Authorization
Mon Jan 19, 2015 06:51 pm
448 జాతి వివక్ష ఘటనలు!. బహుశా, ప్రపంచ క్రికెట్లో వెలుగు చూసిన అత్యంత దారుణ జాతి వివక్ష ఇదేనేమో!. స్కాట్లాండ్ క్రికెట్ జాతి వివక్ష విష వలయంలో చిక్కుకుంది. అక్కడ పూర్తిగా వ్యవస్థ జాతి వివక్షను నరనరాల్లోకి ఎక్కించుకుంది!. స్వతంత్య్ర దర్యాప్తు సంస్థ విచారణలో నిప్పులాంటి నిజాలు వెలుగు చూడగా.. జాతి వివక్ష రహిత క్రికెట్ దిశగా స్కాట్లాండ్ క్రికెట్ బోర్డు అడుగు ముందుకేసింది.
- స్కాట్లాండ్ క్రికెట్లో వ్యవస్థీకృత జాతి వివక్ష
- స్వతంత్య్ర నివేదికలో వెలుగుచూసిన వాస్తవాలు
- స్కాట్లాండ్ క్రికెట్లో సమూల సంస్కరణలకు అడుగు
నవతెలంగాణ-గ్లాస్గో
'మార్పు తనంతట తాను రాదు. సరైన వ్యక్తులు, సరైన సమయం కోసం ఎదురుచూసి ప్రయోజనం లేదు. మనం కోరుకున్న మార్పు మనతోనే మొదలవుతుంది. మన మార్పు తీసుకొచ్చేది మనమే' జాతి వివక్షకు వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రజానికాన్ని ఉద్దేశించి ఓ మహానుభావుడు చేసిన వ్యాఖ్యలు ఇవి. స్కాట్లాండ్ క్రికెట్లో ఇది అక్షర సత్యమైంది. స్కాట్లాండ్ క్రికెట్లో దశాబ్దాలుగా వేళ్లూనుకుపోయిన జాతి వివక్షను ఎదురించిన బాధితులు అంతిమ విజయం సాధించారు. 2021 నవంబర్‌లో మాజీ క్రికెటర్ మజిద్ హాక్ చేసిన జాతి వివక్ష ఆరోపణలు.. స్కాట్లాండ్ క్రికెట్లో సమీక్షకు దారితీసింది. మజిద్ హాక్‌తో పాటు ఖాసీం షేక్ సైతం జాతి వివక్ష ఆరోపణలు చేశారు. మజీద్, ఖాసీం ఆరోపణల నుంచి మొదలైన స్వతంత్య్ర విచారణ మొత్తం స్కాట్లాండ్ క్రికెట్‌ను ఊపేసింది. జాతి వివక్ష బాధితులకు క్షమాపణలు చెబుతూ స్కాట్లాండ్ క్రికెట్ బోర్డు ఆదివారమే రాజీనామా చేయగా.. జాతి వివక్ష రహిత క్రికెట్ బోర్డుకు నాంది పలుకుతూ సోమవారం నివేదికలో వెలుగుచూసిన అంశాలను స్కాట్లాండ్ క్రికెట్ బోర్డు సీఈఓ స్టివార్ట్ హారీస్ మీడియాకు వెల్లడించారు.
448 విష ఘటనలు
ఒక్కటి కాదు, రెండు కాదు.. ఏకంగా 448 విష ఘటనలు. స్కాట్లాండ్ క్రికెట్ సర్క్యూట్లో వెలుగుచూసిన జాతి వివక్ష ఘటనలు ఇవి. ప్లాన్4స్పోర్ట్ సంస్థ స్వతంత్య్ర నివేదికలో ఈ విషయాలు వెలుగు చూశాయి. వ్యవస్థీకృత జాతి వివక్షపై సమీక్షలో ఈ సంస్థ 31 అంశాల్లో స్కాట్లాండ్ క్రికెట్ ప్రమాణాలను కొలమానం చేసింది. అందులో 29 అంశాల్లో స్కాట్లాండ్ క్రికెట్ ఫెయిల్ కాగా.. కేవలం రెండు అంశాల్లో మాత్రం కనీస ప్రమాణాలను కలిగి ఉంది. మజిద్ హాక్, ఖాసీం షేక్ ఆరోపణలతో విచారణ ప్రారంభం కాగా.. ఓవరాల్‌గా 1000 మందిని విచారణ చేశారు. 68 మంది వ్యక్తిగత వివక్ష చవిచూసిన ఘటనలను విచారణ కమిటీతో పంచుకోగా.. అందులో 31 మంది చేసిన ఆరోపణలపై స్వతంత్య్ర దర్యాప్తు సంస్థ లోతైన దర్యాప్తు చేసింది. 15 మంది భిన్నమైన వ్యక్తులపై జాతి వివక్ష ఆరోపణలు రాగా.. అందులో రెండు క్లబ్‌లు, ఓ ప్రాంతీయ క్రికెట్ సంఘం సైతం ఉన్నాయి. ఇందులో కొందరి పేర్లను విద్వేష నేరాల కింద స్కాట్లాండ్ పోలీసులకు సిఫారసు చేయగా.. ఇప్పటికే ఓ వ్యక్తి న్యాయస్థానం ముందు నిల్చున్నాడు.
