Authorization
Mon Jan 19, 2015 06:51 pm
స్కాట్లాండ్ క్రికెట్లో జాతి వివక్ష, అనంతరం సమూల సంస్కరణల నుంచి భారత క్రికెట్ పెద్దలు కచ్చితంగా పాఠం నేర్చుకోవాలి. భారత క్రికెట్లో వ్యవస్థీకృత కుల వివక్షపై ఎప్పటినుంచో విమర్శలు ఉన్నాయి. భారత క్రికెట్‌కు టెస్టుల్లో సమారు 300 మంది ప్రాతినిథ్యం వహిస్తే.. అందులో కేవలం నలుగురు క్రికెటర్లు దళిత, ఆదివాసీ నేపథ్యం కలిగిన వారున్నారు!. బీసీసీఐ క్రికెటర్ల కుల గణన వివరాలు అధికారికంగా నమోదు చేయదు. అయితే, తాజాగా స్కాట్లాండ్ క్రికెట్లో శ్వేత జాతీయులకు సెలక్షన్ ప్రక్రియలో అగ్రతాంబూలం అందించి.. ఇతరుల పట్ల వివక్ష చూపడాన్ని సైతం ఎత్తి చూపారు. భారత క్రికెట్లో దళిత, ఆదివాసీలకు ప్రాతినిథ్యమే ఉండదు. దీంతో డ్రెస్సింగ్‌రూమ్‌లో వివక్షకు ఆస్కారమే లేదు. కానీ జట్ల ఎంపిక విషయంలో కుటుంబ నేపథ్యం కీలకం అవుతోంది. బహుజనులకు ఎంపిక ప్రక్రియలో మొండిచేయి చూపిస్తున్నారు. జట్టు ఎంపికలో కుటుంబ నేపథ్యమే ప్రధానంగా చూస్తున్నారని సచిన్ సమకాలీన క్రికెటర్, రమాకాంత్ అచ్రేకర్ శిష్యులలో ఒకరైన అనిల్ గురవ్ ఓ ఇంటర్వ్యూలో ఆరోపించారు. భారత్‌లోనూ వివక్ష పట్ల తీవ్ర స్థాయిలో ఉద్యమం రాకముందే.. బీసీసీఐ అన్ని స్థాయిల్లో జట్ల ఎంపిక విషయంలో వివక్ష లేకుండా చూసుకోవటం మంచిది. మహిళల క్రికెట్లో బహుజన ప్రాతినిథ్యం మెరుగైన శాతంలో కనిపిస్తోంది. కానీ ఆది నుంచి బీసీసీఐ కనుసన్నల్లోనే ఎదిగిన మెన్స్ క్రికెట్లో ప్రత్యేకించి ఓ వర్గానికే అధిక ప్రాధాన్యం లభిస్తోంది. రానున్న కాలంలో బీసీసీఐ అసమానతలను తుడిచిపెట్టేందుకు తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.