Authorization
Mon Jan 19, 2015 06:51 pm
టీమ్ ఇండియా క్లీన్‌స్వీప్ విజయంపై కన్నేయగా.. ఆతిథ్య విండీస్ ఊరట విజయం కోసం ఆరాటపడుతోంది. కరీబియన్లపై వరుసగా రెండో వన్డే సిరీస్ క్లీన్‌స్వీప్ చేసే అవకాశం భారత్ ముంగిట నిలువగా, మరోవైపు వరుసగా ఎనిమిదో వన్డే ఓటమి ప్రమాదం ముంగిట విండీస్ నిలిచింది. తొలి రెండు వన్డేల్లో విండీస్ మంచి ప్రదర్శన చేసినా.. విజయం భారత్ పక్షాన నిలిచింది. నేడు నామమాత్రపు మ్యాచ్‌లో భారత్ ప్రయోగాలకు సిద్ధమవుతుండగా.. వెస్టిండీస్ విజయమే లక్ష్యంగా ఆడనుంది.
- భారత్ లక్ష్యం 3-0 విజయం
- వెస్టిండీస్ ఊరట పోరాటం
- విండీస్‌తో భారత్ మూడో వన్డే నేడు
- రాత్రి 7 నుంచి డిడిస్పోర్ట్స్లో ప్రసారం..
నవతెలంగాణ-పోర్ట్ ఆఫ్ స్పెయిన్ : విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్, జశ్‌ప్రీత్ బుమ్రాలు లేకుండానే వెస్టిండీస్‌పై వరుసగా రెండో వన్డే సిరీస్ క్లీన్‌స్వీప్ దిశగా భారత్ సాగుతోంది. బుమ్రా, షమి లేకపోయినా.. బౌలింగ్ విభాగం గొప్పగా రాణించింది. వికెట్ల వేటలో, పరుగుల పొదుపులో ఆకట్టుకుంది. బ్యాటింగ్ లైనప్లోనూ కీలక ఆటగాళ్లు లేరనే భావన కలుగలేదు. అవకాశాలను అందిపుచ్చుకున్న యువ బ్యాటర్లు సిరీస్‌ను భారత్ చేతుల్లో పెట్టారు. తొలి వన్డేలో మహ్మద్ సిరాజ్ కచ్చితత్వం భారత్‌ను గెలుపు పథంలో నడిపించగా.. రెండో వన్డేలో అక్షర్ పటేల్ ధనాధన్ విండీస్‌ను ఓటమి కోరల్లోకి నెట్టింది. సమిష్టి ప్రదర్శనకు వ్యక్తిగత మెరుపులు భారత్‌కు తోడయ్యాయి. నేడు గ్రీన్‌పార్క్ ఓవల్‌లో లక్ష్యాన్ని నిర్దేశించటమైనా, లక్ష్యాన్ని ఛేదించటమైనా భారత్ ఆడుతూ పాడుతూ స్వీకరించనుంది. మరోవైపు వెస్టిండీస్ మంచి ప్రదర్శన చేసినా.. వరుసగా ఓటమి పాలైంది. ఆ జట్టు మిడిల్ ఓవర్లలో గొప్పగా రాణించింది. భారత్‌ను కట్టడి చేసి విజయం దిశగా పట్టు బిగించింది. మంచి ప్రదర్శనల ఉత్సాహం నేడు ఊరట విజయం అందిస్తాయనే ఆరాటం కరీబియన్ శిబిరంలో కనిపిస్తోంది. భారత్, వెస్టిండీస్ చివరి వన్డే పోరు నేడు.