ఎదురిస్తే.. వేటే!
స్కాట్లాండ్ క్రికెట్లో జాతి వివక్ష బలంగా నాటుకుపోయింది. జాతి, రంగు ఉద్దేశిస్తూ దూషించటం, అభ్యంతరకర భాష ఉపయోగించటం సహా క్రికెట్ జట్ల ఎంపికలో తెల్ల జాతీయుల చిన్నారుల పట్ల మక్కువ చూపించటం ఉన్నాయి. స్వతంత్య్ర దర్యాప్తులో సుమారు 62 శాతం మంది స్కాట్లాండ్ క్రికెట్లో వివిధి రూపాల్లో వివక్షకు గురయ్యారు. కేంద్రీకృత స్కాట్లాండ్ క్రికెట్ పరిపాలన వ్యవస్థలో జాతి వివక్షను సమర్థవంతంగా నిలువరించే విధానమే లేకుండా పోయింది. జాతి వివక్షకు గురైన ఆటగాళ్లు, వ్యక్తులు ఆ అంశాన్ని లేవనెత్తితే.. వారిని తప్పించేవారు. మజిద్ హాక్ విషయంలో ఇదే చోటు చేసుకుంది. స్కాట్లాండ్ తరఫున అత్యధిక వికెట్లు కూల్చిన మజిద్ హాక్‌ను 2015 వరల్డ్‌కప్ అనంతరం మళ్లీ జాతీయ జట్టులోకి తీసుకోలేదు. ఆ సమయంలో మజిద్ హాక్ స్కాట్లాండ్ తరఫున 54 వన్డేల్లో ప్రాతినిథ్యం వహించాడు. స్కాట్లాండ్ జాతీయ జట్టుకు అప్పట్లో అదే రికార్డు. 2021 జాతి వివక్ష ఘటనలపై ఇంగ్లీష్ కౌంటీ క్రికెట్ క్లబ్‌లలో నిరసన గళాలు వినిపించగా.. ఆ స్ఫూర్తితో మజిద్ హాక్ స్కాట్లాండ్ క్రికెట్లో వ్యవస్థీకృత జాతి వివక్షను ప్రపంచానికి తెలియజేశాడు.
మార్పు దిశగా.. ఓ అడుగు
వ్యవస్థీకృత జాతి వివక్షను గుర్తించిన స్కాట్లాండ్ క్రికెట్ బోర్డు.. వివక్ష రహిత క్రికెట్ పరిపాలన దిశగా ఓ అడుగు ముందుకేసింది. స్వతంత్య్ర దర్యాప్తు సంస్థ లేవనెత్తిన అంశాలను ఆమోదించటంతో స్కాట్లాండ్ క్రికెట్ బోర్డు రానున్న ఏడాదిలో సుమారు రూ.4.5 కోట్లు ప్రభుత్వ నిధులను కోల్పోవాల్సి వస్తుంది. అయినా, సంస్కరణలకే సలాం కొట్టిన క్రికెట్ బోర్డు విప్లవాత్మక చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. ఇక నుంచి స్కాట్లాండ్ క్రికెట్ బోర్డులో మైనార్టీల ప్రాతినిథ్యం 25 శాతం ఉండేలా చూడనున్నారు. తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్న వెస్ట్రర్న్ డిస్ట్రిక్ట్ క్రికెట్ యూనియన్ పరిపాలనపై సమీక్ష కోరటంతో పాటు రానున్న రోజుల్లో ఆ ప్రాంతంలో క్రికెట్ పర్యవేక్షణ బాధ్యతల నుంచి ఆ సంఘాన్ని తప్పించనున్నారు.