Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 44వ చెస్ ఒలింపియాడ్ పోటీలు షురూ
- ప్రత్యేక ఆకర్షణగా తమిళ చరిత్ర, సంస్కృతి
నవతెలంగాణ, చెన్నై : తమిళనాడు చరిత్ర, సంస్కృతి ఉట్టిపడేలా సాంస్కృతిక కార్యక్రమాలు, చెస్ బోర్డు ఆకారంలో చిన్నారుల అద్వితీయ ప్రదర్శన, ఏఆర్ రెహమాన్ గాత్రం, విఘ్నేశ్ శివన్ దర్శకత్వ పర్యవేక్షణ, కమల్ హాసన్ నోట తమిళ చరిత్ర.. వెరసి 44వ చెస్ ఒలింపియాడ్ అట్టహాసంగా ఆరంభమైంది. జులై 28 నుంచి ఆగస్టు 10 వరకు జరిగే ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్ పోటీలు గురువారం చెన్నైలో ఆరంభ వేడుకలతో ఘనంగా మొదలయ్యాయి. తొలిసారి చెస్ ఒలింపియాడ్‌లో 350 జట్లు పోటీపడుతుండగా.. ఓపెన్ విభాగంలో 188, మహిళల విభాగంలో 162 జట్లు బరిలో నిలిచాయి. 187 దేశాలు పోటీపడుతున్న మెగా ఈవెంట్‌ను భారత ప్రధాని నరెంద్ర మోడీ లాంఛనంగా మొదలుపెట్టారు. 40 రోజుల పాటు 75 నగరాల్లో 27000 వేల కిలోమీటర్లు చుట్టివచ్చిన టార్చ్ రిలే.. చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ టార్చ్‌ను ప్రధాని మోడీ, తమిళనాడు సిఎం స్టాలిన్‌కు అందజేయటంతో ముగిసింది. 'ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్ భారత్‌లో జరగటం అదృష్టం. ఈ ఏడాది భారత్ 75 వసంతాల స్వాతంత్య్రంలోకి అడుగుపెడుతోంది. ఈ ప్రత్యేక సందర్భంలో 187 దేశాలకు చెందిన క్రీడాకారులకు ఆతిథ్యం ఇవ్వటం మాకు గౌరవం. అతిథి దేవో భవో అని భారత్‌లో విశ్వసిస్తాం. మూడు దశాబ్దాల తర్వాత ఆసియాలో జరుగుతున్న చెస్ ఒలింపియాడ్‌లో పోటీపడుతున్న అందరికీ శుభాకాంక్షలు. ఐక్యతను చాటడంలో క్రీడలది ఘనమైన వారసత్వం. ఆటల్లో ఓటమి ఉందదు!. విజేతలు, భవిష్యత్ విజేతలు మాత్రమే ఉంటారని' 44వ చెస్ ఒలింపియాడ్‌ను భారత ప్రధాని అధికారికంగా ఆరంభించారు.
ఆరంభ వేడుకల్లో చెస్ ఒలింపియాడ్ అధికారిక గీతం ' మన చెన్నై నగరానికి స్వాగతం' పాటను ఏఆర్ రెహమాన్ ఆలపించగా.. తమిళనాడు చరిత్రను ప్రఖ్యాత నటుడు కమల్ హాసన్ వీడియో రూపంలో వివరించారు. తమిళనాడు సంస్కృతి, సంప్రదాయాలు, చరిత్ర, వారసత్వం ఉట్టిపడేలా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. చెస్ ఒలింపియాడ్ ఆరంభ వేడుకలకు సినీ సూపర్‌స్టార్ రజినీకాంత్ సహా సినీ, రాజకీయ, క్రీడా రంగాల ప్రముఖులు హాజరయ్యారు.