
- నీరజ్ చోప్రా చారిత్రక పతక విన్యాసం
- రోహిత్ యాదవ్‌కు తప్పని నిరాశ
- ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్
నవతెలంగాణ-యుజీన్
ఏకకాలంలో ఒలింపిక్, వరల్డ్ చాంపియన్‌గా నిలిచే అరుదైన రికార్డు ముందుంది. హేమాహేమీలు పసిడి రేసులో నిలిచారు. యూరోప్ సీజన్లో మంచి ప్రదర్శనతో నీరజ్ చోప్రా సైతం పతకంపై దీమాగా కనిపిస్తున్నాడు. కానీ 90 ప్లస్ మార్క్ దాటకపోవటం.. అభిమానుల్లో కాస్త ఉత్కంఠకు కారణమైంది. ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్ జావెలిన్ త్రో విభాగం ఫైనల్. బరిలో 12 మంది మేటీ బల్లెం వీరులు. తొలి మూడు రౌండ్లు ముగిశాయి. పతక పొజిషన్ (టాప్-3)లో భారత సూపర్‌స్టార్ పేరు లేదు. నీరజ్ చోప్రా ఇంకా నాల్గో స్థానంలోనే కొనసాగుతున్నాడు. మరోవైపు పీటర్సన్ అండర్స్ అప్పటికే 90 మీటర్లకు పైగా దూరంతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. టోక్యో ఒలింపిక్స్ సిల్వర్ మెడలిస్ట్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. అప్పుడు.. నాల్గో ప్రయత్నంలో బల్లెంను 88.13 మీటర్లు విసిరిన నీరజ్ చోప్రా టాప్-2లోకి దూసుకొచ్చాడు. అప్పటివరకు ఉత్కంఠతో ఒత్తిడిలో కనిపించిన నీరజ్ చోప్రా మోముపై కాస్త చిరునవ్వు కనిపించింది. అది చెరగలేదు, అలాగే ఉండిపోయింది!. నీరజ్ చోప్రా జావెలిన్ త్రోలో సిల్వర్ మెడల్ సొంతం చేసుకున్నాడు. ఈ ఘనత సాధించిన తొలి భారత అథ్లెట్‌గా చరిత్ర సృష్టించాడు. 2003లో అంజూ జార్జ్ బాబీ లాంగ్ జంప్‌లో కాంస్య పతకం సాధించటమే భారత్‌కు ఇప్పటివరకు అత్యుత్తమం. నీరజ్ చోప్రా సిల్వర్ మెడల్‌తో మెగా ఈవెంట్లో భారత్‌కు మరో పతకంతో పాటు పతకం రంగు మెరుగుపర్చాడు. 2017 ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో తొలిసారి బల్లెం విసిరిన నీరజ్ చోప్రా అప్పుడు ఫైనల్స్‌కు అర్హత సాధించలేదు. గాయం నుంచి కోలుకుంటున్న తరుణంలో 2019 దోహా ప్రపంచ చాంపియన్‌షిప్స్‌కు దూరంగా ఉన్నాడు. కెరీర్ రెండో ప్రపంచ అథ్లెట్లిక్ చాంపియన్‌షిప్స్‌లో నీరజ్ చోప్రా చిరస్మరణీయ ప్రదర్శన చేశాడు. ఒలింపిక్స్, ఆసియాలతో పాటు ప్రపంచ చాంపియన్‌షిప్స్ మెడల్‌ను సైతం ఖాతాలో వేసుకున్నాడు. నీరజ్ చోప్రా రజత ప్రదర్శనకు అభినందనలు వెల్లువెత్తాయి. ప్రధాన మంత్రి నరెంద్ర మోడీ చోప్రాను అభినందనలు తెలిపాడు. ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్, దిగ్గజ షుటర్ అభినవ్ బింద్రా ట్విట్టర్ వేదికగా నీరజ్ చోప్రాను అభినందించారు.
