Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఐసీసీ టీ20 ప్రపంచకప్ సమీపిస్తోంది. వరల్డ్‌కప్ ట్రోఫీపై కన్నేసిన భారత్.. ఇంకా తుది జట్టుపై ఓ అంచనాకు రాలేదు!. మెగా ఈవెంట్‌కు ముందు భారత్‌కు 15-16 మ్యాచుల సమయమే ఉంది. గెలుపు గుర్రాలను గుర్తించేందుకు రోహిత్, ద్రవిడ్ ద్వయానికి ఇదే సరైన తరుణం. వెస్టిండీస్‌పై మరో క్లీన్‌స్వీప్‌పై గురిపెట్టిన టీమ్ ఇండియా.. వరల్డ్‌కప్ ప్రణాళికలకు అనుగుణంగా ఐదు మ్యాచుల టీ20లో ఆడనుంది. భారత్, వెస్టిండీస్ తొలి టీ20 పోరు నేడు.
- ప్రపంచకప్ సన్నద్ధతపై భారత్ గురి
- వెస్టిండీస్‌తో భారత్ తొలి టీ20 నేడు
- రాత్రి 8 నుంచి డిడిస్పోర్ట్స్లో..
నవతెలంగాణ-తరౌబ
కరీబియన్లతో పొట్టి పోరు. ఏ జట్టుకు అయినా అది అత్యంత కఠిన సవాల్. భారత్ అందుకు మినహాయింపు కాదు. పూర్తి స్థాయి జట్టుతో కరీబియన్ దీవుల్లో అడుగుపెట్టిన రోహిత్ శర్మ..వెస్టిండీస్‌పై మరో క్లీన్‌స్వీప్ సిరీస్ విజయంపై కన్నేశాడు. టెక్నికల్‌గా మూడు దేశాల్లో జరుగుతున్న (ట్రినిడాడ్ అండ్ టొబాగో, సెయింట్ కిట్స్ అండ్ నేవిస్, అమెరికా) ఐదు మ్యాచుల టీ20 సిరీస్‌లో ఆతిథ్య వెస్టిండీస్ సైతం విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. గత పర్యటనలో పొట్టి ఫార్మాట్లోనూ విండీస్‌ను చిత్తు చేసిన టీమ్ ఇండియా.. ఇప్పుడూ అదే ఫలితం పునరావృతం చేసేందుకు సిద్ధమవుతోంది.
కుర్రాళ్లకు పరీక్ష! : టీ20 ప్రపంచకప్ జట్టులో ఆడే ఇద్దరు ముగ్గురు మినహా అందరూ ప్రస్తుతం విండీస్‌తో సిరీస్‌లో ఆడుతున్నారు. విరాట్ కోహ్లి విఫలమైనా.. ఇంగ్లాండ్‌పై వైట్‌బాల్ సిరీస్‌లో భారత్ అదరగొట్టింది. యువ ఆటగాడు దీపక్ హుడా విశేషంగా ఆకట్టుకున్నాడు. తాజా సిరీస్‌లో కనీసం మూడు మ్యాచుల్లోనైనా దీపక్ హుడా మంచి ప్రదర్శన చేస్తే వరల్డ్‌కప్ జట్టులో అతడికి చోటు ఖాయం. సూర్యకుమార్ యాదవ్ ఇంగ్లాండ్‌పై శతకంతో చెలరేగాడు. వన్డే సిరీస్‌లో విఫలమైన సూర్యకుమార్.. పొట్టి ఫార్మాట్లో ఫామ్ కొనసాగిస్తాడేమో చూడాలి. ఇక ఓపెనింగ్‌లో రోహిత్ శర్మ, రిషబ్ పంత్ జోడీ భారత్‌కు సంచలనాలు సృష్టించగలదు. ప్రస్తుతానికి గణాంకాల పరంగా ఈ జోడీ ప్రభావం కనిపించటం లేదు. కేవలం కుడి-ఎడమ కాంబినేషన్ కాకుండా.. పంత్, రోహిత్‌లు ప్రత్యర్థులపై తిరుగులేని ఆధిపత్యం చూపించగలరు. ప్రత్యేకించి కరీబియన్ గడ్డపై పవర్‌ప్లేలోనే స్పిన్నర్లకు బంతి అందుతుంది. తిరిగే బంతిపై ఈ జోడీ ఏ రీతిలో విరుచుకుపడుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హార్దిక్ పాండ్య, దినేశ్ కార్తీక్‌లు మంచి ఫామ్‌లో ఉన్నారు. తొలి బంతి నుంచి బౌండరీ బాదటంపై దినేశ్ కార్తీక్ దృష్టి పెట్టనున్నాడు. ఇక బౌలింగ్ విభాగంలో బుమ్రా, భువీ జోడీకి తోడుగా మూడో పేసర్ కోసం ఈ సిరీస్‌లో పోటీ జరుగనుంది!. హర్షల్ పటేల్, అవేశ్ ఖాన్, అర్షదీప్ సింగ్‌లు మూడో పేసర్ స్థానం కోసం పోటీపడుతున్నారు. అశ్విన్‌కు ఈ సిరీస్‌లో చోటు దక్కినా.. ప్రపంచకప్ ప్రణాళికల్లో అతడు ఉండటం అనుమానమే. జడేజా, వాషింగ్టన్ సుందర్‌లను కాదని అశ్విన్ నిరూపించుకోవాల్సి ఉంది. యుజ్వెంద్ర చాహల్ స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా తుది జట్టులో ఉండనుండగా.. కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోరులు బెంచ్‌కు పరిమితం కాకతప్పదేమో!.
పుంజుకోవాలని..! : వెస్టిండీస్ 50 ఓవర్ల ఫార్మాట్లో తేలిపోయినా.. 20 ఓవర్ల ఫార్మాట్లో కరీబియన్ అత్యంత బలమైన జట్టు. తాజాగా బంగ్లాదేశ్‌కు వన్డే సిరీస్ కోల్పోయినా..పొట్టి ఫార్మాట్లో ఆ జట్టును చిత్తు చేసింది. వెస్టిండీస్ కెప్టెన్ నికోలస్ పూరన్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. బ్రాండన్ కింగ్, షారు హోప్, షమ్రా బ్రూక్స్ సహా ఆల్‌రౌండర్ జేసన్ హోల్డర్ జోరుమీదున్నారు. కరీబియన్లు సహజసిద్ధ ప్రదర్శన చేసినా.. టీమ్ ఇండియాకు గట్టి పోటీ ఇవ్వవచ్చు. వన్డే సిరీస్‌లో వైట్‌వాష్ ఓటమి చవిచూసిన వెస్టిండీస్ టీ20 సిరీస్‌లో భిన్నమైన ఫలితం కోసం పోటీపడనుంది.
పిచ్, వాతావరణం : బ్రియాన్ లారా స్టేడియం ఇరు జట్లకూ కొత్త!. కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో ఇక్కడ ఆసక్తికర సమరాలు జరిగాయి. తొలి ఇన్నింగ్స్ సగటు స్కోరు 141. రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేసిన జట్టుకు విజయావకాశాలు ఎక్కువ. టాస్ నెగ్గిన జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకోనుంది. తొలి టీ20కి వర్షం ముప్పు పొంచి ఉంది. మ్యాచ్ సమయంలో సుమారు ఒక గంట పాటు వర్షం సూచనలు ఉన్నాయి.
తుది జట్లు (అంచనా) :
భారత్ : రోహిత్ శర్మ (కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, హార్దిక్ పాండ్య, దినేశ్ కార్తీక్, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అవేశ్ ఖాన్, యుజ్వెంద్ర చాహల్.
వెస్టిండీస్ :షారు హోప్, కైల్ మేయర్స్, బ్రాండన్ కింగ్, షమ్రా బ్రూక్స్, నికోలస్ పూరన్ (కెప్టెన్, వికెట్ కీపర్), కీచీ కార్టీ, జేసన్ హోల్డర్, రోవ్మాన్ పావెల్, అకీల్ హోస్సేన్, జైడెన్ సీల్స్, అల్జారీ జొసెఫ్.