Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జాతి వివక్ష ఆరోపణల ప్రభావం
గ్లాస్గో : స్కాట్లాండ్ క్రికెట్ బోర్డు మూకుమ్మడిగా రాజీనామా చేసింది. వ్యవస్థీకృత జాతి వివక్షపై స్వతంత్య్ర విచారణ నేపథ్యంలో క్రికెట్ బోర్డు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. జాతి వివక్ష విచారణ నివేదిక నేడు విడుదల చేయనుండగా, ఓ రోజు ముందుగానే బోర్డు సభ్యులు పదవుల నుంచి తప్పుకున్నారు. ఇంగ్లీష్ కౌంటీ క్రికెట్ క్లబ్ యార్క్‌షైర్‌లో జాతి వివక్షపై అజీమ్ రఫీక్ గళమెత్తగా.. స్కాట్లాండ్ క్రికెట్లోనూ వ్యవస్థీకృత జాతి వివక్ష చవిచూశానని మజీద్ హాక్ ఆరోపణలు చేశారు. స్కాట్లాండ్ తరఫున అత్యధిక వికెట్లు కూల్చిన బౌలర్‌గా మజీద్ హాక్ రికార్డు సాధించాడు. నవంబర్ 2021లో ఓ టెలివిజన్ చానల్లో మజీద్ ఈ ఆరోపణలు చేశారు. దీంతో స్వతంత్య్ర విచారణకు ఆదేశించారు. విచారణలో వ్యవస్థీకృత జాతి వివక్ష ఆరోపణలు వాస్తవమేనని తేలిందని తెలుస్తోంది. వివక్షకు తావులేని క్రికెట్ పరిపాలనకు నాంది పలికేందుకు ప్రస్తుత బోర్డు రాజీనామా లేఖను తాత్కాలిక సీఈఓకు పంపించింది. 'స్పోర్ట్స్కాట్లాండ్తో కలిసి మెరుగైన పరిపాలన విధానం కోసం పని చేస్తాం. రానున్న రోజుల్లో సమర్థవంతమైన నాయకత్వానికి మద్దతుగా నిలుస్తాం. జాతి వివక్షపై సమీక్షకు పూర్తిగా సహకరించారు. విచారణ అత్యంత పారదర్శకంగా సాగింది. ఈ మార్పు స్కాట్లాండ్ క్రికెట్‌తో పాటు క్రికెట్ ఆటలోనూ సంస్కరణలకు నాంది అని భావిస్తున్నాం. విచారణలో సూచించిన సిఫారసులను అమలు చేసేందుకు బోర్డు కట్టుబడి ఉంది. జాతి వివక్ష చవిచూసిన, ఇబ్బందిపడిన వారికి బోర్డు బేషరతు క్షమాపణలు చెబుతోంది' అని బోర్డు సభ్యులు రాజీనామా లేఖలో పేర్కొన్నారు.