మిడిల్ మెరుగవ్వాలి : తొలి రెండు వన్డేల్లో భారత్ విజయఢంకా మోగించింది. మహ్మద్ సిరాజ్, అక్షర్ పటేల్ హీరోయిక్స్ భారత్‌కు సిరీస్‌ను అందించాయి. రెండో వన్డేల్లో ఇక్కడ రికార్డు లక్ష్యాన్ని ఛేదించిన భారత్.. చివరి పది ఓవర్లలో 100 పరుగులు పిండుకుంది. ఆరంభంలో, డెత్ ఓవర్లలో భారత బ్యాటింగ్‌కు ఎదురులేదు. కానీ 11-40 ఓవర్ల నడుమ బ్యాటింగ్ ఎంతో మెరుగుపడాలి. తొలి వన్డేలో మిడిల్లో 30 ఓవర్లలో 175 పరుగులు చేసిన భారత్ 4 వికెట్లు కోల్పోయింది. అదే రెండో వన్డేలో 5 వికెట్లు చేజార్చుకుని 170 పరుగులు చేసింది. మిడిల్ ఓవర్లలో భారత బ్యాటింగ్ కాస్త సమస్యగా మారుతోంది. మిడిల్ ఆర్డర్లో కీలక బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ సిరీస్‌లో నిరాశపరిచాడు. చివరి ఐదు వన్డే ఇన్నింగ్స్‌ల్లో అతడు 20 పరుగుల మార్క్ దాటలేదు. దీపక్ హుడా సైతం స్థాయికి తగ్గ ప్రదర్శన చేయాల్సి ఉంది. టాప్ ఆర్డర్లో కెప్టెన్ శిఖర్ ధావన్‌కు తోడు శుభ్‌మన్ గిల్ జోరుగా చెలరేగుతున్నాడు. శ్రేయస్ అయ్యర్‌కు విండీస్‌పై తిరుగులేని రికార్డుంది. ఆ జట్టుపై ఎనిమిది ఇన్నింగ్స్‌ల్లో ఏకంగా ఏడుసార్లు అర్థ సెంచరీలు సాధించాడు. సంజు శాంసన్ సైతం అర్థ సెంచరీతో ఫామ్‌లోకి వచ్చాడు. నేడు చివరి వన్డేలో మిడిల్ విజృంభిస్తే భారత్ పరిపూర్ణ విజయం సాధించినట్టు అవుతుంది. ఇక బౌలింగ్ విభాగంలో మహ్మద్ సిరాజ్ సీనియర్ పేసర్ బాధ్యతను మరోసారి సమర్థవంతంగా నిర్వర్తించాడు. చివరి మ్యాచ్‌లో ప్రసిద్ కృష్ణకు అవకాశం ఇచ్చే వీలుంది. రవీంద్ర జడేజా ఫిట్నెస్ సాధిస్తే అతడు తుది జట్టులోకి రానున్నాడు. అతడి కోసం అక్షర్ పటేల్‌ను బెంచ్‌కు పరిమితం చేస్తారా? చాహల్‌ను తప్పిస్తారా? అనేది చూడాలి.
విజయం దక్కేనా?: మంచి ప్రదర్శన చేసినా విండీస్‌కు విజయం దక్కలేదు. రెండు వన్డేల్లోనూ ఆ జట్టు గొప్పగా పోరాడింది. విజయానికి అత్యంత చేరువగా వచ్చింది. కానీ రెండు పర్యాయాలు నిరాశ తప్పలేదు. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో ఆ జట్టు మెరుగ్గా కనిపిస్తోంది. వన్డేల్లో ఫామ్ మెరుగుపర్చుకునే లక్ష్యంతో సిరీస్‌ను మొదలెట్టిన కరీబి యన్లు ఆ టార్గెట్‌ను చేరుకున్నట్టే భావించవచ్చు!. రెండో వన్డేల్లోనూ 50 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్.. చివరి వరకు విజయం కోసం రేసులో నిలిచింది. నేడు నామమాత్రపు మ్యాచ్‌లో విజయం కోసం ఆ జట్టు స్వల్ప మార్పులు చేసుకోవాలి. ముఖ్యంగా డెత్ ఓవర్లలో బౌలింగ్ ప్రదర్శన మెరుగుపడాలి. రోమారియో షెఫర్డ్ చివరి ఓవర్లలో ధారాళంగా పరుగులు ఇచ్చాడు. అల్జారీ జొసెఫ్ రెండు వన్డేల్లోనూ అదరగొట్డాడు. కీమో పాల్, జేసన్ హౌల్డర్లు నేడు మ్యాచ్‌కు అందుబాటులోకి వచ్చారు. ఆ ఇద్దరు తుది జట్టులో నిలిస్తే విండీస్ విజయావకాశాలు గణనీయంగా మెరుగవుతాయి. బ్యాటింగ్ విభాగంలో కైల్ మేయర్స్, షారు హౌప్, నికోలస్ పూరన్ సహా బ్రూక్స్ కీలకం కానున్నారు.
పిచ్, వాతావరణం : తొలి రెండు వన్డేలు ఆడిన వేదకలోనే మూడో మ్యాచ్ జరుగనుంది. రెండు రోజుల విరామమే కావటంతో నేడు కొత్త పిచ్‌ను వాడనున్నారు. ఇక్కడి పిచ్ బ్యాటర్లకు అనుకూలిస్తుంది. కానీ లెంగ్త్‌లు మారిస్తే సీమర్లు సైతం ప్రభావం చూపగలుగుతున్నారు. నేడు 300 పైచిలుకు స్కోర్లు నమోదు కానున్నాయి. టాస్ నెగ్గిన జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకోనుంది.
తుది జట్లు (అంచనా) :
భారత్ : శిఖర్ ధావన్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), దీపక్ హుడా, అక్షర్ పటేల్/రవీంద్ర జడేజా, షార్దుల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, యుజ్వెంద్ర చాహల్, అవేశ్ ఖాన్.
వెస్టిండీస్ : షారు హౌప్ (వికెట్ కీపర్), కైల్ మేయర్స్, షమ్రా బ్రూక్స్, బ్రాండన్ కింగ్, నికోలసన్ పూరన్ (కెప్టెన్), రోవ్‌మన్ పావెల్, అకీల్ హుస్సేన్, కీమో పాల్, అల్జారీ జోసెఫ్, జైడెన్ సీల్స్, హేడెన్ వాల్ష్.