నీరజ్ అదుర్స్ : దేశం నిద్దరోతున్న వేళ నీరజ్ చోప్రా ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో దేశం గర్వపడే ప్రదర్శన చేశాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం వేకువజామున జరిగిన జావెలిన్ త్రో విభాగం ఫైనల్స్‌లో నీరజ్ చోప్రా రజత పతకం సాధించాడు. నార్వే అథ్లెట్ జావెలియన్ త్రోయర్ అండ్రీయస్ అనంతరం ఒలింపిక్, ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన తొలి అథ్లెట్‌గా నిలిచే అరుదైన అవకాశం నీరజ్ చోప్రా చేజారింది. అయినా, భారత్‌కు నీరజ్ చోప్రా అత్యుత్తమ పతకమే అందించాడు. ఫైనల్లో ఏకంగా మూడు సార్లు 90 మీటర్లకు ఆవల బల్లెం విసిరిన అండర్సన్ పీటర్స్ పసిడి పతకం సొంతం చేసుకున్నాడు. చివరి ప్రయత్నంలో 90.54 మీటర్లతో అండర్సన్ స్వర్ణం సాధించాడు. ఫైనల్లో వరుసగా 90.21 మీటర్లు, 90.46 మీటర్లు, 87.21 మీటర్లు, 88.11 మీటర్లు, 85.83 మీటర్లు, 90.54 మీటర్లతో వరుసగా అండర్సన్ అద్భుత ప్రదర్శన చేశాడు. మరోవైపు నీరజ్ చోప్రా పతక వేట నిరాశగా మొదలైంది. 90 మీటర్ల లక్ష్యంపై గురిపెట్టిన నీరజ్ చోప్రా ఆ ఒత్తిడిలో తొలి ప్రయత్నంలో ఫౌల్ అయ్యాడు. రెండో ప్రయత్నంలో 82.39 మీటర్లతో నిరాశపరిచాడు. మూడో ప్రయత్నంలో కాస్త మెరుగై 86.37 మీటర్ల దూరం విసిరాడు. అయినా, అప్పటికి పతకం ఖాయం కాలేదు. నాల్గో ప్రయత్నంలో 88.13 మీటర్ల దూరంతో రెండో స్థానానికి ఎగబాకాడు. సిల్వర్ మెడల్ ఖాయం చేసుకున్నాడు. టోక్యో ఒలింపిక్స్ సిల్వర్ మెడలిస్ట్ జాకుబ్ (చెక్ రిపబ్లిక్) 88.09 మీటర్ల త్రో తో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం సొంతం చేసుకున్నాడు. జావెలిన్ త్రో విభాగం ఫైనల్లో నీరజ్ చోప్రాతో పాటు పోటీపడిన మరో భారత అథ్లెట్ రోహిత్ యాదవ్ మెరుగైన ప్రదర్శన చేసినా.. దిగ్గజాలతో పోటీపడలేకపోయాడు. బల్లెంను గరిష్టంగా 78.72 మీటర్ల దూరం విసరగలిగిన రోహిత్ యాదవ్ పదో స్థానంతో సరిపెట్టుకున్నాడు.
' ఈ రోజు దేశం కోసం సిల్వర్ మెడల్ సాధించాను. వచ్చే ఏడాది మెరుగైన ప్రదర్శనతో అత్యుత్తమ పతకం సాధిస్తాననే విశ్వాసం ఉంది. ఈ విజయంలో తోడ్పాటు అందించిన కోచింగ్ సిబ్బంది, ప్రభుత్వానికి ధన్యవాదాలు. దేశానికి వరుసగా పతకాలు సాధించటం బాగుంది. కానీ ఇదే సమయంలో ఇతరులతో ఎలా ఉన్నామనేది ప్రధానం. మనపట్ల గౌరవం చూపుతున్న వారిపట్ల తిరిగి మనం గౌరవంగా ఉంటున్నామా? లేదా అనేది ముఖ్యం. క్రీడాకారుడి కెరీర్ కొంత కాలమే. ఆ తర్వాత సాధారణ జీవితమే కొనసాగించాలి. ఎల్లప్పుడూ మూలాలను మరువకుండా ఉండటం మంచిది' అని ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్‌లో పతకం సాధించిన అనంతరం నీరజ్ చోప్రా అన్నాడు.