Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెండో వన్డేలో భారత్ ఉత్కంఠ విజయం
- ఛేదనలో అక్షర్, శ్రేయస్, శాంసన్ జోరు
- 2-0తో వన్డే సిరీస్ భారత్ వశం
పోర్ట్ ఆఫ్ స్పెయిన్ : భారత్ లక్ష్యం 312 పరుగులు. 40 ఓవర్ల అనంతరం భారత్ స్కోరు 212/5. బౌలింగ్ ఆల్‌రౌండర్లు దీపక్ హుడా, అక్షర్ పటేల్ క్రీజులో ఉన్నారు. స్పెషలిస్ట్ బ్యాటర్లు అప్పటికే పెవిలియన్‌కు చేరుకున్నారు. విజయానికి చివరి 60 బంతుల్లో 100 పరుగులు చేయాలి. ఈ పరిస్థితుల్లో ఆతిథ్య వెస్టిండీస్ సిరీస్ సమం విజయం లాంఛనమే అనిపించింది. కానీ అప్పుడే క్రీజులోకి వచ్చిన అక్షర్ పటేల్ (64 నాటౌట్, 35 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లు) ఆలోచనలు భిన్నంగా సాగాయి. ధనాధన్ ఇన్నింగ్స్‌తో దంచికొట్టిన అక్షర్ పటేల్ 27 బంతుల్లోనే అర్థ సెంచరీ సాధించాడు. సిక్సర్ల సునామీతో కరీబియన్ బౌలర్లను ముంచెత్తాడు. మరో రెండు బంతులు మిగిలి ఉండగానే భారత్‌కు 2 వికెట్ల తేడాతో ఘన విజయం అందించాడు. ఈ విజయంతో వన్డే సిరీస్ 2-0తో భారత్ సొంతమైంది. అక్షర్ పటేల్ 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచాడు. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 50 ఓవర్లలో 6 వికెట్లకు 311 పరుగుల భారీ స్కోరు చేసింది. కెరీర్ 100వ వన్డేలో ఓపెనర్ షారు హోప్ (115, 135 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లు) శతకం సాధించగా, కెప్టెన్ నికోలస్ పూరన్ (74, 77 బంతుల్లో 1 ఫోర్, 6 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు.
కలసికట్టుగా..! : ఛేదనలో భారత్ సమిష్టి ప్రదర్శన చేసింది. టాప్ ఆర్డర్లో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (43, 49 బంతుల్లో 5 ఫోర్లు) ఆకట్టుకున్నాడు. స్కూప్ షాట్‌కు వెళ్లిన గిల్ విచిత్రంగా రిటర్న్ క్యాచ్‌తో వికెట్ కోల్పోయాడు. కెప్టెన్ ధావన్ (13), సూర్యకుమార్ యాదవ్ (9)లు నిరాశపరిచినా.. శ్రేయస్ అయ్యర్ (63, 71 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్), సంజు శాంసన్ (54, 51 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) నాల్గో వికెట్‌కు 99 పరుగులు జోడించారు. శ్రేయస్ 57 బంతుల్లో అర్థ సెంచరీ సాధించగా, శాంసన్ 47 బంతుల్లోనే ఆ మార్క్ చేరుకున్నాడు. అర్థ శతకాలు సాధించిన బ్యాటర్లు నిష్క్రమించినా.. లోయర్ ఆర్డర్లో అక్షర్ పటేల్, దీపక్ హుడా (33) అదరగొట్టారు. చివరి పది ఓవర్లలో 100 పరుగులు పిండుకున్న భారత్ రెండో వన్డేలో ఉత్కంఠ విజయం నమోదు చేసింది. మరో మ్యాచ్ ఉండగానే సిరీస్‌ను సొంతం చేసుకుంది.
స్కోరు వివరాలు
వెస్టిండీస్ ఇన్నింగ్స్ : 311/6 (షారు హోప్ 115, నికోలస్ పూరన్ 74, కైల్ మేయర్స్ 39, శార్దుల్ ఠాకూర్ 3/54)
భారత్ ఇన్నింగ్స్ : 312/8 (అక్షర్ పటేల్ 64, శ్రేయస్ అయ్యర్ 63, సంజు శాంసన్ 54, కైల్ మేయర్స్ 2/48)